డీ అడిక్షన్ సెంటర్‌‌కు క్యూ

డీ అడిక్షన్ సెంటర్‌‌కు క్యూ
  • ప్రతినెలా 100 మందికి పైగా ఓపీ..
  • ఏడాదిలో ఇన్ పేషెంట్లుగా 165 మందికి సేవలు
  • బాధితుల్లో ఎక్కువ మంది యూత్ 
  • కల్తీకల్లు, గంజాయి  వ్యసనపరులే ఎక్కువ 

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కల్తీకల్లు, గంజాయికి బానిసలుగా మారి మానసికంగా కుంగిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని రోజులుగా జిల్లా అంతటా విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నారు. పోలీసులు గాంజా గస్తీ పేరిట విస్తృత తనిఖీలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ దీన్ని నివారించడం పూర్తిస్థాయిలో సాధ్యం కావడం లేదు. 

గంజాయికి తోడుగా కల్తీ కల్లు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.  గంజాయి, కల్తీ కల్లుకు బానిసలుగా మారిన యువకులు మానసిక రోగులుగా మారి వారి కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు.  జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్‌లో డీ అడిక్షన్ సెంటర్‌‌కు ఏడాది కాలం నుంచి కల్తీ కల్లు, గంజాయికి బానిసలుగా మారిన వారు పెద్ద సంఖ్యలో కౌన్సిలింగ్‌తో పాటు ట్రీట్​మెంట్​ కోసం వస్తున్నారు.

ప్రతినెలా వంద మందికి పైగా ఓపీలు..

జిల్లా కేంద్రంలోని డీ అడిక్షన్ సెంటర్‌‌కు ప్రతి నెలా దాదాపు 100 మంది వరకు కల్తీ కల్లు, గంజాయికి బానిసలైన వారు కౌన్సిలింగ్‌తో పాటు చికిత్సల కోసం వ స్తున్నారు. ఏడాది కాలం నుంచి ఇప్పటివరకు దాదాపు 160 మందికి ఇన్ పేషెంట్లుగా ఇక్కడ చికిత్స పొందారు. గంజాయి, కల్లుకు బానిసలుగా మారి విచిత్ర చేష్టలతో పాటు సైకోలుగా వ్యవహరిస్తున్న వారిని వారి మిత్రులు, కుటుంబ సభ్యులు డీ అడిక్షన్  సెంటర్​కు తీసుకువస్తున్నారు. గంజాయి, కల్తీ కల్లు వ్యసనానికి గురైనవారు అకస్మాత్తుగా వీటి వినియోగాన్ని ఆపివేస్తే వారు విచిత్రంగా ప్రవర్తిస్తారని డాక్టర్లు పేర్కొంటున్నారు.

 వ్యసనపరులుగా మారిన వారు నిద్ర, విశ్రాంతి లేకుండా అస్థిరత్వంతో వ్యవహరిస్తారని, కాళ్లు చేతులు వణకడం, ఫిట్స్ రావడం, అకస్మాత్తుగా పడిపోవడం లాంటి దుష్పరిణామాలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గంజాయి, కల్లుకు బానిసలైన యువకులు అవి లేకుండా ఉండలేకపోతున్నారని కొంతమంది కూలీ పనులు చేసే వారు మాత్రం ఆ పనుల్లో నిమగ్నం అవుతుండడంతో వారికి వీటి ప్రభావం పెద్దగా ఉండడం లేదని డాక్టర్లు పేర్కొంటున్నారు. 

అందుబాటులో ఆరు బెడ్‌లు, సౌకర్యాలు 

స్థానిక జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ సెంటర్‌‌లో ఇన్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా 6  బెడ్లను సమకూర్చారు. వారికి అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచారు. దీనికి తోడుగా ఓ కౌన్సిలర్​తో పాటు స్టాఫ్ నర్స్ డీ అడిక్షన్ సెంటర్‌‌లో  వైద్య సేవలందిస్తున్నారు.  ఇక్కడ ట్రైనీ కౌన్సిలర్​ను, ట్రైనీ స్టాఫ్ నర్స్​ను  నియమించాలనిపలువురు  డిమాండ్ చేస్తున్నారు. వారు లేకపోవడంతో ప్రస్తుతం డిప్యుటేషన్​పై పని చేస్తున్న సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. గంజాయి, కల్లుకు బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, వారు ఆ వ్యసనాలకు దూరమయ్యేట్లు చేయడం వైద్యాధికారికే కాకుండా సిబ్బందికి కత్తి మీద సాములా మారుతోంది.  

అడిక్షన్ కేసులు పెరుగుతున్నాయి...  

 గత కొద్ది రోజుల నుంచి అడిక్షన్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గంజాయి, కల్తీకల్లుకు బానిసలవుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. యువకులు ఎక్కువగా బానిసలు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మల్ లోని డీ  అడిక్షన్ సెంటర్ లో కౌన్సిలింగ్ తో పాటు వైద్య చికిత్సలు అందిస్తున్నాం. టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు సమాచారం అందించవచ్చు.  తల్లిదండ్రులు, మిత్రులు ఎప్పటికప్పుడు గమనించి డీ అడిక్షన్ సెంటర్ ను సంప్రదించాలి.- ఏ అరుణ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకియాట్రీ డిపార్ట్మెంట్, జిల్లా ఆసుపత్రి, నిర్మల్.