టార్గెట్ హెచ్ఎండీఏ..గత ప్రభుత్వ​ అక్రమాలపై సర్కారు సీరియస్

టార్గెట్ హెచ్ఎండీఏ..గత ప్రభుత్వ​ అక్రమాలపై సర్కారు సీరియస్
  • సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
  • మరో మారు విజిలెన్స్ సోదాలు
  • లెక్కలన్నీ బయటికి తీస్తున్న ఆఫీసర్లు
  • ఇటీవలే రెరా సెక్రటరీ బాలకృష్ణ అరెస్టు
  • అక్రమార్కుల్లో మొదలైన గుబులు

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ అక్రమాలపై సర్కారు సీరియస్ గా నజర్ పెట్టింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి సుమారు 50 మంది విజిలెన్స్ అధికారులు అమీర్ పేట్ లోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లో హెచ్ఎండిఏ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. హెచ్ఎండీ ఏలో తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు. ముందుగా చెప్పినట్టుగానే ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు మొదలయ్యాయ. నాలుగో ఫ్లోర్ లోని అన్ని ఫైళ్లను విజిలెన్స్ అధికారులు  సీజ్ చేసి తీసుకు వెళ్లినట్టు సమాచారం.

ఇవన్నీ హైరైజ్ బిల్డింగ్స్ కు సంబంధించిన ఫైళ్లని తెలుస్తోంది.  మరో వైపు ఇదే  సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ అధికారులతో  సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఇటీవల ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో రెరా కార్యదర్శి, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఆధారంగా విజిలెన్స్ అధికారులు తనిఖీలకు ఉపక్రమించారు. బాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కేసులో దాదాపు 500 కోట్ల అవినీతి బయటపడింది. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.  

అక్రమాలపై సీఎం ఆరా 

ప్రభుత్వ భూముల అమ్మకం.. వచ్చిన ఆదాయం..! వాటిని ఎందుకు ఖర్చు చేశారు..? అనే అంశాలపై సీఎం సమీక్షిస్తున్నారు.  ఆక్షన్ లో ప్లాట్లు పొందిన వారు డబ్బులు చెల్లించకుండా ఎక్కడైనా నిర్మాణాలు చేశారా..? వారి  నుంచి ఎంత రావాలి..? హెచ్ఎండీఏ  పరిధిలో 3,500 చెరువులకు గాను వాటి తాజా పరిస్థితి ఏమిటి..? ఆన్ లైన్ లో వాటి డేటా ఎందుకు డిలీట్ చేశారు..? భవిష్యత్ లో వేలం వేయాల్సి వస్తే అనుకూలమైన భూముల పరిస్థితి ఏమిటన్న అంశాలపై సీఎం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.  

ట్రిపుల్ ఆర్ లోపలంతా  హెచ్ఎండీఏ!

రీజినల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ కు అనుసంధానంగా.. రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు  సిద్ధం చేయాలని సూచించారు. మాస్టర్  ప్లాన్ –2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు.