
ఏ హడావిడి లేని ప్రశాంతమైన జాబ్ చేయాలని కంప్యూటర్ సైన్స్ చదివింది. ఆ తర్వాత జాబ్‌లో జాయిన్ అయ్యి మేనేజర్ స్థాయికి వెళ్లింది. అక్కడితో ఆగిపోలేదు.. ఆ తర్వాతే ఆమె కెరీర్ యూటర్న్ తీసుకుంది. సరదాగా ఒక కుకింగ్ షోలో కంటెస్ట్‌గా పార్టిసిపేట్ చేసింది. ఆమె టాలెంట్ చూసి యాడ్స్ చేయమని ప్రపోజల్స్ వచ్చాయి. అంతే... ఇక తిరిగి చూసుకోలేదు, యాడ్స్, టీవీ షోలు, సీరియల్స్‌తో పాటు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు.. యోగిత బిహాని. ‘ది కేరళ స్టోరీ’ అనే సినిమాతో ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిందామె. మరి తన జర్నీ ఏంటో తన మాటల్లోనే...
‘‘మాది రాజస్థానీ ఫ్యామిలీ. కానీ, నేను పుట్టి పెరిగిందంతా మహారాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాల్లో. ఇప్పుడైతే రాజస్థాన్‌లోనే ఉంటున్నాం. మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే సీరియల్స్‌లో చూపిస్తారు కదా.. అచ్చం అలాగే ఉంటుంది. మాది పెద్ద కుటుంబం. ఇంట్లో తొమ్మిదిమందిమి ఉంటాం. అమ్మానాన్న, నానమ్మ, ఐదుగురు అక్కచెల్లెళ్లం, ఒక తమ్ముడు. మామూలుగా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో, ఒక్కడే మగ పిల్లాడు ఉంటే అతన్ని స్పెషల్‌గా చూస్తారు. అమ్మాయిలకంటే అబ్బాయిలే గొప్ప అన్నట్లు మాట్లాడుతుంటారు. మా ఇంట్లో కూడా అంతే. మా పెద్దక్కకి చిన్న వయసులోనే పెండ్లి చేశారు. ఆ తర్వాత మిగతా వాళ్లకు కూడా పెండ్లి అయింది.
నా విషయానికొస్తే.. సుమెర్మల్ జైన్ పబ్లిక్ స్కూల్లో హై స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశా. నాకు నచ్చిన కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశా. చదువు పూర్తవ్వగానే జాబ్ మీద దృష్టిపెట్టా. మొదట ఢిల్లీలోని ఫరిదాబాద్‌లో రెడ్ఫుడీ అనే స్టార్టప్‌లో చేరా. అందులో రకరకాల పొజిషన్స్‌లో 2016 వరకు పనిచేశా. ఆ తర్వాత ముంబై వెళ్లా. అక్కడ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌లో సేల్స్, మార్కెటింగ్ కో– ఆర్డినేటర్‌గా పనిచేశా. ట్రిలియోలో కొన్నేండ్లు మేనేజర్‌గా కూడా చేశా.
ఫుడ్ అంటే ఇష్టం
అది 2017. ‘ఫెమ్మే ఫుడీ’ అనే టీవీ కుకింగ్ షోలో పది మంది కంటెస్ట్‌లు కావాలని ఒక ప్రకటన వచ్చింది. దానికి నేను ఆడిషన్ ఇచ్చా. వాళ్ల నుంచి రిటర్న్ ఫోన్ కాల్ వచ్చింది. అందులో నన్ను సెలక్ట్ చేశారు. ఈ మాట వినగానే ఎవరైనా ఏం చేస్తారు? నేషనల్ ఛానెల్లో కనిపించబోతున్నందుకు ఎగిరి గంతేస్తారు. కానీ, మా ఫ్యామిలీలో అలా జరగలేదు. నేను టీవీలో కనిపించడం వాళ్లకి ఇష్టం లేదు. అది కూడా షూటింగ్ గోవాలో జరుగుతుండడంతో అసలే వద్దు అన్నారు. కానీ, నాకేమో ఫుడ్ ప్రిపేర్ చేయడమన్నా, తినడమన్నా చాలా ఇష్టం. అలాంటిది ఒక ప్లాట్ ఫాం దొరికినప్పుడు మన స్కిల్స్ ప్రూవ్ చేసుకుంటే తప్పేంటి? అనిపించింది. దాని గురించి మా ఇంట్లో చాలా డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్‌గా నా వాళ్లతో ఒకటే చెప్పా.. మన ట్రెడిషన్, వ్యాల్యూస్‌కి రెస్పెక్ట్ ఇస్తా. కానీ, నా మనసులో కూడా కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడకండి అని బతిమిలాడా. దాంతో ‘సరే’ అన్నారు.
