
అబిడ్స్‌లోని బిల్డింగ్ పోలీస్ శాఖకు అప్పగింత
త్వరలో అక్కడ సౌత్ వెస్ట్ డీసీపీ ఆఫీస్ ఏర్పాటు
1948 నుంచి అబిడ్స్‌లో కొనసాగిన హైదరాబాద్ కలెక్టరేట్
ఇక రంగారెడ్డి జిల్లా పాత కలెక్టరేట్ బిల్డింగ్ నుంచి సేవలు
హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అబిడ్స్‌లో కొనసాగుతున్న హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లక్డీకపూల్ లోని పాత రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్బిల్డింగ్లోకి షిఫ్ట్ అయింది. ఇక నుంచి ఏ పనులు కావాలన్నా లక్డీకపూల్ వెళ్లాల్సిందే. 1948 నుంచి అబిడ్స్ లో హైదరాబాద్ కలెక్టరేట్ కొనసాగుతూ వచ్చింది. కలెక్టరేట్ బిల్డింగ్పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో 1990లో అక్కడే నాలుగు అంతస్తులతో కొత్త బిల్డింగ్ నిర్మించారు. కలెక్టర్ చాంబర్‌తోపాటు కొన్ని విభాగాలను కొత్త బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేశారు. స్పేస్సరిపోక చాలా శాఖల ఆఫీసులు వేర్వేరుగా దూరంగానే ఉంటున్నాయి. మొత్తం 32 విభాగాలను నిర్వహించడానికి స్థలం లేకపోవడంతో 17 ఏండ్ల కిందట మాసాబ్ ట్యాంక్ వద్ద ఎకరం ప్రభుత్వ స్థలంలో కొత్త కలెక్టరేట్‌కాంప్లెక్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ నిర్మాణం జరగలేదు. కొంతకాలంగా కలెక్టరేట్బిల్డింగ్ సరిపోకపోవడంతోపాటు పాత బిల్డింగ్శిథిలావస్థకు చేరింది.ఈ క్రమంలో లక్డీకాపూల్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కొంగర కలాన్ కి మారడంతో అక్కడ బిల్డింగ్ ఖాళీ అయింది. దీంతో హైదరాబాద్ కలెక్టరేట్ ను లక్డీకపూల్కి షిఫ్ట్ చేశారు. సిటీ సెంటర్ లో ఉండటంతోపాటు, బిల్డింగ్అన్ని శాఖలకు సరిపోతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
రెండింటిలో ఒకటి ఇక్కడ
పోలీస్‌శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ వెస్ట్ జోన్‌డీసీపీ ఆఫీసుకు అబిడ్స్ బిల్డింగ్ ను కేటాయించారు. మొన్నటిదాకా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్ జోన్ లు ఉండేవి. తాజాగా సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ పేర్లతో రెండు కొత్త జోన్లను పోలీస్‌శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో సౌత్ ఈస్ట్ డీసీపీ ఆఫీసును సైదాబాద్‌లో ఏర్పాటు చేయగా, సౌత్ వెస్ట్ డీసీపీ ఆఫీసును అబిడ్స్‌లోని కలెక్టరేట్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ సౌకర్యం, సరిపడా గదులు ఉన్నాయి. కానీ బిల్డింగ్మాత్రం చాలా పాతది.
డీఎంహెచ్ఓ, డీఈఓ ఆఫీసులు మినహా
హైదరాబాద్ కలెక్టరేట్ లో మొత్తం 32 విభాగాలు ఉన్నాయి. ఇందులో రెండు మినహా మిగిలిన 30 విభాగాలు లక్డీకపూల్ బిల్డింగ్ కు షిఫ్ట్ అయ్యాయి. డీఎంహెచ్ఓ, డీఈఓ ఆఫీసులకు ఎక్కువ స్పేస్ అవసరం ఉండటంతో వాటిని ప్రస్తుతం ఉన్నచోటే కొనసాగిస్తున్నారు. హైదరాబాద్డీఈఓ ఆఫీస్ మహబూబియా కాలేజీలో, డీఎంహెచ్ఓ ఆఫీస్ సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
కొత్త బిల్డింగ్ నిర్మాణం లేనట్టేనా?
హైదరాబాద్ కలెక్టరేట్ కొత్త కాంప్లెక్స్ కోసం 2007, ఏప్రిల్ లో రూ.10 కోట్లు మంజూరు అయ్యాయి. ఆర్ అండ్ బీ శాఖ, ప్రైవేట్ కన్సల్టెంట్కంపెనీతో కలిసి 10 అంతస్తుల్లో నిర్మించాలని అప్పట్లో డిజైన్‌కూడా చేసింది. కాంప్లెక్స్ అంచనా వ్యయం రూ.46 కోట్లు కాగా, ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏ మూలకు సరిపోక పనులు మొదలు పెట్టలేదు. 2008 మార్చిలో బడ్జెట్ గడువు ముగియడంతో కలెక్టరేట్‌కాంప్లెక్స్ నిర్మాణ ప్రతిపాదన పెండింగ్‌లో పడింది. ఆ తర్వాత హైదరాబాద్జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నవీన్ మిట్టల్ మరో ఆర్కిటెక్ట్ ద్వారా ప్లాన్‌ను ఆరు అంతస్తులకు తగ్గించి రూ.22 కోట్ల అంచనాతో లక్షా80 వేల చదరపు అడుగుల ఏరియాలో బిల్డింగ్ నిర్మించేలా డిజైన్ చేయించారు. మార్పులు, చేర్పులతో ప్రపోజల్స్ ను ప్రభుత్వ ఆమోదానికి పంపగా, కలెక్టరేట్ కాంప్లెక్స్ భూ వేలంతో వచ్చిన మొత్తాన్ని కొత్త కాంప్లెక్స్ నిర్మాణానికి ఉపయోగించాలని సూచించింది. దీంతో నిర్మాణం పెండింగ్‌లో పడింది. ప్రస్తుతం అబిడ్స్ నుంచి కలెక్టరేట్‌ను లక్డీకపూల్కి మార్చడంతో ఇక కొత్త బిల్డింగ్ నిర్మాణం లేనట్టుగా తెలుస్తోంది.