హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ..రూట్​ మ్యాప్ రెడీ

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ..రూట్​ మ్యాప్ రెడీ
  •     ఐదు కారిడార్లలో70 కిలోమీటర్ల కొత్త మార్గం
  •     ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపిన అధికారులు
  •     తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి కనెక్టివిటీ ఉండేలా కొత్త రూట్ 

హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 విస్తరణకు రూట్ మ్యాప్ రెడీ అయింది. సిటీలో ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా, నగరం నలుమూలాల నుంచి ఎయిర్ పోర్టుకు కనెక్టివిటీ ఉండేలా కొత్త రూట్లను అధికారులు రూపొందించారు.

మొత్తం ఐదు కారిడార్లలో 70 కిలోమీటర్ల మేర కొత్త మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందులో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రెండో కారిడార్ ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగిస్తారు. దీనికి తోడు కొత్తగా మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం చేపడతారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అధికారులు పంపించినట్టు తెలిసింది. 

సీఎం రేవంత్ ఆదేశాలతో.. 

సిటీలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులకు సూచించారు. కేవలం కొద్ది మందికి ఉపయోగపడేలా గత ప్రభుత్వం నిర్దేశించిన రూట్ ను రద్దు చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కొత్త రూట్ మ్యాప్ ను అధికారులు సిద్ధం చేశారు. ఎక్కువ ఖర్చుతో తక్కువ మందికి ఉపయోగపడేలా గతంలో తయారు చేసిన డిజైన్లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా కొత్త రూట్ మ్యాప్ రూపొందించినట్టు అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. 

ఇదీ రూట్ మ్యాప్.. 

కారిడార్ 2: ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్ నుమా – 5.5 కిలోమీటర్లు 
కారిడార్ 2: ఫలక్ నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు – 1.5 కిలోమీటర్లు
కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ స్టేషన్ వరకు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు,  మైలార్ దేవ్ పల్లి, పీ7 రోడ్డు మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ – 29 కిలోమీటర్లు 
కారిడార్ 4: మైలార్ దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్ లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం – 4 కిలోమీటర్లు 
కారిడార్ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్) – 8 కిలోమీటర్లు 
కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరు – 14 కిలోమీటర్లు
కారిడార్ 7: ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి  వనస్థలిపురం, హయత్ నగర్ – 8 కిలోమీటర్లు