పరుగెత్తి ప్రాణం పోశాడు.. ఆరోజు ఏం జరిగింది?

పరుగెత్తి ప్రాణం పోశాడు.. ఆరోజు ఏం జరిగింది?

నవంబర్​ 4 సాయంత్రం అబిడ్స్ పోస్టాఫీస్ దగ్గరలో హెవీ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ మధ్య ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పరుగు పెడుతున్నాడు ఆయన వెనుక ఒక అంబులెన్స్ హారన్ మోగిస్తూ వెళ్తోంది , బండ్లమీద వెళ్లే వాళ్లని పక్కకి జరగమని ఓపికగా చెబుతూ అలా దాదాపు ఒకటిన్నర కిలోమీటరు పరుగుతీసి ఎలాగైతేనేం ఆ అంబులెన్స్‌‌‌‌ని ట్రాఫిక్ మధ్యనుంచి పంపించాడు. అబిడ్స్ నుంచి తిరిగి వస్తున్న ఆ ట్రాఫిక్ పోలీస్‌‌‌‌ని చూస్తూ రోడ్డు మీద ఉన్న జనం అందరూ చప్పట్లు కొట్టారు.  వెహికల్స్ మీద ఉన్నవాళ్లు సెల్యూట్ చేశారు.

అతను  మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. అందరూ ఎవరిదారిన వాళ్లు వెళ్ళిపోయారు.   ఒక్క నైట్‌‌‌‌లో తెలంగాణ రాష్ట్రం మొత్తం ‘ట్రాఫిక్ పోలీస్ బాబ్జీ’ పేరు మారు మోగిపోయింది. సోషల్ మీడియా ఆయన్ని ఒక హీరోలా చూస్తోంది. బాబ్జీ మాత్రం ‘అదికూడా నా డ్యూటీనే కదా’ అని సింపుల్‌‌‌‌గా అన్నాడు. కాసేపు మాట్లాడిస్తే తన గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.

అంబులెన్స్ కోసం పరుగు తీసారు. కానీ, డ్యూటీలో మీ పాయింట్ వదిలి వెళ్లకూడదు అనుకుంటా ! 

బయట వాళ్లకి అంతే తెలుసు. పాయింట్ వదిలి పోకూడదు అనేది నిజమే. కానీ, అత్యవసర పరిస్థితుల్లో మా సర్వీస్ ఎవరికి అందించాలన్న దానిమీద మాకు స్పష్టమైన ఆదేశాలుంటాయి. మేము పని చేస్తున్నదే పబ్లిక్ కోసం అయినప్పుడు అంత ఆపదలో ఉన్న అంబులెన్స్ కోసం అలా వెళ్లొచ్చు.

జాబ్‌‌‌‌లో ఎప్పుడు చేరారు?

2010  హైదరాబాద్‌‌‌‌లో  ఆసిఫ్ నగర్‌‌‌‌‌‌‌‌లో నా సర్వీస్ మొదలైంది. 2015 చివర్లో అబిడ్స్​కి ట్రాన్స్‌‌‌‌ఫర్ అయ్యాను. అప్పటినుంచీ ఇక్కడే నా డ్యూటీ. ఇష్టంగా డ్యూటీ చెయ్యటం మా నాన్ననుంచి నేను నేర్చుకున్నది.

నాన్న ఏం చేసేవాళ్లు?

ఆయనది కూడా పోలీస్ డిపార్ట్ మెంటే. పేరు  జి. సింహాచలం.  అందుకే నాకూ పోలీస్ సర్వీస్ అంటే ఒక ఇష్టం ఏర్పడింది.  ఆ ఇష్టం తోనే ఇటువచ్చాను. నేను ట్రైనింగ్‌‌‌‌లోకి వెళ్ళిన పదిరోజులకే నాన్న చనిపోయారు. ఆ తొమ్మిది నెలలు ఆ ధుఃఖాన్ని భరిస్తూ అమ్మ ఒక్కతే ఉంది. అందుకే కావొచ్చు ఆంబులెన్స్ చూస్తే బాధగా ఉంటుంది. ఆ రోజూ అలాగే అనిపించింది.

ఆరోజు ఏం జరిగింది? జనం ఎవ్వరూ పక్కకి జరగలేదా?

అలా కాదు నిజంగానే అది హెవీ ట్రాఫిక్. జరగటానికి కూడా ప్లేస్ సరిగా లేదు. నేను వెళ్ళి చెబుతుంటే అందరూ సహకరించారు. వెహికల్స్ పక్కకి తీసి అంబులెన్స్‌‌‌‌కి దారిచ్చారు.

అంబులెన్స్ వెళ్లిపోయాక రోడ్డుమీద అంతా చప్పట్లు కొడుతుంటే మీకెలా అనిపించింది..

గర్వంగా… డ్యూటీ పాయింట్‌‌‌‌కి చేరుకోగానే ఒక విషయం అర్థమైంది.  వాళ్లంతా ఇచ్చిన గౌరవం… ఆ అప్లాజ్ అంతా ఈ బాబ్జీకి కాదు. ‘‘ట్రాఫిక్ పోలీస్ బాబ్జీ’’కి.  నిజంగా మామూలు వ్యక్తినే అయి ఉంటే నేనూ అలా రోడ్డు మీద ఉండిపోయేవాడినే కావచ్చు. కానీ నేను పోలీస్ కావటం వల్లనే కదా ఆ మాత్రం సాయం చేయగలిగాను. అందుకే పోలీస్ అయినందుకు ఎక్కువగా గర్వపడ్డాను.

పై అధికారులు ఏమన్నారు?

చాలా ఆనంద పడ్డారు మా సీపీగారూ, అడిషనల్ సీపీ గారూ పర్సనల్‌‌‌‌గా మెచ్చుకున్నారు. నా కొలీగ్స్ నుంచీ మెచ్చుకోళ్లు అందుకుంటూనే ఉన్నా.  అయితే..! ఆనందంతో పాటు బాధ్యతగా ఉండాలన్న ఆలోచనకూడా పెరిగింది.

– నరేశ్​ కుమార్​ సూఫీ

ఒక మాట చెప్పాలనుకుంటున్నాను..

అనిపించటం అని ఏమీ లేదు.. నిన్న నేను చేసింది కూడా నా డ్యూటీలో భాగమే.  కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. .. పోలీస్ అంటేనే జనాల్లో ఒక అభిప్రాయం ఉంటుంది, కోప్పడతారు, సీరియస్ గా ఉంటారు అని. ఇక ట్రాఫిక్ పోలీస్ అంటే ఆ రెస్పెక్ట్ కూడా ఉండదు. కానీ రోజులో అన్ని గంటలు కదలకుండా కనీసం టాయిలెట్ కోసమైనా బయటికి వెళ్ళే టైం లేనప్పుడు కూడా అలాగే నిలబడి సేవలందించే ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ అంటే అందరూ అనుకున్నంత ఈజీ కాదు. అయినా డ్యూటీ చేస్తూనే ఉన్నాం, ఓపికతో పబ్లిక్ కి సేఫ్టీ, రూల్స్ పాటించమని చెప్తున్నాం.  ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ పాటిస్తే చాలు. నిన్నటిలా నేను పరుగు తీసే అవసరం రాదు.