
- అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకోవద్దని అధికారుల సూచన
- ఏడాదిలోపు ఉమ్మాపూర్ వద్ద శాశ్వత భవన నిర్మాణం
సిద్దిపేట, వెలుగు: కొత్తగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటైన హుస్నాబాద్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్‌కు హాస్టల్ వసతిని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్‌లో పెద్ద ఎత్తున సీట్లు భర్తీ అయినా హాస్టల్ లేకపోవడంతో చాలామంది విద్యార్థులు సెకండ్కౌన్సెలింగ్ లో ఇతర కాలేజీల్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి ఏర్పాటు చేసే దిశగా వైస్ చాన్స్ లర్ ఉమేశ్ కుమార్ చర్యలు చేపట్టారు.
మొదటి కౌన్సిలింగ్ లో 160 మంది విద్యార్థులు చేరినా హాస్టల్ లేపోవడంతో చాలా మంది ఇతర కాలేజీలకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 91 కి పడిపోయింది. ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక భవనంలో హాస్టల్ వసతి ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో మూడో కౌన్సెలింగ్ లో అడ్మిషన్లు పెరుగుతాయని భావిస్తున్నారు.
రెండు రోజుల కింద కలెక్టర్ హైమావతి ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించి అడ్మిషన్ల వివరాలు తెలుసుకున్నారు. పాలిటెక్నిక్ , ఇంజనీరింగ్ విద్యార్థులకు అవసరమైన విధంగా హాస్టల్ వసతిని ఏర్పాటు చేసి నీటి కొరత రాకుండా చూసుకోవాలని, ఐఓసీ రోడ్ నుండి కాలేజీ ప్రాంగణం వరకు సీసీ రోడ్ వేయించాలని అధికారులను ఆదేశించారు. డే స్కాలర్స్ కోసం హుస్నాబాద్ పట్టణం నుంచిఉదయం, సాయంత్ర వేళల్లో బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు.
సాకారమైన స్థానికుల కల
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హుస్నాబాద్ లోని పాలిటెక్నిక్ కాలేజీలోని మొదటి అంతస్తులో తాత్కాలికంగా ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటైన ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ఈ, ఏఐ, ఈసీఈ , ఐటీ బ్రాంచ్ ల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఒక్కో బ్రాంచిలో 60 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 240 మందితో పాటు ఈడబ్ల్యూఎస్ కోర్సులో మరో 24 మందికి అడ్మిషన్లు కల్పిస్తున్నారు.
ప్రస్తుత కౌన్సెలింగ్ లో హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీకి ఎస్ యూసీఈ కోడ్ ను కేటాయించి విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నారు. కాలేజీకి 54 మంది బోధన, 33 మంది బోధనేతర రెగ్యులర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాలకు మధ్యలో ఉండడంతో ఈ ప్రాంతాల్లోని విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను చదవడానికి అనువైనది గా హుస్నాబాద్ మారుతోంది.
తాత్కాలిక భవనంలో తరగతులు
ప్రస్తుతం తాత్కాలిక భవనంలో తరగతులు ప్రారంభించి ఏడాదిలోపు పట్టణ సమీపంలోని ఉమ్మాపూర్ వద్ద శాశ్వత కాలేజీ భవన నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ఉమ్మాపూర్ గుట్టల వద్ద 30 ఎకరాల భూమిని కేటాయించగా భవన నిర్మాణంతో పాటు ఇతర అవసరాల కోసం రూ.44.12 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పోతారం నుంచి కాలేజీ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపించారు.
బాల బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి
శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసే ఇంజనీరింగ్ కాలేజీలో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతిని కల్పించనున్నాం. కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, జనగాం జిల్లాలకు కేవలం 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు గొప్ప అవకాశంగా మారనుంది. విద్యార్థులు ఎవరూ అడ్మిషన్లు కాన్సల్ చేసుకోవద్దు. హాస్టల్ ఏర్పాటు కు సంబంధించి యుద్ద ప్రాతిపదికన పనులు చేపడుతున్నాం. - ఉమేశ్ కుమార్, వైస్ చాన్స్ లర్, శాతవాహన యూనివర్సిటీ