
రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది . సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షం పడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. చండూర్ లో ఈదురు గాలులతో వర్షం పడింది. నిర్మాణంలో ఉన్న భవనం పై నుంచి రేకులు ఎగిరిపోయాయి. అటు భువనగిరి పట్టణంలో ఈదురు గాలులతో వర్షం పడింది. రోడ్లు జలమయం అయ్యాయి. సూర్యాపేట, కోదాడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది.
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, నాగోల్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అబ్దుల్లా పూర్ మెట్ లోని కాటమయ్య ఆలయంపై పిడుగు పడింది. పిడుగుపాటుకు ఆలయ గోపురం పై భాగం ధ్వసం అయ్యింది. ఆలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
మూడు రోజులు ముందుగానే కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇవాళ కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది IMD. మరో రెండు మూడ్రోజులలో కర్ణాటకలోని కొంకన్, గోవా ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. జూన్ 5న దక్షిణ రాయలసీమకు.. 7 నుంచి 10వ తేదీ మధ్యలో కోస్తాంధ్ర, తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.