ఉగ్ర కుట్ర కేసు : ఈ నెల 17వరకు నిందితుల విచారణ

ఉగ్ర కుట్ర కేసు :  ఈ నెల 17వరకు నిందితుల విచారణ

హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన కేసులో నిందితులు అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను సిట్ విచారిస్తోంది. ఈ నెల 17వరకు వారిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి అందాయి ? గ్రనేడ్లు ఎలా సమకూరాయి ? ఇంకా ఎంతమంది టెర్రర్ స్లీపర్ సెల్స్ ఉన్నారు ? అనే వివరాలను రాబట్టే దిశగా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అబ్దుల్ జాహెద్ ద్వారా భర్తీ అయిన ఉగ్రవాదుల సమాచారాన్ని కూడా సేకరించనున్నారు.

ఈ ముగ్గురిని నిన్న చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు.. రహస్య ప్రాంతంలో ఉంచి ప్రశ్నిస్తున్నారు. ముగ్గురినీ వేర్వేరు గదుల్లో ఉంచి ఒకరు చెప్పిన సమాధానాల గురించి మరొకరి వద్ద ప్రస్తావిస్తూ నిజానిజాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ లో ఉంటున్న లష్కరే తయ్యిబా ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ నుంచి హవాలా మార్గంలో వచ్చిన డబ్బులను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారనే వివరాలను సైతం రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

ఉగ్ర కుట్ర నేపథ్యం.. 

ఉగ్రవాదుల భారీ కుట్రను హైదరాబాద్ పోలీసులు అక్టోబరు 2న  భగ్నం చేశారు. పేలుళ్లతో నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని కుట్ర పన్నిన అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను ఆ రోజున అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్ లు, రూ.5.50 లక్షల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ జాహెద్ కు పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో లింకులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో ఉగ్రదాడులు చేసేందుకు పాక్ నుంచే అతడికి నిధులు, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్స్ అందాయని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నగరంలో జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, దసరా ఉత్సవాలు జరిగే ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేయాలని జాహెద్ అండ్ టీం ప్లాన్ చేసింది. మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లతో కలిసి అబ్దుల్ జాహెద్ గ్రెనేడ్ దాడులకు సంబంధించిన ప్లానింగ్స్ చేశాడు. అబ్దుల్ జాహెద్ తో పాటు ఏడుగురి పై సిట్ కేసు నమోదు చేసింది. 

రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు..

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో నిందితుడు అబ్దుల్ జాహెద్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పలు కీలక అంశాలను పొందుపర్చారు. పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ నుంచి జాహెద్ అండ్ టీంకు  పేలుడు పదార్థాలు అందినట్లు దర్యాప్తులో గుర్తించారు. గత నెల 28న పేలుడు పదార్థాలు పాకిస్తాన్ నుంచి మహారాష్ట్రలోని మనోహరాబాద్ కు చేరినట్లు తెలిపారు. జాహెద్  బైక్ పై వెళ్లి 4 హ్యాండ్ గ్రెనేడ్లను తీసుకొచ్చాడు.  వీటిలో ఒక గ్రెనేడ్ ను తన దగ్గరే ఉంచుకొని.. మిగతా  మూడింటిని మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్ లకు ఇచ్చాడు. పాకిస్తాన్ లో ఉన్న హ్యాండ్లర్ల ద్వారా హైదరాబాద్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలకు ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.  ఇందుకోసం హవాలా మార్గంలో దాదాపు రూ.30 లక్షలకు పైగా నిధులు సమీయుద్దీన్, మాజ్, జాహెద్ లకు అందినట్లు పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల యువకులకు డబ్బు ఆశ చూపించి ఉగ్రవాదం వైపు మళ్లించి.. హైదరాబాద్ లో దాడులకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఎవరీ ఫర్హతుల్లా ఘోరీ  ? 

ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ  20 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి భారత్ లో ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్నాడు. అతడి కనుసన్నల్లోనే తాజాగా హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 62  ఏళ్ల ఫర్హతుల్లా ఘోరీ  స్వస్థలం సైదాబాద్ లోని కుర్మగూడ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో అతడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు పాకిస్తాన్ లో ఉంటూ లష్కరే తైబా, జేషే మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నాడు.