
పాట్నా : హిందూ దేవుళ్ల వేషధారణను ఎక్కువగా ఇష్టపడే బీహార్ పర్యావరణ శాఖ మం త్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్-జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ గురువారం ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. తాను కలలో శ్రీకృష్ణ భగవానుడిని చూశానని.. ఆయన తలపై కిరీటం, చేతుల్లో చక్రంతో పాటు ఇతర ఆయుధాలు స్పష్టంగా కనిపించాయన్నారు. మహాభారతంలోని సన్నివేశాలన్నీ తన డ్రీమ్ లోకి వచ్చాయని చెప్పిన తేజ్ ప్రతాప్.. దానికి సంబంధించిన ఓ వీడియోను కూడా తన ట్వీట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ‘‘అద్భుతంగా అలంకరించిన ఆయుధాలు, మిరుమిట్లు గొలిపే చక్రాలతో కిరీటం ధరించిన నీ విశ్వరూపాన్ని నేను ప్రతిచోటా చూస్తున్నాను. విశ్వం అద్భుతంగా ప్రకాశిస్తోంది’’ అని తేజ్ ప్రతాప్ ట్వీట్ చేశారు. షేర్ చేసిన వీడియోలో తేజ్ ప్రతాప్ నిద్రపోతున్నట్లు కనిపిస్తాడు. మహాభారత యుద్ధం, శ్రీకృష్ణుడు కనిపించడంతో దిగ్భ్రాంతికి గురై మేల్కొన్నట్లు వీడియోలో చూపించారు.