జర్నీ ఫర్ లవ్ !

జర్నీ ఫర్ లవ్ !

ప్రపంచంలో ఉండే రకరకాల ప్రదేశాలని, మనుషులని చూడాలని అందరికీ ఉంటుంది. కానీ అలా ప్రయాణం చేయటం మాత్రం అందరికీ కుదిరేపని కాదు.  “తిరగాలన్న కోరిక బలంగా ఉండాలి.  మిగతావన్నీ తర్వాత అవే వస్తాయి” అంటాడు సన్నీ సింగ్. లఢఖ్​ రూట్​లో మూడు సార్లు జర్నీ చేశాడు బైకర్ సన్నీ సింగ్‌. ఇది ప్రతీ బైకర్‌‌ డ్రీమ్ జర్నీ . హైదరాబాద్ బుల్లెట్ బైక్స్​కి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిన ఈ ముప్పయ్యారేళ్ల రైడర్ సన్నీ సింగ్ ఇంటర్వూ…

బైక్‌‌ రైడ్​ ఇంట్రెస్ట్ ఎలా మొదలైంది?

అమ్మా నాన్నా ఇద్దరూ ఆర్మీలోనే పనిచేసేవాళ్లు. నేను పుట్టింది, పెరిగిందీ నార్త్​లో. స్కూలింగ్​ చాలా చోట్ల జరిగింది. అందుకే నా సొంత ప్లేస్ ఇదీ అని చెప్పలేను.  ఇరవయ్యేళ్ల కిందట హైదరాబాద్ వచ్చాను. ప్రస్తుతం నా ఊరు హైదరాబాద్. అమ్మ ఆర్మీ మెడికల్ డాక్టర్. నాన్న సిగ్నల్స్ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఉండేవాళ్లు. చిన్నప్పట్నుంచి నాకూ బుల్లెట్ బైక్ అంటే ఇష్టం. నాన్న దగ్గర ఆర్మీ బైక్ ఉండేది. అది నడుపుతున్న నాన్నని చూసినప్పుడల్లా  హీరోలా కనిపించేవాడు. సో.. నాకూ హీరో అయిపోవాలనిపించింది. ఎనిమిదో తరగతి చదివేటప్పుడు మొదటిసారి బైక్ నడిపాను.

ఎడ్యుకేషన్  సంగతేంటి?

చదువులో బ్యాక్ బెంచర్. చదువుకన్నా ఎక్కువగా బయట ఏం జరుగుతోంది? చెట్లమీద పిట్టలు వర్షంలో ఎలా ఉంటాయి? వంటి ఆలోచనలే ఎక్కువగా ఉండేవి. ఒంటరిగా అడవిలో తిరిగేవాడ్ని. అమ్మానాన్న ఆర్మీలో  ఉండటం వల్ల నా స్కూల్స్ కూడా  ఇంటీరియర్ ప్లేసుల్లోనే ఉండేవి. సిక్కిం, డార్జిలింగ్, కోటా, ఢిల్లీ, లూథియానా… ఇలా ప్రతీ రెండేళ్లకి ఒకసారి స్కూల్ మారాల్సి వచ్చేది.

బైకర్ గా మారాలని ఎప్పుడు అనిపించింది?

మా కజిన్​తో కలిసి వెళ్ళినప్పుడు సీటీ 100 బైక్ మీద ఆయనతో పాటు సౌత్ ఇండియా బెల్ట్ మొత్తం తిరిగాను. అలా తిరగటం, కొత్త కొత్త మనుషులని చూడటం నచ్చింది. ఇలా కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోయేవాడ్ని. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన అనాటమీ ఉండే మనుషులు, పలు రకాల ఫుడ్, ఊళ్లు ఇవన్నీ చూసి  బైకర్ కావాలన్న కోరిక బలపడింది. 22 ఏళ్ల వయసులో  బైకింగ్ మొదలు పెట్టాను. క్యాస్ట్ ఐరన్ “ఎలక్ట్రా బుల్లెట్” బైక్ నా మొదటి వెహికల్.

బైకర్ లేదా ట్రావెలర్​… ఎలా డిఫైన్​ చేసుకుంటారు?

బైకర్ కమ్‌‌ ట్రావెలర్. రెండూ కలిపితేనే ఇష్టం. అయితే…! జర్నీ చేయటం కోసం నేను వెయిట్ చేయను. పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్ కోసం ఎదురుచూడలేను. బస్, లేదా ట్రైన్ మిస్సయితే అక్కడే ఎదురుచూస్తూ ఉండాలి. అలా నేను వెయిట్ చేయలేను.  బైక్ మీద వెళ్లటంలో ఒక ఎనర్జీ ఉంటుంది. దాన్ని మిస్సవ్వను.

ఇప్పటి వరకూ ఎన్ని రకాల బైక్స్ వాడారు?

దాదాపుగా మన ఇండియన్ బైక్స్ అన్నీ వాడాను. ఎక్కువగా నచ్చేది మాత్రం రాయల్ ఎన్​ఫీల్డ్. ఇప్పటివరకూ దాదాపుగా 3.6 లక్షల కిలోమీటర్స్ తిరిగి ఉంటాను. ఇప్పుడు వాడుతున్న బైక్​, రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 411సీసీ. ఒక్కరోజు బైక్ వాడకపోయినా ఏదో మిస్ అయిన ఫీలింగ్​.

లాక్ డౌన్​లో బైక్ నడిపే ఛాన్స్ లేదు కదా ?

ఆ బాధ మామూలుది కాదు. అర్థరాత్రి అవ్వగానే మా కాలనీలో అటూ ఇటూ తిరిగేవాడ్ని.  మా అంకుల్ దగ్గర ఒక ఓల్డ్ బైక్ ఉంది. దాన్ని డిస్మాంటిల్ చేసి, మళ్లీ బిగించాను. మా వాళ్లంతా నవ్వుకున్నా నా బాధలు నేను పడ్డాను.

రైడ్ కి వెళ్ళాలంటే ముందుగా గుర్తొచ్చేవి ఏంటి?

కండిషన్​లో ఉన్న బైక్… మంచి హెల్మెట్, హ్యాండ్ గ్లోవ్స్, కంఫర్టబుల్​ షూస్, నీ గార్డ్స్ , రూట్ మ్యాప్. జర్నీలో బైక్ మరీ స్పీడ్ గా నడపను.

మీలాంటి వాళ్లు ఇంకా చాలామంది ఉన్నారా?

మాకో కమ్యూనిటీనే ఉంది. ‘‘బాబ్ మెక్ ఇండియా’’ (బ్రదర్ హుడ్ ఆఫ్ బులెటియన్స్ మోటర్‌‌‌‌సైకిలింగ్ కన్సాటియం ఇండియా) అనే ఒక రైడర్స్ కమ్యూనిటీ ఉంది. మొత్తం మన దేశంలో 210 క్లబ్స్ ఈ ఫోరంలో ఉన్నాయి. ‘ఎక్స్‌‌ట్రీమ్‌‌ బైకర్స్ క్లబ్’  నుంచి ఆ ఫోరంలో నేను మోడరేటర్‌‌‌‌ని. మన దేశం మొత్తం మీద ఇలాంటి వాళ్లు పదివేలమంది ఉన్నారు.

జర్నీలకి కావాల్సిన డబ్బు ఎలా వస్తుంది?

