
రూ. 1.70 కోట్లతో ముంబైకి ఎంపికైన హైదరాబాదీ తిలక్ వర్మ
హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్ పుణ్యమా అని హైదరాబాద్‌కు చెందిన మరో యంగ్‌స్టర్ వెలుగులోకి వచ్చాడు. కొన్నేళ్ల కిందట ఆటో డ్రైవర్ కొడుకు మహ్మద్ సిరాజ్ ఇప్పుడు టీమిండియా స్టార్ పేసర్ అవగా.. ఇప్పుడు ఓ ఎలక్ట్రీషియన్ కొడుకు కోటీశ్వరుడయ్యాడు. అతనే 19 ఏళ్ల యంగ్ సెన్సేషన్ ఠాకూర్ తిలక్ వర్మ. ఆటపై ప్రేమతో పేదరికాన్ని, అనేక కష్టాలను దాటుకుంటూ ముందుకెళ్తున్న ఠాకూర్ కష్టానికి ప్రతిఫలం దక్కింది. అతని టాలెంట్‌కు గుర్తింపు లభించింది. హైదరాబాద్‌తో పాటు డొమెస్టిక్ లెవెల్‌లో సూపర్ ఫెర్ఫామెన్స్ చేస్తున్న ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ తిలక్‌ను ముంబై ఇండియన్స్ రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసింది. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్‌లోనూ బ్యాటింగ్ చేయగలిగే ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌ను ముంబై అతని బేస్‌ప్రైస్ రూ. 20 లక్షల కంటే ఎనిమిదిన్నర రెట్లు ఎక్కువ మొత్తం ఇచ్చింది. ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగల తిలక్ కోసం సన్‌రైజర్స్, రాజస్తాన్, చెన్నై కూడా పోటీ పడ్డాయంటే అతని టాలెంట్ ఏపాటితో అర్థం చేసుకోవచ్చు.
కోచ్ అండతో ముందుకు
సురేశ్ రైనాను ఆరాధించే తిలక్.. తొమ్మిదేళ్ల వయసులో క్రికెటర్ కావాలని డిసైడయ్యాడు. ఎలక్ట్రీషియన్‌గా పని చేసే తండ్రి నంబూరి నాగరాజుకు సైతం తన కొడుకును క్రికెటర్ చేయాలని ఉన్నా కోచింగ్‌కు ఖర్చు చేసే స్థోమత లేక ఇబ్బంది పడ్డాడు. అయితే, చిన్నప్పుడే తిలక్‌లో టాలెంట్ గుర్తించిన కోచ్ సలామ్ బయాష్ అతడిని అక్కున చేర్చుకున్నాడు. తన లేగాల క్రికెట్ అకాడమీలో ఫ్రీ కోచింగ్ ఇవ్వడంతో పాటు కిట్లు సహా అతనికి అయ్యే ఖర్చులు మొత్తం భరించాడు. అతని నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్.. అతి తక్కువ కాలంలోనే హైదరాబాద్ క్రికెట్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో సత్తా చాటి 2020 వరల్డ్ కప్‌లో ఆడిన ఇండియా అండర్19 టీమ్‌లో ప్లేస్ సాధించాడు. అదే టైమ్‌లో డొమెస్టిక్ క్రికెట్‌లో చెలరేగిపోయాడు. లాస్ట్ సీజన్‌లోనే అతను పలు ఐపీఎల్ ఫ్రాంచైజీల సెలక్షన్ ట్రయల్స్‌కు అటెండ్ అయ్యాడు. అతని సత్తాను పలు ఫ్రాంచైజీలు గుర్తించగా.. ముంబై పక్కా ప్లానింగ్‌తో అతడిని సొంతం చేసుకుంది. తమ టీమ్‌లో వన్‌డౌన్ ప్లేస్‌కు తను పక్కాగా సరిపోతాడని భావించింది. ఈ సీజన్ స్టార్టింగ్ మ్యాచ్ నుంచే తిలక్‌కు ఫైనల్ ఎలెవన్‌లో చాన్స్ ఇచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
రాహుల్, భగత్, మిలింద్‌కు చాన్స్
తిలక్‌తో పాటు మరో ముగ్గురు హైదరాబాదీలకు ఈ సారి చాన్స్ వచ్చింది. బ్యాటర్ రాహుల్ బుద్ధిని ముంబై ( రూ. 20 లక్షలు) కొనగా, స్పిన్ ఆల్‌రౌండర్ భగత్ వర్మను చెన్నై (రూ. లక్షలు) రిటైన్ చేసుకుంది. అలాగే, లెఫ్టామ్ పేసర్ సీవీ మిలింద్ రూ. 25 లక్షలతో ఆర్‌సీబీకి సెలెక్ట్ అయ్యాడు.
ఈ సీజన్‌లో చాన్స్ వస్తుందని నేను నమ్మకంగా ఉన్నా. ఐపీఎల్‌లో ఆడలన్నది నా కల. అది ఇప్పుడు నెరవేరింది. నన్ను ఈ స్థాయికి చేర్చిన ఘనత మా కోచ్ సలామ్ బయాష్దే. పదేళ్ల నుంచి నాకు సపోర్ట్‌గా నిలిచారు. క్రికెట్ కిట్ సహా నా ఖర్చులన్నీ ఆయనే భరించారు. కరోనా టైమ్‌లో ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడ్డా.. నేను క్రికెట్ ఆడేలా చూసుకున్నారు. ఇప్పుడు మా పరిస్థితి కాస్త ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నా. ‑ తిలక్ వర్మ