ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

పాలకుర్తి కాంగ్రెస్​ నేతలకు రేవంత్​రెడ్డి భరోసా

పాలకుర్తి, వెలుగు: అర్ధరాత్రి తలుపుకొట్టినా తీస్తానని, ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటానని టీపీసీసీ ప్రెసిడెంట్ ​రేవంత్​రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్​ నాయకులకు భరోసా ఇచ్చారు. ఆదివారం నియోజకవర్గంలోని దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, తొర్రూర్​, రాయపర్తి, పెద్దవంగర మండలాలకు చెందిన కాంగ్రెస్​ పార్టీ బ్లాక్, మండలాధ్యక్షులు హైదరాబాద్​లో రేవంత్​రెడ్డిని కలిశారు. రాష్ర్టంలో ఎన్నికల మూడ్​ ప్రారంభమైనా ఇప్పటికీ తమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాడర్ లేడని, పార్టీని ఎలా ముందుకు ఎలా తీసుకెళ్లాలని రేవంత్​రెడ్డితో చెప్పినట్లు సమాచారం. నాలుగేండ్లుగా పార్టీపై అభిమానంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మంత్రి ఎర్రబెల్లితో ఒంటరి పోరాటం చేస్తున్నామని తమ గోడును వెల్లబోసుకున్నట్లు సమాచారం. సుదీర్ఘంగా చర్చించిన రేవంత్​ రెడ్డి పాలకుర్తిలో పార్టీ బలోపేతానికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరమైతే నేనే పాలకుర్తికి వస్తానని భరోసా ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావుకు ధీటైన నాయకుడి కోసం అన్వేషిస్తున్నామని త్వరలోనే నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తానని నాయకులకు చెప్పినట్లు తెలిసింది. రేవంత్​రెడ్డిని కలిసిన వారిలో తొర్రూర్​బ్లాక్​ అధ్యక్షుడు జాటోతు అమ్యానాయక్​, పాలకుర్తి బ్లాక్​ అధ్యక్షుడు సత్యనారాయణ. మండలాల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్​, పెద్ది కృష్ణమూర్తి, ధారావత్​ సురేశ్ నాయక్​, ముద్దసాని సురేశ్, మాచర్ల ప్రభాకర్​, జక్కుల రాంరెడ్డి ఉన్నారు. 

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి జడ్పీ హైస్కూల్​లో 1989-–90 బ్యాచ్​కి చెందిన పదో తరగతి విద్యార్థుల సమ్మేళనం ఆదివారం  ఘనంగా జరిగింది.  చిన్ననాటి మిత్రుడు అక్షర చిట్ ఫండ్స్ చైర్మన్  శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళ్లనానికి వివిధ ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడ్డ మిత్రులందరూ హాజరయ్యారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అనంతరం వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మిత్రుల్లో ఒకరైన వర్ధన్నపేట పీఎసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్​ఖన్నా మాట్లాడుతూ... 32 ఏండ్ల తర్వాత క్లాస్​మేట్స్ ను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. 

సహకార వ్యవస్థలతో బ్యాంకులు బలోపేతం

హనుమకొండ  సిటీ, వెలుగు: సహకార బ్యాంకులు రైతులు, ప్రజలకు సేవ  చేసే గొప్ప అవకాశాన్ని కల్పించాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. ఆదివారం హనుమకొండలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌజ్​లో వరంగల్ డీసీసీ బ్యాంక్​ మీటింగ్ జరిగింది.  సమావేశంలో మంత్రి మంత్రి దయాకర్​రావు మాట్లాడుతూ సహకార వ్యవస్థతో బ్యాంకులను బలోపేతం చేయవచ్చన్నారు. డీసీసీ బ్యాంకుల ద్వారా ఎడ్యుకేషన్​ లోన్లు ఇస్తున్నామని, గోదాములు కడుతున్నామని చెప్పారు. డీసీసీబీలో మరో 10 బ్రాంచ్ లను ఓపెన్ చేయిస్తామన్నారు. డీసీసీబీ ప్రగతి నివేదికను చైర్మన్ మార్నేని రవీందర్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్​ద్వారా వివరించారు. వరంగల్ డీసీసీబీ 2019లో రూ.870 కోట్ల టర్నోవర్​ ఉండగా ఇప్పుడు అది రూ.1500 కోట్లకు చేరుకుందన్నారు. త్వరలో టర్నోవర్​రూ.2వేల కోట్లకు చేరుతుందన్నారు. సమావేశంలో బ్యాంక్ వైస్​ చైర్మన్ వెంకటేశ్వర్​ రెడ్డి, సీఈవో సీహెచ్ చిన్నారావు, టెస్కాబ్ , న్యాప్​ స్కాబ్ సీజీఎం కొండూరి రవీందర్​రావు పాల్గొన్నారు.

