బడీచౌడీ, సుల్తాన్​బజార్ లో తగ్గిన రద్దీ​.. కనుమరుగవుతున్న చారిత్రక మార్కెట్లు..

బడీచౌడీ, సుల్తాన్​బజార్ లో తగ్గిన రద్దీ​.. కనుమరుగవుతున్న చారిత్రక మార్కెట్లు..
  • 70  శాతం బిజినెస్ తగ్గిందంటున్న వ్యాపారులు
  • మెట్రో నిర్మాణం తర్వాత  బడీచౌడీ, సుల్తాన్​బజార్ లో తగ్గిన రద్దీ​
  • వేరే ప్రాంతాలకు తరలిపోతున్న వ్యాపారులు

హైదరాబాద్​, వెలుగు: బడీ చౌడీ(పెద్ద సెంటర్), సుల్తాన్​ బజార్.. ఈ ఏరియాలు ఒకప్పుడు ​సిటీకి షాపింగ్ ఐకాన్‌‌‌‌గా ఉండేవి. ఐదారేండ్ల కిందటి వరకు షాపింగ్ లో హైదరాబాద్ కీ షాన్ గా పేరొందిన ఈ ఏరియాలు నేడు వెలవెలబోతున్నాయి. గతంలో సిటీ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసేవారు. ఇతర ప్రాంతాల నుంచి సిటీ సందర్శనకు వచ్చిన వారిలో చాలామంది ఇక్కడ షాపింగ్ చేయకుండా వెళ్లేవారు కాదు.  

మహిళలకు, యువతులకు, పిల్లలకు సంబంధించిన ఎన్నో రకాల వస్ర్తాలు, అలంకరణ వస్తవులకు బడీచౌడీ,  దానికి ఆనుకుని ఉండే సుల్తాన్ బజార్​ కేరాఫ్​ అడ్రస్‌‌‌‌గా కొనసాగింది.  నిజాం కాలం నుంచి వైభవంగా కొనసాగిన బడీచౌడీ, సుల్తాన్​బజార్ లోని షాపింగ్​సెంటర్లకు ఇప్పుడు  కొనుగోలుదారులు రావడానికి ఇష్టపడడం లేదు. మెట్రోరైల్​ రాక, రోడ్లు చిన్నవిగా మారడం, పార్కింగ్ సమస్యలతో ఇక్కడి వ్యాపారం దెబ్బతింటోంది. దీంతో కొన్ని షాప్ లు  ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలిపోతున్నాయి. 

కస్టమర్ల కోసం షామియానాలు, టెంట్లు

1990ల్లో బడీ చౌడీ నిత్యం కిక్కిరిసి పోయే షాపింగ్​సెంటర్ గా ఉండేది.  పెండ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు,  పండగలు, ఇతర శుభకార్యాల సందర్భంగా మహిళలు తమకు అవసరమైన రెడీమేడ్​దుస్తులు, చీరలు, డ్రెస్​ మెటీరియల్స్, అలంకరణ సామగ్రి కొనుగోలు చేసేందుకు ఇక్కడి భారీగా తరలివచ్చేవారు. కస్టమర్ల తాకిడిని తట్టుకోలేక కొన్ని షాపుల ముందు ప్రత్యేకంగా షామియానాలు, టెంట్లు ఉండేవి. కస్టమర్లు అక్కడ వెయిట్ చేసేందుకు  ఇలాంటి ఏర్పాట్లు చేసేవారు.  కానీ, ప్రస్తుతం ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌కు వస్తే షాపులు ఖాళీగా కనిపిస్తున్నాయి.  

ఆకట్టుకునే డిజైన్లు, క్వాలిటీ దుస్తులు తక్కువగా ఉంటున్నాయి. మరికొన్ని పేరొందిన షాప్​లు వారు ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలిపోయాయి. మహిళలకు కావాల్సిన అలంకరణ వస్తువులు, హౌజరీ వంటి వాటికి సంబంధించి కొన్ని షాపులు మాత్రమే ఉన్నాయి. గతంలో ప్రతిరోజు ఒక్కో రిటైల్ షాపులో ఎంత లేదన్నా సుమారు రూ.3 లక్షల నుంచి రూ. 10 లక్షల బిజినెస్ వరకు జరిగేదని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం గిరాకీ లేక ఇబ్బందిగా మారిందంటున్నారు. 

సుల్తాన్ బజార్‌‌‌‌ది అదే వైభవం 

బ్రిటీష్ కాలంలో వారి అవసరాల కోసం బడీ చౌడీని ఆనుకుని ఏర్పాటయిన మార్కెట్‌‌‌‌.. తర్వాతి కాలంలో నిజాంల పరమైంది.  నిజాం హయాంలో ఈ మార్కెట్‌‌‌‌కు సుల్తాన్​ బజార్‌‌‌‌‌‌‌‌గా పేరు పెట్టారు.  అప్పటి నుంచి ఈ మార్కెట్​హైదరాబాద్​నగరానికి ప్రతీకగా నిలుస్తోంది.  సుల్తాన్​బజార్​అంటే మహిళలకు, యువతులకు అవసరమైన అలంకరణ వస్తువులు, ఇంటికి కావాల్సిన ఫర్నిషింగ్ ఐటమ్స్​, హౌజరీ ఇలా రక రకాల ప్రొడక్ట్స్ లభించే కేంద్రంగా పేరు పొందింది.  మెట్రో రైల్‌‌‌‌ రాక,  సరైన పార్కింగ్​ సౌకర్యాలు లేకపోవడంతో ఈ మార్కెట్‌‌‌‌లోనూ సందడి తగ్గింది. 

గల్లీ సెంటర్లుగా మారిపోయి..

చారిత్రక బడీచౌడీ సెంటర్​ ఇప్పుడు చిన్న గల్లీ వ్యాపార సెంటర్ గా మారిపోయింది.  షాపింగ్ చేసే వారు తమ వెహికల్స్ ను పార్క్​ చేసుకునేందుకు స్థలం లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారినట్టు ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. కార్లలో వచ్చే వారి సంగతి పక్కన పెడితే.. కనీసం బైక్‌‌‌‌లపై వచ్చే వారికి బండ్లను పార్క్​ చేసుకునే స్థలం లేదు.  దీంతో ఆయా ప్రాంతాల్లో వ్యాపారులే కాదు షాపింగ్​కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

రోడ్లు చిన్నగా ఉండడంతో నిత్యం ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్​ఏర్పడుతుంది.  ఈ సెంటర్​పూర్తిగా వన్‌‌‌‌వే కావడం వల్ల కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఇక్కడ నిత్యం వాహనదారుల రద్దీతోపాటు, మెట్రో ఫై ఓవర్​ వల్ల ఈ ప్రాంతంలో వాహనాలు వెళ్లడానికి సరైన దారిలేక కిక్కిరిసిపోతుంది.  ఇన్ని సమస్యల కారణంగా బడీచౌడీలో వ్యాపారాలు నిర్వహించడం కష్టంగా ఉందని రెడీమేడ్​ దుస్తుల వ్యాపారి హన్మంతరావు వాపోయారు.  గతంలో రూ,కోట్లలో వ్యాపారం జరిగే ఈ మార్కెట్​లో ప్రస్తుతం రూ. లక్షల్లోనే జరుగుతోందన్నారు.  దాదాపు 70 శాతం వ్యాపారం పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. తాతల కాలం నాటి నుంచి వ్యాపారం చేస్తున్న కొద్దిమంది మాత్రమే ఇప్పుడు బడీచౌడీలో షాప్​లు నిర్వహిస్తున్నారు. 

30 శాతం ఇతర ప్రాంతాలకు..

బడీచౌడీ, సుల్తాన్​ బజార్‌‌‌‌‌‌‌‌లో వ్యాపారం నిర్వహించడం కుదరదని చాలామంది వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. సిటీలోని చాలా ప్రాంతాల్లో షాపింగ్ సెంటర్లు వెలుస్తున్న నేపథ్యంలో ఈ మార్కెట్లకు  వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పటికే దాదాపు 30 శాతం మంది ఇక్కడి నుంచి షాప్ లను వేరే ప్రాంతాలకు తరలించినట్లు వ్యాపారి గౌతమ్  తెలిపారు.  మెట్రో రైల్​ సందర్భంగా ఈ మార్కెట్‌‌‌‌లో ప్రభుత్వం భూ సేకరణ చేసింది.  ఈ సందర్భంగా చాలా షాపులు రోడ్డు వెడల్పులో కూల్చివేతకు గురయ్యాయి.  మరికొన్ని షాపులు చిన్నవిగా మారిపోయాయి.

ఫుట్​పాత్ ​ వ్యాపారం పెరిగిపోయింది

మా షాపుల ముందే ఫుట్‌‌‌‌పాత్ వ్యాపారాలు వెలుస్తున్నాయి. దీంతో మా బిజినెస్ పై ఎఫెక్ట్ పడింది.  బడీ చౌడీ అంటేనే ఎంతో చరిత్ర ఉన్న  మార్కెట్. ఇక్కడికి వచ్చిన కస్టమర్​ ప్రతి వస్తువుపైనా బేరం చేస్తాడు.  షోరూమ్‌‌‌‌ల కంటే ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపై జరిగే అమ్మకాలే అధికంగా ఉంటున్నాయి. ఇతర షాపింగ్​సెంటర్లలో కంటే తక్కువ ధరలకే అమ్ముతున్నా మా వద్దకు వచ్చే గిరాకీ బాగా తగ్గిపోయింది.  45 ఏండ్ల పాటు వ్యాపారంలో ఉన్నాం. ఇంతగా బిజినెస్​ పడిపోవడం ఇబ్బందులకు గురిచేసింది  

రిషి, శారీ మందిర్​ఓనర్ 

పూర్వ వైభవం కోల్పోయింది

నిజాం కాలం నాటి ఈ ప్రధాన మార్కెట్లు​ ఇప్పుడు పూర్తిగా పుట్​పాత్​ వ్యాపారంగా మారాయి.  తాతల కాలం నుంచి వస్తున్న వ్యాపారం కారణంగానే ఇప్పడు మేం బిజినెస్ చేస్తున్నాం.  గతంలో పోలిస్తే వ్యాపారం పెద్దగా జరగడం లేదు.  వేరే చోట చేయాలంటే ఇక్కడి నుంచి వెళ్లలేకపోతున్నాం. నిత్యం ట్రాఫిక్ జామ్​, పార్కింగ్​ సమస్యల కారణంగా వ్యాపారాలు నిర్వహించుకోలేకపోతున్నం.

భూపేందర్​, రెడీమేడ్, ఫ్యాన్సీ బట్టల వ్యాపారి