గ్రూప్–1 పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదు :హైదరాబాద్ కలెక్టర్

గ్రూప్–1 పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదు :హైదరాబాద్ కలెక్టర్

హైదరాబాద్: ఈ నెల 16న నిర్వహించినగ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న ఆరోపణలను హైదరాబాద్ కలెక్టర్ కొట్టిపారేశారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు  ఆయన  ప్రకటన విడుదల చేశారు. నగరంలోని మూడు సెంటర్లలో ఇన్విజిలేటర్ల తప్పిదం వల్ల గ్రూప్–1పరీక్షను ఆలస్యంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సికింద్రాబాద్ మారేడ్ పల్లి లోని సెయింట్ ఫ్రాన్సిస్ డీ సేల్స్ (ఎస్ఎఫ్ఎస్) హైస్కూల్ లో మూడు రూముల్లో మొత్తం 47 మంది అభ్యర్థులకు ఇంగ్లీష్/తెలుగు ప్రశ్నాపత్రానికి బదులు ఇంగ్లీష్/నాన్ తెలుగు లాంగ్వేజ్ ప్రశ్నాపత్రం ఇచ్చారని తెలిపారు. దీంతో  అభ్యర్థులు అయోమయానికి గురయ్యారని, అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారికి ఇంగ్లీష్/తెలుగు ప్రశ్నాపత్రాలు, కొత్త ఓఎంఆర్ షీట్లను ఇచ్చారని స్పష్టం చేశారు. అయితే కొత్త ఓఎంఆర్ షీట్లలో రాస్తే తమ ప్రశ్నాపత్రాలను టీఎస్పీఎస్ మూల్యాంకనం చేయదనే అనుమానంతో అభ్యర్థులు నిరసనకు దిగారని, అయితే కలెక్టర్ తో పాటు టీఎస్ పీఎస్ అధికారులు వాళ్లకు సర్ది చెప్పడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు వాళ్లు తిరిగి తమ పరీక్షను కొనసాగించారని తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వాళ్ల నుంచి ఓఎంఆర్ షీట్లను తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 

అబిడ్స్ లోని మరో రెండు సెంటర్లలో కూడా...

అబిడ్స్ లోని మరో రెండు సెంటర్లలో కూడా గ్రూప్–1పరీక్షను అధికారులు ఆలస్యంగా నిర్వహించారు. అబిడ్స్ లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీ సెంటర్ లో కూడా ఇంగ్లీష్/తెలుగు ప్రశ్నా పత్రానికి బదులు ఇంగ్లీష్/నాన్ తెలుగు లాంగ్వేజ్ ఇవ్వడం కొంత ఆలస్యం అయ్యింది. దీంతో  ఇద్దరికి 15 నిమిషాలు, ఐదుగురికి 30 నిమిషాల  అదనపు సమయాన్ని ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. అలాగే అబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో 15 మందికి 7 నిమిషాల అదనపు సమయాన్ని పరీక్ష కోసం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అభ్యర్థులు కోల్పోయిన సమయాన్ని వారికి కేటాయించామని, అంతే తప్ప గ్రూప్ 1 పరీక్షలో ఎలాంటి తప్పులు జరగలేదని కలెక్టర్ తేల్చి చెప్పారు. ఆలస్యానికి కారణమైన ఇన్విజిలేటర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్  స్పష్టం చెప్పారు.