నేను పార్టీ మారట్లే .. ఆ వార్తల్లో నిజం లేదు: వివేక్ వెంకటస్వామి

నేను పార్టీ మారట్లే  .. ఆ వార్తల్లో నిజం లేదు: వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: తాను పార్టీ మారడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లో చేరుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఈ మేరకు వివేక్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను కాంగ్రెస్ లో చేరుతానంటూ కొన్ని పేపర్లలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ అదంతా అబద్ధం. నేను కాంగ్రెస్ నేతలతో టచ్ లో లేను. గత రెండ్రోజులుగా పూణేలో ఉన్నాను. గతంలో అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఇలాగే పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేశారు. నేను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను” అని వివేక్​ పేర్కొన్నారు.

వివేక్ బీజేపీలోనే ఉంటరు :  అందుగుల శ్రీనివాస్ 

కోల్​బెల్ట్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతున్నారంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, దాన్ని ఎవరూ నమ్మొద్దని బీజేపీ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ అందుగుల శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం మందమర్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘వివేక్​వెంకటస్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని విడిచివెళ్లరు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తేవడంతో పాటు పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు కొన్ని పత్రికల్లో ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అదంతా అబద్ధం” అని శ్రీనివాస్​ చెప్పారు.

 ‘‘పెద్దపల్లి పరిధిలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా వివేక్​వెంకటస్వామిని ప్రజలు ఆదరిస్తారు. ఆయన ఇమేజ్​ను డ్యామేజ్ చేసేందుకు కొంతమంది బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. చెన్నూరులో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెన్నూరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివేక్​పోరాటం చేస్తున్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్​తో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని ఉద్యమిస్తున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ ​వైఫల్యాలపై కాంగ్రెస్ నేతలు ఏనాడూ ప్రశ్నించలేదు. స్థానికేతరుడైన బాల్క సుమన్​ను ఓడించేందుకు బీఆర్ఎస్ లీడర్లే సిద్ధమవుతున్నారు. బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు. ఈసారి బాల్క సుమన్​ను ఓడగొడితేనే, చెన్నూరు ప్రజల బతుకులు బాగుపడుతాయి” అని అన్నారు. సమావేశంలో చెన్నూరు నియోజకవర్గ కన్వీనర్​అక్కల రమేశ్ పాల్గొన్నారు.