ఫాలో అయి కనిపెట్టేస్తున్నరు! .. సిటీలో పెరిగిన లాయల్టీ టెస్టింగ్​ కల్చర్​

ఫాలో అయి కనిపెట్టేస్తున్నరు! .. సిటీలో పెరిగిన లాయల్టీ టెస్టింగ్​ కల్చర్​
  • పార్ట్ నర్ పై డౌట్​వస్తే డిటెక్టివ్​తో ఎంక్వైరీ 
  • సిటీలో100పైగానే ఏజెన్సీలు వర్కింగ్
  • మాట్రిమోని చెకింగ్​​లు వారి వద్దకే..

“ సిటీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రమేశ్​(పేరు మార్చాం) పెళ్లి సంబంధాల కోసం వెతుకుతుండగా..  అతని ​ఫ్రెండ్ శివ(పేరు మార్చాం) తనకు తెలిసిన అమ్మాయి ఉందని, చాలా పూర్ ​ఫ్యామిలీ అని చెప్పి పెళ్లికి ఒప్పించాడు. రమేశ్​కు ఆమెతో పెళ్లయ్యాక అతని కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది. అతని భార్య చిన్న విషయాలకు కూడా గొడవ పడి తరచూ పుట్టింటికి వెళ్లి వారం పదిరోజులు ఉండి వచ్చేది. దీంతో అనుమానం వచ్చి, సిటీలోని ఓ డిటెక్టివ్​ ఏజెన్సీని కాంటాక్ట్​ అయ్యాడు. ఆ ఏజెంట్ రమేశ్ తో భార్యకు కొత్త ఫోన్​కొనిచ్చాడు. ఆమెకు ఇవ్వడానికి ముందే అందులో కొన్ని టూల్స్​ ఇన్ స్టాల్​ చేశారు. దీంతో  ఆమె ఎవరితో మాట్లాడుతుందనే విషయం రమేశ్​కు, డిటెక్టివ్ ​ఏజెంట్​కు  తెలిసిపోయింది.  అతని ఫ్రెండ్ శివకు రమేశ్ ​భార్యతో పెళ్లికి ముందే సంబంధం ఉందని, ప్లాన్ ప్రకారమే పెళ్లి చేసినట్టు తేలింది. దీంతో రమేశ్ అసలు విషయం కోర్టుకు చెప్పి ఎలాంటి మెయింటనెన్స్​ ఇవ్వకుండానే విడాకులు పొందాడు. ’’

“  దంపతులిద్దరూ డాక్టర్లు. పెళ్లై 20 ఏళ్లు అయినా వారికి పిల్లలు లేరు. ఇద్దరూ వేర్వేరు ఆస్పత్రుల్లో డ్యూటీలు చేస్తారు. ఓ రోజు భార్యకు భర్తపై డౌట్​వచ్చి అతను పని చేసే ఆస్పత్రికి కాల్​ చేస్తే లేరని సమాధానం వచ్చింది. దీంతో భార్య ఓ డిటెక్టివ్​ ఏజెంట్​ హెల్ప్​ తీసుకుంది. భర్తపై నిఘా పెట్టిన ఏజెంట్ కొన్నిరోజులు ఫాలో అయ్యాడు. 25 ఏళ్ల జూనియర్ ​డాక్టర్​తో లివింగ్​ రిలేషన్​ లో ఉండడమే కాకుండా ఓ బాబు కూడా ఉన్నాడని తేలింది. భార్యకు విడాకులు ఇవ్వొచ్చుగా అని 
డాక్టర్ ను అడిగితే... ‘ నా భార్యకు ఆస్తులు ఎక్కువ ఉన్నాయని, అందుకే విడాకులు ఇవ్వలేదు’ అని సమాధానం చెప్పాడు. ఇది తెలిసిన భార్య ఆ తర్వాత భర్తకు డైవర్స్ ఇచ్చింది. ’’

ALSO READ  :- కాజీపేట వరకు పూణె-హైదరాబాద్ స్పెషల్ రైలు

హైదరాబాద్​, వెలుగు: భర్త వేరే మహిళతో ఎఫైర్​పెట్టుకున్నాడేమో ? గర్ల్​ఫ్రెండ్​వేరెవరితోనో మాట్లాడుతుందనే డౌటు? పెళ్లి చేసుకోబోయే అబ్బాయి, అమ్మాయి ఎలాంటి వారో ? వాళ్లు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎలాంటిదో..? ఇలాంటి డౌట్స్​పై క్లారిటీగా తెలుసుకునేందుకు సిటీ జనాలు ఏమాత్రం వెనుకాడడంలేదు. డిటెక్టివ్​ఏజెన్సీలను కాంటాక్ట్ అయి వేలల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. అసలు నిజాలేంటో తెలుసుకుంటున్నారు. దీంతో డిటెక్టివ్​ఏజెన్సీలకు డిమాండ్ పెరిగిపోయింది. అయితే.. డిటెక్టివ్ ఎంక్వైరీలు సరైనవి కావని, వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీస్తాయని, కొన్నిసార్లు రివర్స్​బ్లాక్​మెయిలింగ్​కు గురయ్యే చాన్స్ ఉంటుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

పర్సనల్​  కేసులే ఎక్కువ.. 

