మేడ్చల్‌‌లో పార్టీ ఏదైనా క్యాండిడేట్‌‌ను నేనే డిసైడ్ చేస్త: మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌‌లో పార్టీ ఏదైనా క్యాండిడేట్‌‌ను నేనే డిసైడ్ చేస్త: మంత్రి మల్లారెడ్డి

అసెంబ్లీ లాబీలో మంత్రి మల్లారెడ్డి


హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేయాలనేది తానే డిసైడ్ చేస్తానని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడాలో కూడా తానే నిర్ణయిస్తానని చెప్పారు. గతంలో కేఎల్ఆర్‌‌‌‌కు టికెట్ ఇప్పించానని, కాంగ్రెస్ అధిష్టానంలో తనకు దోస్తులు ఉన్నారని అన్నారు. గురువారం అసెంబ్లీ లాబీలోమీడియాతో మల్లారెడ్డి చిట్‌‌చాట్ చేశారు. 


రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తర్వాత తన గ్రాఫ్ పెరిగిందన్నారు. మీడియా అసత్య ప్రచారం చేస్తూ కక్షపురితంగా వ్యవహరిస్తోందని, త్వరలోనే మీడియా సంస్థ- పెడతానని, ఏడాదికి నాలుగు తెలంగాణ యాస సినిమాలు తీస్తానని చెప్పారు. బీజేపీలోకి వెళ్లిన వాళ్లందరూ బాధపడుతున్నారని అన్నారు. ‘‘ఈటల రాజేందర్ మంత్రిగా పని చేశారు. కానీ విషపూరిత కుట్ర చేశారు. అందుకే సీఎం కేసీఆర్‌‌‌‌తో ఉన్న 20 ఏండ్ల బంధం ఊడిపోయింది. 
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే ఉండి ఉంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటుండె. కాంట్రాక్టు కోసం పోయి.. ఎమ్మెల్యే పదవి పొగొట్టుకున్నరు” అని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి తానే సీఎం అని ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌‌లో గ్రూప్ రాజకీయాలు నడవవని, పార్టీ ఎవరికి బీ ఫామ్ ఇచ్చినా అందరూ కలిసి గెలిపించాల్సిందేనని చెప్పారు. లేదంటే చివరకు బీఫామ్ ఇవ్వరని అన్నారు.