రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసినా హుస్సేన్​సాగర్ క్లీన్ కాలే

రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసినా హుస్సేన్​సాగర్ క్లీన్ కాలే
  • రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసినా.. హుస్సేన్​సాగర్ క్లీన్ కాలే
  • పరిశ్రమల నుంచి యథేచ్ఛగా కలుస్తున్న వ్యర్థాలు 
  • డైలీ బయో రెమిడియేషన్ చేస్తున్నా కంపు పోవట్లే 
  • ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను సర్కారు పట్టించుకోలేదనే ఆరోపణలు 

 హైదరాబాద్, వెలుగు : ఏండ్లు గడుస్తున్నా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరగడం లేదు. రిలాక్స్ అవుదామని ట్యాంక్​బండ్ పరిసర ప్రాంతాలకు వస్తున్న వారిని హుస్సేన్​సాగర్ మురుగు వాసన ఇబ్బందులకు గురి చేస్తోంది. ట్యాంక్​బండ్ చుట్టూ గ్రీనరీ, లైటింగ్ ఏర్పాట్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న ప్రభుత్వం.. అసలు సమస్య అయిన కంపును పట్టించుకోవడం లేదు.  సాగర్​ను క్లీన్ చేసేందుకు  దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పద్ధతులను వాడారు.  అందులో ఆస్ట్రియా మోడ‌‌‌‌ల్, లేజ‌‌‌‌ర్ క్లీనింగ్, గ్లోబ‌‌‌‌ల్ ట్రీట్​మెంట్ లాంటి ప్రయోగాల పేరుతో రూ. కోట్లు ఖర్చు చేశారు.  అయినా 10 ఏండ్ల కిందటికి ఇప్పటికీ పెద్దగా మార్పు కనిపించడం లేదని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. సాగర్​లో నీటి శుద్ధి కోసం హెచ్ఎండీఏ చేస్తున్న ఖర్చు నీళ్ల పాలే అవుతోంది.  మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలను హుస్సేన్ సాగర్‌‌‌‌లోకి  తీసుకొచ్చే నాళాలను మళ్లించే ప్రయత్నంలో సర్కార్ ఫెయిల్ అయిందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.  సాగర్‌‌‌‌లోకి వచ్చే వ్యర్థాలు, మురుగు నీటిలో 75  శాతం వాటా కూకట్‌‌‌‌పల్లి నాలాదే ఉంది.  ఇందులో నుంచి వచ్చే మురుగు నీటిలో 30 నుంచి -40  శాతం శుద్ధి చేయకుండానే హుస్సేన్ సాగర్‌‌‌‌లో కలుస్తోంది.  

నిర్వహణ పేరుతో ఖర్చు..

హుస్సేన్​సాగర్ క్లీనింగ్ మెయింటెనెన్స్ కోసం హెచ్ఎండీఏ ఏడాదికి దాదాపు రూ.100  కోట్లు ఖర్చు చేస్తోంది.  కానీ సాగర్ నీటిలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు.  కేవలం సాగర్ ప్రక్షాళన కోసం గతంలో ప్రభుత్వం జపాన్ నుంచి రూ.360  కోట్లు అప్పు తెచ్చి ఖర్చు పెట్టింది.  దీంతో పాటు  రాష్ర్ట  ప్రభుత్వం వంద కోట్ల నిధులు కేటాయించింది. నిధులన్నీ నీళ్ల పాలవుతున్నా సాగర్ ప్రక్షాళన మాత్రం ముందుకు సాగడం లేదు.  కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల  జేబుల్లోకి వెళ్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.  సాగర్‌‌‌‌‌‌‌‌లో నిత్యం కలుషిత నీరు చేరుతూనే ఉంటుంది.  ఎక్కువగా పారిశ్రామిక వ్యర్థ జలాలు వచ్చి చేరుతుంటాయి.  దీంతో హుస్సేన్ సాగర్ విషపూరితంగా మారింది. సాగర్‌‌‌‌‌‌‌‌లో రోజూ 450  నుంచి 500 ఎంఎల్‌‌‌‌డీల సీవరేజ్‌‌‌‌ వ్యర్థాలు కలుస్తున్నాయి. ఇందులో కేవలం కూక‌‌‌‌ట్​ప‌‌‌‌ల్లి నాలా నుంచే దాదాపు 350 ఎంఎల్‌‌‌‌డీల వ్యర్థాలు ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సాగ‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌లోని నీరు ఇలా పూర్తిగా రసాయన వ్యర్థాల రూపంలోకి మారుతున్నది. 


ALSO READ:  తెలంగాణ రాష్ట్ర తొలి ఓటరు రంభాబాయి

ఎన్ని చేసినా అంతే..

హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌ నీటిని శుద్ధి చేసేందుకు బయో రెమిడియేషన్  రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఏడాదికి దాదాపు రూ. 25 కోట్లు ఖర్చు అవుతున్నాయి.  నాలాల నుంచి మురుగునీరు వచ్చి కలుస్తుండటంతో అది ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదని పర్యావరణవేత్తలు అంటున్నారు.  పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలపై పకడ్బందీగా చర్యలు తీసుకుంటే తప్ప సాగర్ నీళ్లు శుద్ధి కావడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఫతేనగర్‌‌‌‌‌‌‌‌లో ఎస్టీపీ నిర్మిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.  అది అందుబాటులోకి వచ్చినా కూడా పూర్తి స్థాయిలో వ్యర్థాలు శుద్ధి కావడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. 

మంచినీటి చెరువుగా  మారుస్తమని హామీ

హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌ను శుద్ధి చేస్తామని, మంచి నీటి చెరువుగా మారుస్తామని సీఎం కేసీఆర్ 2014లోనే హామీ ఇచ్చారు.  సాగర్​ను మంచినీళ్లతో నింపుతామని,  వాటిని నగర వాసులకు అందిస్తామన్న  కేసీఆర్ ఆ హామీని మరచిపోయారు. కనీసం హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను బీఆర్ఎస్ సర్కారు పరిరక్షించలేకపోయిందన్న ఆరోపణలున్నాయి.  ఈ హామీ ఇచ్చి రెండుసార్లు అధికారం చేపట్టినా కూడా సాగర్‌‌‌‌‌‌‌‌లో మంచి నీళ్లు నింపడం కాకుండా కనీసం దాంట్లో కలుస్తున్న మురుగునీటిని కూడా ఆపలేకపోయారే విమర్శలున్నాయి.