ఎంతపని చేశావు చిట్టీ.. హైదరాబాద్లో ప్రియుడితో కలిసి భర్తను చంపి.. నిద్రలోనే చనిపోయాడనీ పోలీసులకు ఫోన్..

ఎంతపని చేశావు చిట్టీ.. హైదరాబాద్లో ప్రియుడితో కలిసి భర్తను చంపి.. నిద్రలోనే చనిపోయాడనీ పోలీసులకు ఫోన్..

భార్యలను చంపే భర్తలు.. భర్తలను చంపే భార్యలు.. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇవే ఘటనలు. కట్నం కోసం కొందరు.. వివాహేతర బంధం కోసం మరికొందరు.. చంపుకుంటూనే ఉన్నారు. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. ఈ మాటలకు ఇప్పుడు విలువలేకుండా పోయింది. శుక్రవారం (ఆగస్టు 29) హైదరాబాద్ లో ఇలాంటి మరో ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళ్తే.. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ దారుణ ఘటన. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరాం నగర్ రోడ్ నెం. 7లో  జెల్లెల శేఖర్ (40), చిట్టి(33) కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. 

చిట్టీ గత కొద్ది కాలంగా ఓ వ్యక్తితో వివాహేతర బంధం కొనసాగిస్తోంది.  గురువారం (ఆగస్టు 28) రాత్రి తన ప్రియుడుతో కలసి భర్తను హతమార్చింది చిట్టి. ఆ తర్వాత డౌట్ రాకుండా ఉండేందుకు మధ్యాహ్నం పోలీసులకు ఫోన్ చేసింది. రాత్రి నిద్రలోనే తన భర్త శేఖర్ చనిపోయినట్లు 100 కు ఫోన్ చేసింది. 

సమాచారం తెలుసుకున్న సరూర్ నగర్  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  భార్య చిట్టిపై అనుమానంతో  తమదైన శైలిలో విచారించగా.. తన ప్రియుడు తో కలిసి భర్త ను హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో చిట్టీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రియుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి  శేఖర్ మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.