చాయ్‌తో నాది విడదీయలేని బంధం.. అందుకే నేను చాయ్ వాలా: మోదీ

చాయ్‌తో నాది విడదీయలేని బంధం.. అందుకే నేను చాయ్ వాలా: మోదీ

మిర్జాపూర్ (యూపీ): ‘‘నేను చాయ్ కప్పులు.. ప్లేట్లు వాష్ చేసుకుంటూ పెరిగాను. రైల్వే స్టేషన్, దుకాణాల్లో చాయ్ అమ్మేవాణ్ని.. నాకు, చాయ్​కు చాలా లోతైన అనుబంధం ఉంది. అందుకే నన్ను చాయ్​వాలా అని అంటరు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్​సభ ఎన్నికల్లో భాగంగా యూపీలోని మిర్జాపూర్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రాన్ని మాఫియా శాసించేదని అన్నారు. యోగీ సీఎం అయ్యాక మాఫియా లేకుండా చేశామని తెలిపారు.

‘‘తమ ఓటును సమాజ్​వాదీ పార్టీకి వేసి.. వృథా చేసుకోవాలని ఎవరూ అనుకోరు. నిండా మునిగిన వాళ్లకు ఓటేసే వారు కూడా ఎవరూ లేరు. ఎవరి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమైందో వారికే సామాన్యులు ఓటు వేస్తారు. ఇండియా కూటమిలోని పార్టీల గురించి దేశ ప్రజలందరికీ బాగా తెలుసు. మతతత్వ రాజకీయాలు చేసుకుంటూ పబ్బం గడుపుకునే వారికి ప్రజలే బుద్ధి చెప్తరు. తమ కుటుంబం బాగుపడితే చాలనుకునే మనస్తత్వం వారిది. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. మీరే నా కుటుంబ సభ్యులు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటది’’అని విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర

రాజ్యాంగానికి ఎంతో గౌరవం ఉందని, దాన్ని మార్చేందుకు ఇండియా కూటమి కుట్ర పన్నుతున్నదని మోదీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు ప్లాన్ చేస్తున్నదన్నారు. ‘‘మతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండకూడదని మన రాజ్యాంగం చెప్తున్నది. కానీ.. ఇండియా కూటమి పట్టించుకోవడం లేదు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎస్పీ తన మేనిఫెస్టోలో పేర్కొన్నది. దీని కోసం రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని అంటున్నరు. ముస్లింలకు పీఏసీ, పోలీసు ఉద్యోగాల్లో 15% రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాలరాస్తున్నరు’’ అని మోదీ మండిపడ్డారు. పూర్వాంచల్ అభివృద్ధిని ఎస్పీ, కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. మాఫియా, పేదరికం, నిస్సహాయ ప్రాంతంగా మార్చేశారన్నారు. ఇండ్లకు నిప్పు పెట్టి, భూములు లాగేసుకున్న వాళ్లంతా ఇండియా కూటమిలో ఉన్నారన్నారు. అలాంటి వారిని పూర్వాంచల్​లో అడుగుపెట్టనివ్వొదన్నారు.

యాదవులను అఖిలేశ్ మోసం చేసిండు

యాదవ కమ్యూనిటీని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మోసం చేశారని మోదీ ఆరోపించారు. ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. తన కుటుంబ సభ్యులకే ఎక్కువ టికెట్లు ఇచ్చుకున్నడని విమర్శించారు. ‘‘పట్టుబడిన టెర్రరిస్టులను కూడా ఎస్పీ విడిచిపెట్టేస్తది. నిజాయితీపరులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. యూపీ, పూర్వాంచల్​ను మాఫియాకు అడ్డాగా మార్చింది. మాఫియాను కూడా వారు ఓటు బ్యాంకుగా చూసేవారు. సీఎం యోగి మాత్రం ధైర్యంగా ‘స్వచ్ఛతా అభియాన్’ను ముందుకు తీసుకెళ్తున్నారు. బీజేపీ వచ్చాక మాఫియా వణికిపోతున్నది’’ అని మోదీ అన్నారు.