
మణిపూర్ లో ఇటీవల బయటికొచ్చిన హింసాత్మక, దారుణమైన ఘటనకు సంబంధించిన వీడియోపై దేశం మొత్తం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ ఘటనపై వీడియోలో ఉన్న ఒక బాధితురాలి తల్లి తన ఆవేదన వ్యక్తం చేశారు. "నా భర్తను, కుమారుడిని చంపేశారు. నా ఆశలన్నీ కుమారుడిపైనే ఉండేవి. చాలా కష్టపడి అతనిని స్కూల్కు పంపించాం. 12వ తరగతి పాస్ అవుతాడని భావిచాను. వారిని చంపిన తర్వాత నా బిడ్డను నగ్నంగా చేసి ఊరేగించారు. నా పెద్ద కుమారుడికి ఉద్యోగం లేదు. నేను నిస్సహాయత స్థితిలో ఉన్నాను. ఇక మేము ఆ గ్రామానికి తిరిగి వెళ్లలేము. వెళ్లాలని కూడా లేదు. మా ఇళ్లను తగలబెట్టారు. పొలాలను నాశనం చేశారు. మళ్లీ అక్కడికి వెళ్లి ఏం చేయాలి? గ్రామాన్నే తగలబెట్టేశారు. నా కుటుంబ భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా కోపంగా ఉంది. ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. దేశలోని తల్లిదండ్రులారా.. ఇదీ మా పరిస్థితి" అంటూ ఆ తల్లి కన్నీరు పెట్టుకోవడం తప్ప ఏం చేయని తన నిస్సహాయ స్థితిని వివరించింది.
ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిని అత్యాచారం చేసిన ఘటనకు సబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. వెంటనే నిందితులను శిక్షించాలని పలు రాజకీయ పార్టీలు, సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.