ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్

ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్
  • రూ.75 లక్షల రెడ్‌‌‌‌ శ్యాండల్ స్వాధీనం 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అంతర్రాష్ట్ర గంధపు చెక్కల స్మగ్లర్స్‌‌‌‌ ముఠా సిటీ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులకు చిక్కింది. కడప అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌‌‌‌ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాలో నలుగురిని సౌత్‌‌‌‌జోన్ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.75 లక్షల విలువ చేసే 500 కిలోల ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పుష్ప సినిమా ఫక్కీలో ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేస్తున్న స్మగ్లింగ్‌‌‌‌ వివరాలను జాయింట్‌‌‌‌ సీపీ గజరావ్‌‌‌‌ భూపాల్‌‌‌‌ వెల్లడించారు. ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూర్‌‌‌‌‌‌‌‌కి చెందిన షేక్ అబ్దుల్లా(42) ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ బిజినెస్ చేసేవాడు. నష్టాలు రావడంతో కొంతకాలం రియల్ ఎస్టేట్‌‌‌‌ వ్యాపారం చేశాడు. ఈజీ మనీ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్‌‌‌‌కు ప్లాన్ చేశాడు. కడపకు చెందిన స్మగ్లర్‌‌‌‌‌‌‌‌ రవిచంద్రను కాంటాక్ట్ అయ్యాడు. కడప లంకమల్ల రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ నుంచి రవిచంద్ర రెడ్‌‌‌‌శ్యాండల్‌‌‌‌ స్మగ్లింగ్‌‌‌‌ చేసేవాడు. అతని వద్ద అబ్దుల్లా రెడ్‌‌‌‌ శ్యాండల్‌‌‌‌ కొనుగోలు చేశాడు. వీటిని స్టోర్ చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన ముజాహిద్దీన్‌‌‌‌(41)ను సంప్రదించాడు. ఎర్రచందనం స్టోర్‌‌‌‌‌‌‌‌ చేస్తే కమీషన్‌‌‌‌ ఇస్తానని చెప్పాడు. దీంతో కర్నూల్‌‌‌‌ జిల్లా కల్వకుర్తిలోని ముజాహిద్దీన్‌‌‌‌కు చెందిన ఓపెన్ ప్లాట్‌‌‌‌లో స్టోర్‌‌‌‌ ‌‌‌‌చేసేవారు. అనంతరం కల్వకుర్తికి చెందిన ఇనాయత్‌‌‌‌ఖాన్‌‌‌‌(44)అబ్దుల్‌‌‌‌ఖదీర్‌‌‌‌‌‌‌‌(42)తో కస్టమర్ల కోసం సెర్చ్ చేసేవాడు. 

శాంపుల్స్‌‌‌‌తో రేట్‌‌‌‌ ఫిక్స్​
కస్టమర్లను గుర్తించిన తర్వాత రవిచంద్ర ఇచ్చిన ఫోన్‌‌‌‌ నంబర్స్ ఆధారంగా కాంటాక్ట్ అయ్యేవారు. పోలీసులకు అనుమానం రాకుండా శాంపుల్స్‌‌‌‌ను బైక్‌‌‌‌పై తీసుకొచ్చి రేట్‌‌‌‌ ఫిక్స్ చేసుకునేవారు. అనంతరం పుష్ప సినిమా తరహాలో కార్లలో ట్రాన్స్‌‌‌‌పోర్ట్ చేసేవారు. గ్యాంగ్‌‌‌‌ గురించి సౌత్‌‌‌‌జోన్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ రాఘవేంద్ర, ఎస్సై నరేందర్‌‌‌‌తో కూడిన టీమ్‌‌‌‌ నిఘా పెట్టింది. మిధాని బస్‌‌‌‌ డిపో వద్దకు రెడ్‌‌‌‌ శాండల్​శాంపుల్స్‌‌‌‌తో వచ్చిన షేక్ అబ్దుల్లా, ముజాహిద్దీన్‌‌‌‌, ఇనాయత్‌‌‌‌ఖాన్‌‌‌‌, అబ్దుల్‌‌‌‌ఖదీర్‌‌‌‌ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 500 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రవిచంద్ర కోసం ఏపీ పోలీసులతో కలిసి సెర్చ్ చేస్తున్నారు.