టీఎన్జీవోలు, టీజీవోలు ప్రభుత్వానికి రెండు కళ్లు 

హనుమకొండసిటీ, వెలుగు: టీఎన్జీవోలు, టీజీవోలు ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని క్రీడలు, యువజన, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక ​శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం రాత్రి హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ లో టీజీవో, టీఎన్జీవోల సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని, స్వరాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలను సహృదయంతో పరిష్కరించారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీప్ విప్​ దాస్యం వినయభాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నరేందర్,  టీజీవో సంఘం అధ్యక్షుడు జగన్ మోహన్​ రావు, సోమయ్య, వేణుగోపాల్ పాల్గొన్నారు. 

సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ

 నెల్లికుదురు, వెలుగు:  మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే శంకర్ నాయక్, సర్వాయి పాపన్న సినిమా హీరో  జై హింద్​గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్తీక మాస వన భోజనాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకొని  తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. సినీహీరో జై హింద్ గౌడ్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ చరిత్ర తెలుసుకొని ఆయన చరిత్రను సినిమా తీశానన్నారు. కార్యక్రమంలో గోపా జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, అనిల్ గౌడ్, గుట్టయ్య గౌడ్, చీకటి శ్రీనివాస్, సర్వాయి పాపన్న గౌడ్  విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కేయూ గ్రౌండ్​ను పరిశీలించిన నిపుణుల  బృందం

హసన్​పర్తి, వెలుగు: పోలీసు నియామకాల్లో భాగంగా ఫిజికల్​టెస్ట్​ల కోసం కేయూ గ్రౌండ్​ను  నిపుణుల బృందం  ఆదివారం పరిశీలించింది.  వరంగల్​ అదనపు డీసీపీ వైభవ్​ గైక్వాడ్​ మాట్లాడుతూ పోలీస్​అభ్యర్థులకు త్వరలో ఫిజికల్ టెస్ట్​ను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల బృందం పలు సూచనలు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తుల పరిశీలన, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు లాంగ్ జంప్ , షా ట్​పుట్​పిట్లు, 1600 మీటర్ల పరుగు ట్రాక్.. తదితరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధ్రువపత్రాల పరిశీలన, అప్​లోడ్​ చేసే విధానం, అభ్యర్థుల బయోమెట్రిక్​సేకరణ తీరును నిపుణుల బృందం వివరించింది. పరిశీలనలో నిపుణుల బృందం సభ్యులు శ్రీధర్, డీఎస్పీ రాంబాబు, కేయూసీ ఫిజికల్ డైరక్టర్ డా. సురేందర్​, అదనపు డీసీపీ సంజీవ్, ఏసీపీ నాగయ్య, కమ్యూనికేషన్ ఇన్​స్పెక్టర్​రమేశ్, ఐటీ కోర్ ఇన్​స్పెక్టర్​శ్రీనివాస్ రెడ్డి, కేయూసీ ఇన్​స్పెక్టర్​ దయాకర్ పాల్గొన్నారు. 

ఆదర్శ కాలనీవాసుల స్ఫూర్తి అభినందనీయం

వరంగల్​సిటీ, వెలుగు: స్వచ్ఛతలో ఆదర్శ కాలనీవాసుల స్ఫూర్తి అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. ప్రపంచ టాయిలెట్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం బల్దియా పరిధి 53 వ డివిజన్ ఆదర్శ కాలనీ లో జీడబ్ల్యూఎంసీ, ఆస్కి సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేయర్ గుండు సుధారాణి తో కలిసి చీఫ్ విప్ చీఫ్​గెస్ట్​గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అస్కీ ప్రతినిధి రాజ్ మోహన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్ విప్ మాట్లాడుతూ కార్పొరేషన్ తరఫున సెప్టిక్ ట్యాంక్​క్లీనింగ్ కోసం14420  టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, మున్సిపల్ సిబ్బందితోపాటు ప్రజలు భాగస్వామ్యంతో నగర పరిశుభ్రతకు, ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని చీఫ్ విప్ తెలిపారు. బహిరంగ మల విసర్జన రహిత నగరంగా  గ్రేటర్​వరంగల్  2020, 2021, 2022 లలో 3 సార్లు ఓ.డి.ఎఫ్(++)లు సాధించ హ్యాట్రిక్​కొట్టిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సోదా కిరణ్, మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్ బల్దియా ముఖ్య ఆరోగ్యాధికారి జ్ఞానేశ్వర్, ఎంహెచ్ఓ డా.రాజేశ్, శానిటరీ సూపర్​వైజర్​భాస్కర్, శానిటరీ ఇన్​స్పెక్టర్​ భీమయ్య, ఆస్కీ
 ప్రతినిధులు అవినాష్ ఓం ప్రకాశ్​ పాల్గొన్నారు.