మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సందీప్‌ దీపక్‌రావు అరెస్ట్

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సందీప్‌ దీపక్‌రావు అరెస్ట్

మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సందీప్‌ దీపక్‌రావును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నగర డీజీపీ అంజనీ కుమార్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దీపక్‌రావు ఓ ఆస్పత్రిలో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఆయన దగ్గర నుంచి ఒక పిస్టల్, ఆరు రౌండ్స్ బుల్లెట్స్, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  

ప్రస్తుతం దీపకర్‌రావు పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్‌ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నట్లు వెల్లడించిన పోలీసులు.. ఆయన పలువురు అగ్రనేతలతో సమావేశాలు జరిపినట్లు గుర్తించారు. గత కొన్నాళ్లుగా దీపక్‌రావు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, రెండు మూడు రోజుల కిందట నగరానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీపక్‌రావు మావోయిస్టు పార్టీలో కీలక నేత కావడంతో.. ఆయనపై నిఘా పెట్టినట్లు వివరించారు. ఖచ్చితమైన సమాచారం మేరకు ఆయనను అరెస్టు చేసినట్లు తెలిపారు.  

దీపక్‌రావుపై రూ.25లక్షల రివార్డ్‌

కర్ణాటక, తమిళనాడు, కేరళ ట్రైజంక్షన్‌ ఏరియాలో దీపక్‌రావు కీలక నేతగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆయన కోసం మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక పోలీసులు సహా ఎన్‌ఐఏ బృందాలు సైతం వెతుకుతున్నాయని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం దీపక్‌రావుపై రూ.25లక్షల రివార్డ్‌ను ప్రకటించిందని పేర్కొన్నారు.