వర్షాకాలం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మలేరియా కట్టడి కష్టమే..

వర్షాకాలం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మలేరియా కట్టడి కష్టమే..

వేసవికాలంలో  విపరీత ఎండ వేడిమినీ, ఉక్కపోతనూ  భరించినవారు  వర్షాకాలం రాగానే  ప్రశాంతంగా ఉందని భావిస్తారు.  వేసవితాపం నుంచి ఉపశమనం కలిగిందని, ఆహ్లాదకరంగా ఉందనీ సంబురపడతారు.  ప్రధానంగా చిన్న పిల్లల్లో చాలామందికి ఈ సీజన్ అంటే ఇష్టం. అయితే ఈ కాలంలోనే అంటువ్యాధులు చుట్టుముడతాయి.  గాలిలో తేమ, చుట్టూ ఉన్న ధూళి, నిలిచిపోయిన నీరు అనేక రోగాలకు మూలకారణాలు అవుతాయి. 

వర్షాకాలంలో వచ్చే కొన్ని తీవ్రమైన వ్యాధుల్లో మలేరియా ఒకటి.  జ్వరం, తలనొప్పి, చలి,  ప్లేట్​లెట్ కౌంట్ పడిపోవటం, శరీరం మీద ఎర్రటి దద్దుర్లు వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా ఉంటాయి.  ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులను 2030 నాటికి 30 శాతం మేర తగ్గించాలని  ప్రపంచ ఆరోగ్య సంస్థ  వ్యూహాత్మక ప్రణాళిక పిలుపిచ్చింది.  2023లో విశ్వ వ్యాప్తంగా 26.3 కోట్ల మలేరియా కేసులు వెలుగు చూశాయి. అంతకు మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఇవి కోటికి పైగా ఎక్కువ.  నిర్దేశిత తగ్గింపు లక్ష్యానికన్నా 2023లో మలేరియా కేసులు మూడు రెట్లు అధికంగా నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో మరింతగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

మలేరియా కట్టడిలో భారత్​ ముందంజ

2020--–23  మధ్యకాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ  లెక్కల  ప్రకారం ప్రతి  వెయ్యిమంది  జనాభాకు 2000  సంవత్సరంలో 79 మంది ఈ వ్యాధి బారినపడ్డారు.  2015లో  58 మంది, 2020లో 59 మంది, 2021లో 58,  2022లోనూ 58,  2023లో 60 మంది మలేరియాకు చిక్కారు.  అయిదేళ్లకన్నా  తక్కువ  వయసున్న పిల్లల్లో మూడింట రెండు వంతుల మరణాలు సంభవిస్తున్నాయి.  విశ్వవ్యాప్తంగా చూస్తే మలేరియా కారణంగా ఏటా నాలుగు మిలియన్లకుపైగా  ప్రజలు మరణిస్తున్నారు.  అయితే  ఈ వ్యాధి నియంత్రణలో  భారతదేశం గొప్ప విజయం సాధించిందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు వెల్లడిస్తున్నాయి.  

గత  ఏడాది చివర్లో  విడుదల చేసిన గణాంకాల ప్రకారం 1947తో  పోల్చినప్పుడు 97 శాతం కేసులు తగ్గాయి.  దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఈ వ్యాధి తీవ్రమైన ప్రజారోగ్య సవాళ్లలో ఒకటిగా ఉండేది.  ఏటా 7.5 కోట్ల కేసులు నమోదు కావడం, అందులో ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగేది.  అప్పటి నుంచి వ్యాధి నియంత్రణకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. 2023 నాటికి 20 లక్షలకు కేసులు తగ్గాయి.  మరణాల సంఖ్య 83కు చేరినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది.

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి

దోమల వల్ల వచ్చే ఈ ప్రాణాంతక వ్యాధి గురించి అవగాహన కల్పించడంలో మనదేశం ఎప్పుడూ ముందంజంలో ఉంది.  అయితే,  కేసులు తగ్గుతున్నప్పటికీ  మలేరియా ఇప్పటికీ అంటువ్యాధిగా మిగిలిపోయిన దేశాలు అనేకం ఉన్నాయి. మలేరియా  కేసుల్లో  96 శాతం మరణాలు  ఆఫ్రికా దేశాల్లో మాత్రమే  చోటుచేసుకుంటున్నాయి.  లింగ,  వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను ఈ వ్యాధి ప్రభావితం చేస్తోంది.  ఎక్కువ  ప్రభావం చూపేది  పిల్లల్లోనూ, గర్భిణీల్లోనూ అని తేల్చారు.  ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల వచ్చే మలేరియా అంటువ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది. 

ఈ వ్యాధిని గుర్తించినప్పుడు  ఇండ్లల్లోనూ,  చుట్టుపక్కలా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.  వర్షాకాలంలో గుంతలు ఏర్పడి నీరు నిల్వ ఉండటం వల్ల సంతానోత్పత్తి  ప్రదేశాలు తయారై వ్యాప్తిని పెంచుతుంది. వ్యాధి నియంత్రణలో కొన్ని సవాళ్లు తప్పడం లేదు. మానవ, ఆర్థిక వనరులు సరిపోవడం లేదు. అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు సక్రమంగా అందటం లేదు.  ప్రజా వనరుల లభ్యతలో తగ్గుదల కనిపిస్తోంది. ఆరోగ్య చట్టాల అమలు అంతంతమాత్రంగా ఉంది.  వ్యాధివ్యాప్తి గుర్తింపు, హెచ్చరిక, దర్యాప్తు,  నియంత్రణ విషయాల్లో  జాప్యానికి దారితీసే నివేదిక వ్యవస్థలు సరిపోకపోవడం కూడా ఒక నిరాశాజనక అంశంగా మారింది.

- జి. యోగేశ్వరరావు, 
 సీనియర్ జర్నలిస్ట్