డిటెక్టివ్​ఏజెన్సీలు ప్రధానంగా కార్పొరేట్, పర్సనల్​కేసులను డీల్​చేస్తాయి. కాగా.. సిటీలోని ఏజెన్సీలకు పర్సనల్​కేసులే ఎక్కువ వస్తున్నాయి. ఫ్రెండ్​, బాయ్​ఫ్రెండ్​, గర్ల్​ఫ్రెండ్​, భర్త​, భార్య​, బిజినెస్​పార్ట్​నర్ పై ఏ చిన్న డౌట్​వచ్చినా వెంటనే ఏజెన్సీలను సంప్రదించి లాయల్టీ టెస్ట్​చేయిస్తున్నారు. వీటిలో ఫెయిలైతే  ప్రీ మారిటల్​క్లయింట్లు తమ రిలేషన్​ను ఎక్కువ శాతం మంది బ్రేక్​చేసుకుంటున్నారు. పోస్ట్​మారిటల్​వాళ్లైతే కౌన్సెలింగ్​తో సెట్​అవుతున్నారు. కొందరు తప్పని పరిస్థితుల్లో విడాకులు సైతం తీసుకుంటున్నారు. 

ఎలా కనిపెడతారంటే.. 

క్లైంట్ నుంచి టార్గెటెడ్ పర్సన్ డిటేయిల్స్ తీసుకున్న ఏజెంట్ వారిని ఫాలో అవుతాడు. మార్నింగ్ లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు వారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఎవరెవరిని కలుస్తున్నారు. ప్రతి ఒక్క మూవ్​ మెంట్ ను అబ్జర్వ్ చేస్తారు. ఆ డిటైల్స్​ను ఎప్పటికప్పుడు క్లయింట్లకు చేరవేస్తుంటారు. ఇందుకు లాయల్టీ టెస్టింగ్ ఒక మార్గం. క్లయింట్ ఇచ్చిన వివరాల మేరకు ఆ వ్యక్తిని ఫాలో అతని తప్పు ఒప్పులను కనిపెట్టి బట్టబయలు చేస్తుంటారు. 

బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఆరా తీయిస్తూ..

సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వారితో చాట్ చేయడం, రాంగ్ నంబర్స్ అంటూ కాల్ చేసి దగ్గరవడం, ఏదో ఒక కారణంతో  డైరెక్ట్ మాట్లాడి టార్గెటెడ్ పర్సన్​కు దగ్గరవుతుంటారు. డిటెక్టివ్ ఏజెన్సీలను డైరెక్ట్​గా కాంటాక్ట్ అయ్యేవారు కొందరైతే.. మాట్రిమోనిల ద్వారా వెళ్లేవారూ ఎక్కువే ఉన్నారు. ఏదైనా మాట్రిమోని సైట్ లో అబ్బాయి, అమ్మాయి నచ్చితే.. వెంటనే వారి గురించి ఎంక్వైరీలు చేయిస్తున్నారు. యువతి, యువకుడు నేచర్, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్​, ఆస్తులు, జాబ్స్​పై  ఆరా తీయిస్తున్నారు.

వందకు పైగా ఏజెన్సీలు.. 

కొంతకాలం కిందట వరకు డిటెక్టివ్ ఏజెన్సీలు కొన్నే ఉండేవి. ప్రస్తుతం సిటీలో 100పైగానే ఉన్నాయి. ఒక్కో ఏజెన్సీకి నెలకు 10‌‌‌‌–15 కేసులు వస్తున్నాయంటే డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫీజులు ఏజెన్సీ, క్లయింట్ పేర్కొన్న విషయాలను బట్టి డిసైడ్ చేస్తారు. వెళ్లాల్సిన ప్రాంతాలు, పట్టే సమయం, ఏజెంట్స్ అవసరాలు ఇతరాత్ర పనులను బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. 

ఆన్​లైన్ ​ఏజెన్సీలతో జాగ్రత్త

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి తన కూతురికి పెళ్లి చేసేందుకు ఓ మాట్రిమోని సైట్ లో అబ్బాయి వివరాలు చూశాడు. అతని గురించి, ఫ్యామిలీ నేచర్ , ఫినాన్షియల్ స్టేటస్ లాంటివి తెలుసుకోవాలనుకుని, ఆన్​లైన్​లో డిటెక్టివ్ ఏజెన్సీ కోసం వెతికాడు. ముంబై కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ కనిపించింది. వాళ్లతో మాట్లాడి అబ్బాయి వివరాలు అందించాడు. అడ్వాన్స్​గా రూ. లక్ష ఆన్ లైన్  ద్వారా చెల్లించాడు. అంతే మరుసటి రోజు నుంచి ఆ ఏజెన్సీ ఫోన్ స్విచ్ఛాఫ్.  మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 క్లయింట్లు పెరిగారు

పదేళ్లుగా డిటెక్టివ్​ ఏజెన్సీని నిర్వహిస్తున్నాను. 2, 3 ఏళ్ల నుంచి క్లయింట్లు పెరిగారు. నెలకు పది మంది దాకా వస్తున్నారు.  వీరిలో పర్సనల్​ప్రాబ్లమ్స్​తో వచ్చేవారే ఎక్కువ ఉంటున్నారు. కార్పొరేట్​ కేసులు కూడా వస్తున్నా.. తక్కువగానే ఉంటాయి. 
- సిటీలోని ఓ ప్రముఖ డిటెక్టివ్​ ఏజెన్సీ