సచిన్‌లా.. కోహ్లీ ప్రతిభావంతుడని నేను అనుకోవట్లేదు: మాజీ క్రికెటర్

సచిన్‌లా.. కోహ్లీ ప్రతిభావంతుడని నేను అనుకోవట్లేదు: మాజీ క్రికెటర్

క్రికెట్‌కు విరామం ప్రకటించాక ఆటగాళ్లు ఏం చేయాలి..? మిగిలిన జీవితాన్ని కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా జీవించాలి. లేదంటే కోచ్‌గానో.. కామెంటేటర్‌గానో అవతారమెత్తి అదనపు ఆదాయం పొందే మార్గాలు చూడాలి. అంతేకానీ, కాదు.. కూడదు అని ఇలా ఒకరిని తక్కువ చేసేలా విమర్శించారో.. అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సిందే. ప్రస్తుతం టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. అలాంటి విమర్శలే ఎదుర్కొంటున్నారు. 

సచిన్‌లా.. కోహ్లీ అంత ప్రతిభావంతుడు కాదంటూ అతని చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన వసీం జాఫర్.. విరాట్ కోహ్లీతో పాటు వరల్డ్ కప్ టీమ్ కాంబినేషన్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

వసీం అక్రమ్, వకార్ యూనిస్, కోర్ట్నీ వాల్ష్.. 

"సచిన్ భిన్నమైన ఆటగాడు. అతను ప్రతిభావంతుడే కాదు.. కష్టపడి పనిచేసేవాడు. 16 ఏళ్ల వయససులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్.. వసీం అక్రమ్, వకార్ యూనిస్, కోర్ట్నీ వాల్ష్ లాంటి భీకర పేసర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. జట్టుకు నేనున్నానంటూ అభయమిచ్చాడు. తన 24 ఏళ్లు పాటు ఆడిన సచిన్ 30 వేల పరుగులు చేశాడు. కానీ విరాట్ అలా ప్రతిభావంతుడని నేను అనుకోవట్లేను. ఈ విషయాన్ని కోహ్లీ కూడా అంగీకరించాడు.."

ప్రతిభ లేదు.. అంకితభావం, కష్టమే

"కోహ్లీ జట్టులోకి వచ్చిన మొదట్లో, అతని బ్యాటింగ్‌లో చాలా లోపాలు కనిపించాయి. రాను.. రాను.. ఆ బలహీనతలను అతను అధిగమించాడు. రెండు.. మూడు ఏళ్ల తర్వాత గొప్ప ఆటగాడిగా మారిపోయాడు. అందుకు అతనిలో ప్రత్యేక ప్రతిభ ఏమీ లేదు. అంకితభావం, కష్టమే అతన్ని ఈ స్థాయికి చేర్చింది. మెరుగైన క్రికెట్ ఆడేందుకు తాను చేయాల్సిన పనుల గురించి కోహ్లీ ముందే తెలుసుకున్నాడు. ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారి భారత క్రికెట్ జట్టులో విప్లవాన్ని తీసుకొచ్చాడు.." అని వసీం జాఫర్ చెప్పుకొచ్చారు.

పోల్చి చూస్తే.. 

ఇదిలావుంటే, రెండు తరాల ప్రతిభను పోల్చిన ఈ భారత మాజీ క్రికెటర్.. విరాట్ కోహ్లీ ఈ తరంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని కొనియాడాడు. అయితే, రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ను శాసించిన సచిన్ టెండూల్కర్‌తో అతన్ని పోల్చడం సరికాదని తెలిపారు. వసీం జాఫర్ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరితో మరొకరిని పోల్చి విశ్లేషణలు చేయటం మానుకోవాలని చెప్తున్నారు.