మొదట్లో కొంత డబ్బు మనం సేవ్ చేసుకోవాల్సిందే. ఎప్పుడైతే అది మార్కెటింగ్ చేయాలన్న ఆలోచన వచ్చిందో మన రైడ్ హిస్టరీ చూసి స్పాన్సర్స్ వస్తారు. జర్నీకి కావాల్సిన ఫ్యూయల్, బైక్‌‌కి కావాల్సిన టైర్స్ కూడా స్పాన్సర్ చేస్తారు. నేనో ప్రొడక్ట్ వాడుతున్నాను అంటే… దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టే కదా. కొన్ని సార్లు బైక్ మీద రివ్యూ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు బైక్‌‌ని ఆ జర్నీవరకూ స్పాన్సర్ చేస్తారు. అందులో ఏవైనా మాడిఫికేషన్స్ అవసరం ఉంటే చెప్పాలి.

రాయల్ ఎన్‌‌ఫీల్డ్‌‌కి బ్రాండ్ అంబాసిడర్  ఆఫర్..?

హైదరాబాద్ రాయల్ ఎన్ ఫీల్డ్ ఒక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసింది. దానికి అన్ని క్లబ్స్ నుంచి అప్లికేషన్స్ తీసుకున్నారు. అలాగే నాకూ వచ్చింది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే 200 మందికి పైగా వచ్చారు. బైక్ రిపేరింగ్ దగ్గర్నుంచి, ఏ మోడల్? ఎలా ఉంటుంది? దానిలో ఏమైనా మార్పులు ఉండాలా? అని అడిగారు. నాకు తెలిసింది చెప్పాను. మూడు నెలల తర్వాత సెలక్ట్ అయినట్టు ఫోన్​ వచ్చింది. 200  మందిలో సెలక్ట్ అయ్యింది నేనొక్కడినే. బైక్ టెస్ట్ రైడ్ చేయటం, కావాల్సిన మాడిఫికేషన్స్ సజెస్ట్ చేయటం, దాన్ని ప్రమోట్ చేయటం నాపని. మనసుకునచ్చిన పని కాబట్టి చేస్తూనే ఉన్నాను. ఏపీ అండ్ తెలంగాణా రీజియన్స్​కి నేనే బ్రాండ్ అంబాసిడర్.

ఫ్యామిలీని మిస్​ అవ్వరా?

నా లైఫ్ పార్ట్​నర్​కి ముందే నా గురించి తెలుసు. నా ప్యాషన్​కి తనెప్పుడూ అడ్డు చెప్పదు. ఒక జర్నీ చేసొచ్చాక పూర్తిగా తనతోనే ఉంటాను. జర్నీల్లో ఉన్నా కూడా నన్ను మిస్ అయ్యే చాన్స్ ఇవ్వను. పిల్లలతోకూడా ఎక్కువ టైం గడుపుతాను. అలా నా ప్యాషన్, ఫ్రొఫెషన్, ఫ్యామిలీ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంటాను. పుస్తకాలు చదవటం, బైకింగ్ ఈ రెండూ నాకు చాలా ఇష్టం.

ట్రావెలర్స్​కి బుక్ రీడింగ్ అంటే ఇష్టముంటుందా?

అందరికీ ఉందో, లేదో తెలియదు. నాకు మాత్రం బయోగ్రఫీలు, ట్రావెల్ బుక్స్ చాలా ఇష్టం. కుష్వంత్ సింగ్ కథలు బాగా నచ్చుతాయి.
చే గువేరా మోటార్ సైకిల్ డైరీస్‌‌తో సహా ఆయన మీద వచ్చిన బుక్స్ అన్నీ ఇష్టమే. మేబీ… బుక్ రీడింగ్ వల్లనే ఇంకా ఎక్కువ జర్నీ చేయాలనే ఉత్సాహం వస్తుంటుంది కాబోలు.

చాలా రిస్క్ అనిపించిన జర్నీ ఏదైనా ఉందా?

