హైడ్రాకు మాన్సూన్ బాధ్యతలు.. వానాకాలం విపత్తు నిర్వహణ బాధ్యత ఇక నుంచి హైడ్రాదే

 హైడ్రాకు మాన్సూన్ బాధ్యతలు..  వానాకాలం విపత్తు నిర్వహణ బాధ్యత ఇక నుంచి హైడ్రాదే

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​లో వానాకాలంలో చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ కోసం జీహెచ్ఎంసీ పిలిచిన టెండర్లు వివాదాస్సదం కావడంతో ఆ బాధ్యతను హైడ్రాకు అప్పగిస్తూ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్ మెంట్ కార్యదర్శి ఇలంబర్తి సోమవారం (June 9) మెమో జారీచేశారు. ఈ టెండర్ ప్రక్రియను జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు సమన్వయంతో నిర్వహించాలని మెమోలో పేర్కొన్నారు. 

టీసీయూఆర్ పరిధిలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువుల పరిరక్షణతోపాటు విపత్తుల నిర్వహణ బాధ్యతను సైతం హైడ్రాకు అప్పగించారు. అంతేకాదు జీహెచ్ఎంసీ 1955చట్టంలోని సెక్షన్ 374బీ ప్రకారం హైడ్రాకు అధికారాలు కట్టబెట్టారు.  దీంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో విపత్తుల నిర్వహణను చేపట్టే అధికారం కూడా హైడ్రా ఉంది. 

అయితే ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా టీసీయూఆర్ పరిధిలో విపత్తుల నిర్వహణ, నాలాల నిర్వహణ, ట్రాఫిక్ మళ్లింపు, కూలిన చెట్లను తొలగించడం, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వాటర్ తొలగించడానికి మోటారు పంపు సెట్ల నిర్వహణ,  మ్యాన్ హోళ్ల నిర్వహణ వంటి కార్యక్రమాలను జలమండలి, టీజీఎస్పీడీసీఎల్ విభాగాల సహకారంతో చేపట్టాలని  పేర్కొన్నారు.