గ్లామర్ వరల్డ్‌లోకి ఎంట్రీ
నేను స్కూల్లో చదివేటప్పుడు ప్రతి స్పెషల్ డేస్, సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేసేదాన్ని. స్టేజ్ మీద ఫ్రంట్ లైన్లో నిల్చుని పర్ఫార్మ్ చేసేదాన్ని. ఆ ఇంట్రెస్ట్‌తోనే ‘ఫెమినా మిస్ ఇండియా రాజస్థాన్ 2018’లో పార్టిసిపేట్ చేశా. అందులో టాప్ త్రీ కంటెస్టెంట్లలో ఒకరిగా సెలక్ట్ అయ్యా. దీని తర్వాత సల్మాన్ ఖాన్‌తో కలిసి సోనీ టీవీలో రాబోయే గేమ్ షో ‘దస్ కా దమ్’ ప్రోమో కోసం సెలక్ట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక చాలా మంచి పేరొచ్చింది. టీవీ, సినీ ప్రొడ్యూసర్ అయిన ఏక్తా కపూర్ ఆ షోలో నన్ను చూసి, నా స్కిల్స్ గుర్తించారు. దాంతో ఆమె ‘దిల్ హీ తో హై’లో కరణ్ కుంద్రా పక్కన మెయిన్ లీడ్‌గా చేసే అవకాశం ఇచ్చారు. మొదట్లో నేను నటించాలనుకోలేదు. కానీ, ఒక్కసారి అవకాశం వచ్చాక తెలిసింది. ఇది అస్సలు వదులుకోకూడదు అని. అప్పటి నుంచి యాక్టింగ్ నేర్చుకుంటూ టీవీ సీరియల్స్‌లో నటిస్తూ వచ్చా. ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు దక్కుతున్నాయి. నా మొదటి సినిమా ‘ఏకే వర్సెస్ ఏకే’. అందులో సినిమాటోగ్రాఫర్ రోల్లో నటించా. అనురాగ్ కశ్యప్‌కి అసిస్టెంట్‌గా చేశా. ఆయనతో కలిసి నటించడం చాలా గొప్ప ఎక్స్‌పీరియెన్స్. నా షూటింగ్ రోజు ఏడ్చేశా. అనురాగ్ నాకు ధైర్యమిచ్చారు. తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా వర్క్ చేశా. ఆ రోజు నేను నా భయాన్ని దాటేశా. ఇదంతా జరగకపోయి ఉంటే, ‘ఫెమ్మి ఫుడీ’ షో తర్వాత రెస్టారెంట్ ఓపెన్ చేద్దామనుకున్నా.
ఫ్యామిలీతో కష్టమే
నా యాక్టింగ్ కెరీర్ బాగానే జరుగుతోంది. ఆ టైంలో మా తమ్ముడికి పెండ్లి సెట్ అయింది. అప్పుడే నాకొక ప్రాబ్లమ్ వచ్చి పడింది. నేను స్విమ్ సూట్ వేసుకుని చేసిన యాడ్ టెలీకాస్ట్ అయింది. ‘మీ తమ్ముడి పెండ్లి కాబట్టి అది చిన్న ప్రాబ్లమ్ అయింది. అదే నీ పెండ్లి అయితే, ఎలా ఉండేది?’ అని అరిచారు అమ్మానాన్న. అందరూ ఇలాగే అనుకుంటే మన డ్రీమ్స్ ఎలా నెరవేరతాయి అని నేను వాదించా. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. వాళ్లు కూడా రియలైజ్ అయ్యారు. ఆ తర్వాత, మా నాన్న, తమ్ముడితో కలిసి ఒక జువెలరీ షాప్‌కి వెళ్తే అక్కడ నా జువెలరీ యాడ్ చూసి వాళ్లు రియలైజ్ అయ్యారు.
ప్లాట్ ఫాంతో ఏదైతేనేం..
