400లకు పైగా దొంగతనాలు.. ట్రిప్పుకు రూ. 20 వేలు టార్గెట్

400లకు పైగా దొంగతనాలు.. ట్రిప్పుకు రూ. 20 వేలు టార్గెట్

దొంగతనాలు చేస్తూ.. మైహోమ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటూ..
ఆ దొంగ చదువుకున్నది మూడవ తరగతి. పూణే నుండి సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లలో స్వీట్లు, తంబాకు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఆ క్రమంలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడే వారు పరిచయమై వారితో చేతులు కలిపాడు. ఆ విధంగా దొంగతనాల్లో ఆరితేరి ప్రయాణికుల జేబులు గుల్ల చేయడంలో సిద్ధహస్తుడయ్యాడు. నెలకు రూ. 30,000 వేల అద్దె చెల్లిస్తూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు ఉత్తరప్రదేశ్‌కి చెందిన అంతరాష్ట్ర దొంగ తానేదార్ సింగ్. బేగంపేట పోలీస్ స్టేషన్ ముందు అనుమానస్పదంగా తిరుగుతున్న తానేదార్ సింగ్‌ను రైల్వే పోలీసులు అరెస్టు చేసి అతని నుండి 40 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను, డబ్బులను స్వాధీనం చేసుకున్నారు.

సికింద్రాబాద్ రైల్వే సూపరిండెంట్ అనురాధ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన తానేదార్ సింగ్ రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలను, పడుకున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడని ఆమె తెలిపారు. ప్రస్తుతం అతను మదీనాగుడా వద్ద ఉన్న myhomes అపార్ట్‌మెంట్లో ఉంటూ నెలకు 30,000 వేల అద్దె చెల్లిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని తెలిపారు. ఆ సొమ్ముతోనే లక్షల రూపాయలు వెచ్చించి తన పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాడని ఆమె తెలిపారు. తానేదార్ సింగ్ నేరచరిత్ర 2004 నుండి ప్రారంభమైందని, ఇప్పటి వరకు 400లకు పైగా దొంగతనాలు చేశాడని ఆమె వెల్లడించారు. రైళ్లలో జేబుదొంగలతో కలిసి తను కూడా అదే పని చేసేవాడని ఆమె తెలిపారు. త్వరగా డబ్బు సంపాదించాలన్న దురాశతో గత కొన్నేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఆమె తెలిపారు. దొంగతనం చేసిన బంగారు ఆభరణాలు యూపీకి చెందిన దీపక్ అగర్వాల్ అనే వ్యక్తికి అమ్మేవాడని పోలీసులు తెలిపారు.

తానేదార్ సింగ్‌కి 2006వ సంవత్సరంలో చంద్రకాంత్ అనే వ్యక్తితో వికారాబాద్‌లో పరిచయం ఏర్పడింది. అతని ద్వారానే క్రికెట్ బెట్టింగ్, మట్కా వంటివి మొదలు పెట్టాడని పోలీసులు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుంటూ.. దొంగతనం చేసిన ఆభరణాలను కూడా బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకునేవాడని ఆమె తెలిపారు. రైళ్లలో ప్రయాణికులను బ్లేడ్‌తో బెదిరించి మరీ డబ్బులను, ఆభరణాలను దొంగిలించే వాడని ఆమె తెలిపారు. ఇతను ప్రధానంగా సికింద్రాబాద్, కాచిగూడ, వికారాబాద్, గుల్బర్గా, షోలాపూర్, పూణే, హైదరాబాద్, రాయచూర్, కర్నూల్ స్టేషన్లలో ప్రయాణించే రైళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. రైళ్లలో జేబు దొంగతనాలు చేసే క్రమంలో ఎవరైనా అడ్డొస్తే వారిపై బ్లేడుతో దాడి చేసేవాడని పోలీసులు తెలిపారు. ఇతని పై గతంలో వికారాబాద్, నాంపల్లి స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. గతంలో బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద స్కూటీతో అనుమానాస్పదంగా తిరుగుతున్న క్రమంలో ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ తానేదార్ సింగ్‌ని ఆపి విచారించబోగా.. అతడు వారిపై దాడికి పాల్పడి అక్కడి నుండి పారిపోయాడు. కొన్ని రోజుల తరువాత తిరిగి తన స్కూటీని తీసుకెళ్దామని వచ్చినప్పుడు పోలీసులు అతన్ని గుర్తించి పట్టుకున్నట్లు ఆమె తెలిపారు.

More News..

దారుణం: చెట్టుకు కట్టేసి కొట్టి.. నోట్లో మూత్రం పోసి..