మొబైల్ యాప్స్ తో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్.. ఛేదించిన హైదరాబాద్ పోలీసులు

మొబైల్ యాప్స్ తో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్.. ఛేదించిన హైదరాబాద్ పోలీసులు

రూ.903 కోట్ల మొబైల్ యాప్ ఇన్వెస్ట్మెంట్ మోసానికి సంబంధించిన బండారాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బయటపెట్టారు. అధిక వడ్డీ ఆశచూపి ప్రజల నుంచి మొబైల్ యాప్స్ ద్వారా పెట్టుబడులు సేకరించి చీటింగ్ కు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సి.వి.ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఢిల్లీకి చెందిన నవనీత్ కౌశిక్  తాను ఆర్బీఐ లైసెన్సులు పొందిన రంజన్ మనీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, కేడీఎస్  అనే మనీ చేంజింగ్ ఎక్స్ఛేంజీల ద్వారా రూ.903 కోట్ల మనీలాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించామన్నారు. రంజన్ మనీ కార్పొరేషన్ ద్వారా 7 నెలల్లోనే రూ.441 కోట్లను, కేడీఎస్ ద్వారా 38 రోజుల్లోనే రూ.462 కోట్లను డాలర్లుగా మార్చి విదేశాలకు పంపారని దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. ఈ రెండు మనీ చేంజింగ్ ఎక్స్ఛేంజీలు ఫెమా యాక్ట్  నిబంధనలు ఉల్లంఘించాయని తెలిపారు. 

ముగ్గురు సూత్రధారుల్లో ఇద్దరు చైనాలో..

ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కు సంబంధించిన ముఠాను నడిపిస్తున్న ముగ్గురు సూత్రధారుల్లో ఇద్దరు చైనాలో ఉన్నారని సీవీ ఆనంద్ చెప్పారు. మరో సూత్రధారి తైవాన్ కు చెందిన చూ చున్ యు ముంబైలో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఢిల్లీలో ఉండే సాహిల్, సన్ని.. దుబాయ్ లో ఉండే వరుణ్ అరోరా, భూపేశ్ అరోరా ద్వారా ఇండియాలో జరిగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వ్యవహారాలను చూ చున్ యు పర్యవేక్షించే వాడని గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు చైనీస్ తో పాటు మొత్తం 10 మంది అరెస్టు చేశామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం రూ.10వేల కోట్లకుపైగా ఇన్వె్స్ట్మెంట్ ఫ్రాడ్ జరిగి ఉండొచ్చని అంచనా వేశారు. 

కంబోడియా కేంద్రంగా స్కాం

కంబోడియా కేంద్రంగా ఈ స్కాం నడుస్తోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ‘‘ అధిక వడ్డీ ఆశతో మొబైల్ యాప్స్ ద్వారా ప్రజలు పెట్టే పెట్టుబడి మొత్తాన్ని 38 వర్చువల్ అకౌంట్ల ద్వారా మనీ చేంజింగ్ ఎక్స్ఛేంజీలకు పంపేవారు. అక్కడ వాటిని డాలర్లుగా మార్చి విదేశాల్లోని అకౌంట్లకు పంపేవారు. హైదరాబాద్ కు చెందిన ముగ్గురు ఇక్కడ రెండు వర్చువల్ అకౌంట్స్ ఓపెన్ చేసి చైనీస్ కి హెల్ప్ చేస్తున్నారు’’ అని సీవీ ఆనంద్ తెలిపారు. DRI, ED విభాగాలను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి మరింత డీప్ గా విచారణ చేస్తామన్నారు. 

ఆ ఫిర్యాదుతో వెలుగులోకి.. 

తార్నాకకు చెందిన ఒక వ్యక్తి అధిక వడ్డీ ఆశతో గూగుల్ ప్లే స్టోర్ లోని లాట్సమ్  అనే యాప్ ద్వారా రూ.1.16 లక్షలను ఇన్వెస్ట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ యాప్  నిర్వాహకుల నుంచి స్పందన రాలేదు. దీంతో అతడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేయగా ఆ డబ్బులు జమ అయిన అకౌంట్ ‘జిందై టెక్నాలజీ’ అనే కంపెనీ పేరు మీద ఉన్నట్లు తేలింది. దీనితో లింక్ అయి ఉన్న వీరేందర్ సింగ్ అనే వ్యక్తిని పుణెలో పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారిస్తే తాను జాక్, జాకెన్ పి అనే ఇద్దరు చైనీయులు చెప్పినట్టుగా ఇండియాలో పనిచేస్తున్నానని ఒప్పుకున్నాడు.