యాక్టర్‌గా నేను తల్లి, కూతురు, సోదరి పాత్రల్లోనే కాకుండా ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్ క్యారెక్టర్ కూడా చేశా. కానీ, చిన్న వయసులో ఇద్దరు పిల్లల తల్లిగా చేయడం అనేది మరో డిఫరెంట్ ఛాలెంజ్. నేను పిల్లలతో టైం స్పెండ్ చేస్తా. వాళ్లని ఒక అత్తలా డీల్ చేయగలను. కానీ, అమ్మలా చేయాలంటే కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. పైగా నేను చేసిన తల్లి పాత్ర పిల్లల కోసం ప్రతీ పని చేస్తుంటుంది. అలాగే, ఒక యాక్టర్‌గా నాకు ప్లాట్‌ఫాం కంటే నేను పోషించే పాత్రే ముఖ్యం. నేను అందులో బాగా నటిస్తే అది మీడియంతో సంబంధం లేకుండా ఆడియెన్స్‌కి రీచ్ అవుతుంది. అంతేకాకుండా ఎంత ఎక్కువ పని చేస్తే అంత మంచిదని నమ్ముతా.
నా వీకెండ్ ఇది
నేను ఒక ఎన్.జి.ఓతో పనిచేస్తున్నా. వీకెండ్స్‌లో హోటల్స్, రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఫుడ్‌ని కలెక్ట్ చేసి, మురికి వాడల్లో ఉండే పేద పిల్లలకు పంచుతాం. పిల్లలకు బేసిక్ శానిటేషన్, హైజీన్ గురించి చెప్తుంటాం. నాకు మంచి ఫ్యామిలీ దొరికింది, మేం హ్యాపీగా ఉన్నాం. కానీ, రోజుకు ఒక్క పూట కూడా తిండి లేక మనచుట్టూ ఎంతో మంది ఉన్నారు. ప్రపంచాన్ని అందరికీ మంచి ప్రదేశంగా మార్చడానికి ఇది మా నుంచి చిన్న ప్రయత్నం. నాకు ట్రావెలింగ్ చేయడం, కొత్త కొత్త ప్లేస్‌లను ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. టైం దొరికినప్పుడు ట్రావెలింగ్ కూడా చేస్తుంటా.’’
:::ప్రజ్ఞ
- ‘డేట్ ఆజ్ కల్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించా.
- ‘విక్రమ్ వేద’లో చంద క్యారెక్టర్లో నటించా. లీడ్ రోల్ కాకపోయినా, ఇద్దరు పెద్ద యాక్టర్స్ కాంబినేషన్లో నటించడం గొప్పగా అనిపించింది.
- నాకు మణిరత్నం సినిమాలో నటించాలని ఉంది. అలాగే యాక్టర్స్‌లో విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. వాళ్లతో కలిసి నటించాలనుంది.
- ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’లో పవర్ఫుల్ గర్ల్ క్యారెక్టర్లో నటించా. నిజంగా ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది.
జాబ్ చేస్తే చాలనుకున్నా
కాలేజీ అయిపోయేంత వరకు ఒక్క ట్రిప్‌కి కూడా వెళ్లలేదు. అలా సాగింది నా చదువు. అయితేనేం, ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా డెస్క్‌లో కూర్చుని చేసే జాబ్ అయితే బాగుంటుందని కంప్యూటర్ సైన్స్ చదివా. నిజానికి నాకు ఎక్కువగా మాట్లాడడం అలవాటు. కానీ, దానికి వ్యతిరేకంగా నా జాబ్ ఎంచుకున్నా.
ఒకవేళ పెండ్లి చేస్తే, పాతికేండ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు పుట్టి ఉంటారు. వాళ్లు ఆడపిల్లలైతే, అబ్బాయి కోసం ఇంకో ప్రెగ్నెన్సీ ఉంచుకోమంటారు. అది అమ్మానాన్న అయినా లేదా అత్తామామ అయినా ఎవరైనా అంతే. ఆడపిల్ల అంటే చిన్నచూపు చూసేవాళ్లు అప్పట్లో. వంట, ఇంటి పనులే నేర్పిస్తారు. కానీ, చదివించడానికి వెనకాడతారు. అవన్నీ నేర్పించినా పనిచేసుకోవడానికి కాదు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడటానికి అసలే కాదు. ఒక అబ్బాయిని పెండ్లి చేసుకుని, వాళ్ల ఇంట్లో కోడలిగా వెళ్లి, అక్కడ ఇవన్నీ చేసి పెట్టడానికి. అది నాకు ఇష్టం లేదు. నేను బాగా చదువుకుని, జాబ్ చేయాలి అనుకున్నా. అదే చేశా