
ఫార్ములా రేస్‌కు రెడీ అవుతున్న హైదరాబాద్
ఈ నెల 11న స్ట్రీట్ సర్క్యూట్‌పై పోటీ
ఇండియాలో తొలిసారిగా జరిగే ఫార్ములా –ఈ రేస్‌కు మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కిలో మీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌పై ఫార్ములా –ఈ కార్లు మెరుపు వేగంతో దూసుకెళ్లనున్నాయి. ఈ నెల 11న జరిగే మెగా ఈవెంట్ కోసం ట్రాక్, గ్యాలరీ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. పోయినేడాది ఇదే ట్రాక్‌పై ఇండియన్ రేసింగ్ లీగ్‌లో ఫార్ములా లెవెల్ 3 కార్ల స్పీడ్ చూసిన జనాలకు ఇప్పుడు 300 ప్లస్ స్పీడ్‌తో దూసుకెళ్లే జెన్3 ‘ఈ కార్లు’ మరింత కిక్ ఇవ్వనున్నాయి. మరో నాలుగు రోజుల్లో జరిగే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ గురించి కొన్ని విశేషాలు..
(హైదరాబాద్, వెలుగు) : రేసింగ్ గురించి తెలిసిన వాళ్లకు ఫార్ములా 1,2, 3, 4 లెవెల్స్ పోటీలపై అవగాహన ఉండే ఉంటుంది. వీటిలో పోటీపడే కార్లన్నీ ఫ్యుయెల్‌తో నడుస్తాయి. బ్యాటరీ (ఎలక్ట్రిక్) సాయంతో నడిచే ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహిస్తున్న ఏకైక రేసింగ్ చాంపియన్‌షిప్ ‘ఫార్ములా– ఈ’. ఇది 2014లో బీజింగ్‌లో షురూ అయింది. మోటార్ స్పోర్ట్స్‌ను ఆర్గనైజ్ చేసే ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ (ఎఫ్‌ఐఏ) 2019లో దీనికి వరల్డ్ చాంపియన్‌షిప్ హోదా ఇచ్చింది. అప్పటినుంచి దీన్ని ‘ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములా–ఈ వరల్డ్ చాంపియన్‌షిప్’గా పిలుస్తున్నారు. ఎలాంటి కార్బన్ ఎమిషన్స్ (ఉద్గారాలు) వెలువడని ప్రపంచంలోని తొలి స్పోర్ట్ ఈవెంట్ ఇదే. సాధారణంగా ఫార్ములా రేసులన్నీ సిటీ ఔట్‌స్కర్ట్స్, ఇండ్లకు దూరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రేసింగ్ ట్రాక్‌పై జరుగుతాయి. కానీ, సిటీ మధ్యలోని రోడ్లపై ఏర్పాటు చేసిన ట్రాక్ (స్ట్రీట్ సర్క్యూట్స్)పై జరగడం ఫార్ములా -–ఈ మరో స్పెషాలిటీ.
రెస్టారెంట్‌లో ముచ్చటతో మొదలై
ఫార్ములా ఈ ప్రారంభం వెనుక ఆసక్తికర విషయం ఉంది. 2011లో స్పెయిన్ బిజినెస్ మ్యాన్, ఫార్ములా– ఈ ఫౌండర్ అలెజాండ్రో ఎగగ్, ఎఫ్‌ఐఏ ప్రెసిడెట్ జీన్ టాడ్‌తో ఓ రెస్టారెంట్‌లో క్యాజువల్‌గా ముచ్చట్లు పెడుతుండగా మొత్తం ఎలక్ట్రిక్ కార్లతో ఇంటర్నేషనల్ రేసింగ్ చేస్తే ఎట్లుందనే ఆలోచన వచ్చింది. ఏడాది తిరక్కుండానే ఆ ఆలోచన నిజమైంది. 2014-–15తో జనరేషన్1 (జెన్1) ఎలక్ట్రిక్ కార్లతో ఈ రేస్ మొదలైంది. ఫస్ట్ ఎడిషన్ 14 దేశాల్లో నిర్వహించగా.. బీజింగ్‌లో జరిగిన తొలి రేస్‌లో లూకాస్ డి గ్రాస్ గెలిచాడు. ప్రస్తుతం జెన్3 కార్లు వాడుతున్నారు.
వినోదం.. సందేశం
రయ్ రయ్ మంటూ దూసుకెళ్లే జెన్3 కార్లతో ‘ఈ రేస్’ ఫ్యాన్స్‌కు వినోదంతో పాటు ఎయిర్ పొల్యూషన్, వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించాలనే విషయంలో సందేశం కూడా ఇస్తోంది. ఈ రేసింగ్ సిరీస్‌తో ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ, వాడకాన్ని ప్రోత్సహించేలా చేస్తోంది. ప్రతి తర్వాతి సీజన్‌లో ఉద్గారాలను తగ్గించే అవకాశాలను గుర్తించేందుకు కృషి చేస్తోంది. వంద శాతం రినవబుల్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధన) టార్గెట్‌ను అందుకునేందుకు ఫార్ములా ఈ ఇప్పటి వరకు అన్ని సీజన్లలో 52 శాతం వ్యర్థాలను రీసైకిల్ చేసింది.
11 టీమ్స్, 22 మంది రేసర్లు
ఫార్ములా–ఈ రేసులో 11 టీమ్స్ ఉన్నాయి. ప్రతీ టీమ్‌లో ఇద్దరేసి డ్రైవర్ల చొప్పున పోటీ పడతారు. ఈ 11 టీమ్స్‌లో సొంతంగా తయారు చేసిన కార్లను వాడేవి ఏడు జట్లు. ఇండియాకు చెందిన మహీంద్ర టీమ్ సొంత కార్లతో బరిలోకి దిగుతోంది. మిగతా 4 టీమ్స్ వివిధ కంపెనీలకు చెందిన కార్లను కొనుక్కొని పోటీ పడతాయి.
బ్యాటరీ 350 కేవీ.. స్పీడ్ 322 కి.మీ..
ఇతర మోటార్ స్పోర్ట్ ఈవెంట్లతో పోలిస్తే ఫార్ములా– ఈ రేసులో ఉపయోగించే కార్లే ఈ ఈవెంట్‌ను ప్రత్యేకంగా మారుస్తాయి. ఫార్ములా– ఈ రేసులో గతంలో జెన్1, జెన్2 కార్లను ఉపయోగించారు. ఇప్పుడు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రూపొందించిన జెన్3 కార్లను వాడుతున్నారు. జెన్1, జెన్2 కార్లతో పోలిస్తే వీటి ఎత్తు, పొడవు, బరువు తక్కువ. స్పీడ్ మాత్రం ఎక్కువ. ఇవి మ్యాగ్జిమమ్ 322 కి.మీ వేగంతో దూసుకెళ్తాయి. 350 కిలో వాట్ల బ్యాటరీతో నడుస్తాయి. ఫ్యుయెల్‌తో నడిచే కార్ల కంటే వీటి నుంచి తక్కువ సౌండ్ వస్తుంది. వీటి టైర్లు నేచురల్ రబ్బర్లు, రీసైకిల్ చేసిన ఫైబర్‌తో తయారు చేశారు. ఇవి మంచి గ్రిప్ ఇవ్వడంతో పాటు అన్ని రకాల వెదర్ కండిషన్స్‌లో స్టేబుల్ గా ఉంటాయి. రేస్ ముగిశాక టైర్లను రీసైకిల్ చేయొచ్చు.