రిస్క్ అనిపించలేదు. కానీ… లడఖ్​ వెళ్ళినప్పుడు ఒక రాత్రి మైనస్ 15 డిగ్రీస్ చలిలో బైక్ నడుపుకుంటూ వెళ్ళటం చాలా కష్టం అనిపించింది. ఎక్కడా ఆగటానికి వీల్లేదు, ఒక్క మనిషీ కనిపించడు. అంతేకాదు అది వరల్డ్​లోనే రిస్కీయెస్ట్ రూట్స్​లో ఒకటి. ఆ రోజు ఇక నాపని అయిపోయింది అనుకున్నాను. కానీ జర్నీ పూర్తయ్యాక చాలా థ్రిల్ ఫీలయ్యాను.

జర్నీ వల్ల మీరు ఏం నేర్చుకున్నారు?

ప్రేమించటం… మనుషులని మాత్రమే కాదు, ప్రతీ విషయాన్ని ప్రేమించటం నేర్చుకున్నాను. నిజానికి సొసైటీకి  డైరెక్ట్‌‌గా ఏమీ ఇవ్వలేం. ఎప్పుడో ఒక ఉదయం నిద్రలేచేసరికి సన్నగా కురుస్తున్న మంచు, చుట్టూ పక్షుల కూతలు, అడవిలోనుంచి వచ్చే గాలి తగులుతున్నప్పుడు… మొదట చాయ్ తాగేదగ్గర కనిపించే మనిషి చూపించే ప్రేమకి సాటి వచ్చేది ఏదీ ఉండదు. అదే తెలుసుకున్నాను. దానికి అడిక్ట్ అయ్యాను. అందుకే నాకు ఎప్పుడూ బైకింగ్ బోర్ కొట్టదు. హ్యాపీగా ఉండాలంటే… నచ్చిన పని చేస్తూ పోవటమే. జర్నీ వల్లే నా బోర్‌‌‌‌డమ్ పోగొట్టుకున్నాను. బ్యాక్ బెంచర్‌‌‌‌ని కాస్తా ఎంబీయే చదివాను. సైకాలజీలో మాస్టర్స్ చేశాను. కౌన్సెలింగ్ ఇస్తుంటాను. జర్నీలో ఈ ప్రపంచం  నాకు చాలా ఇచ్చింది. నేను తిరిగి ఏమివ్వగలనా?
అని వెతుక్కుంటూ తిరుగుతున్నాను… అంతే.

బైక్ జర్నీలకి ఏ సీజన్ మంచిది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సీజన్ అంటూ ఏమీ ఉండదు. జర్నీ చేయాలనిపిస్తే చాలు. అయితే బిగినర్స్ మాత్రం చలికాలం, కొన్ని ప్రదేశాలకి వర్షాకాలం వెళ్లటమే మంచిది. ఎందుకంటే డీహైడ్రేషన్, సన్ ఎలర్జీ ఉంటే బైక్ మీద వెళ్ళటం ఏమాత్రం మంచిది కాదు. సమ్మర్ లో అయితే దగ్గరగా ఉండే ప్లేసెస్, మార్నింగ్ అవర్స్ జర్నీ మంచిది. జర్నీ చేసేముందు బైక్​ని పూర్తిగా సర్వీస్ చేయించాలి. టూల్‌‌కిట్ మర్చిపోవద్దు. స్పేర్ ట్యూబ్, క్లచ్, బ్రేక్ వైర్స్, చైన్ లింక్ ఎక్స్‌‌ట్రా సెట్ ఉంచుకోవాలి.  బ్రేక్ సెట్ చేసుకోవటం, స్పార్క్ ప్లగ్ చెక్ చేయటం తెలిసి ఉండాలి. ఒక టెంట్, కంఫర్ట్​గా ఉండే బట్టలు, నీ గార్డ్స్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా లైసెన్స్, రోడ్ సెన్స్ ఉండాలి. కొంచెం ఖరీదైనా సరే మంచి క్వాలిటీ హెల్మెట్ తీసుకోవటం మర్చిపోవద్దు.
బైక్​ రిపేర్ చేసుకోవటం తెలిసి ఉండాలి.