V6 News

ఫోన్ ట్యాపింగ్ వెనకున్న సుప్రీం ఎవరు ? ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌ రావును ప్రశ్నించిన సిట్

ఫోన్ ట్యాపింగ్ వెనకున్న సుప్రీం ఎవరు ? ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌ రావును ప్రశ్నించిన సిట్
  • ఎస్‌‌‌‌‌‌‌‌వోటీ ఏర్పాటు చేసిందెవరు? దాని ఉద్దేశమేంటి ?
  • ఆ డేటాను ధ్వంసం చేయడానికి అనుమతి ఇచ్చిందెవరు?
  • ‘సుప్రీం’ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చేవి? అని ప్రశ్నల వర్షం
  • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావు 
  • ఇంటి భోజనం, మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌కు అనుమతి.. స్టేషన్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌లోనే బస ఏర్పాటు

హైదరాబాద్‌, వెలుగు: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌(ఎస్‌‌‌‌‌‌‌‌ఐబీ) మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌ ప్రభాకర్ రావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) శుక్రవారం సుదీర్ఘంగా విచారించింది. సిట్‌‌‌‌‌‌‌‌ ముందు లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10:55 గంటలకు ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. సిట్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీపీ వెంకటగిరి ఎదుట సరెండర్ అయ్యారు. 

హైదరాబాద్ జాయింట్ సీపీ (లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తప్సీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక్బాల్‌‌‌‌‌‌‌‌ సమక్షంలో ఏసీపీ వెంకటగిరి సహా మరో ఇద్దరు సభ్యుల బృందం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావును విచారించింది. ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ వెనుక ఉన్న సుప్రీం ఎవరు? ఎస్‌‌‌‌‌‌‌‌వోటీని ఎవరు ఏర్పాటు చేశారు? దాని వెనుకున్న ఉద్దేశమేంటి? అని ప్రశ్నించినట్టు తెలిసింది. అలాగే  సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్ల క్లౌడ్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్స్‌‌‌‌‌‌‌‌, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌ గురించి అడిగారు. కాగా, సిట్‌‌‌‌‌‌‌‌ అడిగిన పలు ప్రశ్నలకు గతంలోనే సమాధానాలు చెప్పానని ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు చెప్పినట్టు సమాచారం.

ఎస్‌ఐబీ కేంద్రంగా పని చేసిన స్పెషల్‌‌‌‌ ఆపరేషన్ టార్గెట్స్‌‌‌‌(ఎస్‌‌‌‌వోటీ) గురించి సిట్‌‌‌‌ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఎస్‌‌‌‌వోటీ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశమేంటి? అనే కోణంలో ప్రభాకర్ రావును ప్రశ్నించినట్టు సమాచారం. మావోయిస్టులు, టెర్రరిస్టుల కదలికలు గుర్తించేందుకు ఎస్‌‌‌‌ఐబీ ఉండగా ఎస్‌‌‌‌వోటీని ఎందుకు ఏర్పాటు చేశారని.. ఎస్‌‌‌‌వోటీ ఏర్పాటుకు సంబంధించి హోంశాఖ జారీ చేసిన జీవోను ముందుంచి ప్రశ్నించినట్టు తెలిసింది. సిటీ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగానే ప్రభాకర్ రావును కీలక అంశాలపై విచారిస్తున్నారు. రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్న ‘బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సుప్రీం’ ఎవరు అనే వివరాలను అడిగినట్టు తెలిసింది. ఆ సుప్రీం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చేవి? అనే కోణంలో ప్రశ్నించినట్టు సమాచారం. కాగా, ఎస్‌‌‌‌వోటీ డేటాతో పాటు గత 30 ఏండ్లుగా భద్రపరిచిన డేటాను ధ్వంసం చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపాలని కోరినట్టు తెలిసింది.

జాయింట్ సీపీ తప్సీర్‌‌‌‌‌‌‌‌ ఇక్బాల్‌‌‌‌ దాదాపు గంటన్నర పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించారు. అనంతరం సిట్‌‌‌‌ అధికారి వెంకటగిరి విచారించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇంటి భోజనాన్ని అనుమతించారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్‌‌‌‌ అందించారు. అవసరమైన మెడిసిన్స్‌‌‌‌ను విచారణ గదిలో అందుబాటులో ఉంచారు. సాధారణంగా పోలీస్‌‌‌‌ కస్టడీలో ఉన్న రిమాండ్ ఖైదీలను సంబంధిత పీఎస్‌‌‌‌లోని సెల్‌‌‌‌లో లేదా సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌‌‌‌లోని సెల్‌‌‌‌లో పెడతారు. కానీ, ప్రభాకర్ రావు మాజీ ఐపీఎస్‌‌‌‌ అధికారి కావడంతో పాటు ఆయన ఆరోగ్యం, సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌‌‌‌లోనే వసతులు కల్పించారు. పీఎస్‌‌‌‌లోని పోలీసుల విశ్రాంతి గదిలో నిద్రించేందుకు ఏర్పాట్లు చేశారు.