Hyderabad Metro : మెట్రో బాదుడు.. ఆఫర్ తొలగించారు.. ఛార్జీలు పెంచారు

Hyderabad Metro : మెట్రో బాదుడు.. ఆఫర్ తొలగించారు.. ఛార్జీలు పెంచారు

ఎల్అండ్ టీ సంస్థ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు పెద్ద షాక్ ఇచ్చింది. మెట్రో  ప్రయాణ ఛార్జీల రాయితీల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా హాలీడే సూపర్ సేవర్ కార్డు రేటు పెంచి ప్రయాణికులపై భారం మోపేందుకు సిద్ధం అయింది. మెట్రో రద్దీ టైంలో సూపర్ సేవర్ కార్డ్ రేటును పెంచడంతో పాటు, మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్ పైన వచ్చే డిస్కౌంట్ ను ఎత్తేసినట్లు ఎల్అండ్ టీ తెలిపింది. 

పోయిన సంవత్సరం ఏప్రిల్ 2న సూపర్ సేవర్ హాలిడే కార్డును ప్రవేశపెట్టిన మెట్రో.. రూ.59 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే హాలిడే రోజుల్లో ఫ్రీగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు.  ఇప్పుడు ఆ ప్లాన్ ని మార్చుతూ రూ.59 ఉన్న స్మార్ట్ కార్డు ఆఫర్ ను రూ.99 కి పెంచారు. అయితే, ఈ సూపర్ సేవర్ హాలిడే కార్డు నోటిఫైడ్ హాలిడేస్ ల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇదివరకు క్యూఆర్ కోర్డ్, మెట్రో కార్డ్ లపై ప్రతీ ప్రయాణ ఛార్జీలో10 శాతం డిస్కౌంట్ వచ్చేది. ఇప్పుడు చేసిన మార్పుల్లో.. ఈ డిస్కౌంట్ ఆఫర్ ను రోజంతా కాకుండా.. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంచింది. రద్దీ టైంలో డిస్కౌంట్ ఆఫర్ ను పూర్తిగా ఎత్తేశారు. సూపర్ సేవర్ కార్డ్ పై తీసుకొచ్చిన మార్పులు ఏప్రిల్ 1 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు అమలులో ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు.