వీణవంక/ హుజూరాబాద్, వెలుగు: కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క–సారలమ్మ జాతరలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వివరాలిలా ఉన్నాయి.. వీణవంక మండలకేంద్రంలో నిర్వహించిన సమ్మక్క– సారలమ్మ జాతరకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు దర్శనం చేసుకొని వెంటనే వెళ్లిపోవాలని పోలీసులు.. ఆయనకు సూచించారు.
దీంతో సమ్మక్క దేవత వచ్చేవరకు తాను అక్కడే ఉంటారని గద్దెల వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఎమ్మెల్యేకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లేందుకు ససేమిరా అనడంతో అతడిని తరలించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో తోపులాట జరగడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్చేశారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులను అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు.
అంతకుముందు వీణవంకు జాతరకు పరిమిత వాహనాలను అనుమతి ఉందని పోలీసులు చెప్పడంతో హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద కౌశిక్ రెడ్డిని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కుటుంబసభ్యులతో కలిసి వరంగల్– కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. కాగా వీణవంక జాతర నిర్వహణ విషయంలో యాప్ టీవీ సీఈవో పాడి ఉదయానందన్‌రెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పురావడంతో ఈ వివాదం జరిగినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
