కనీసం గవర్నర్ పదవికైనా గౌరవం ఇవ్వండి

కనీసం గవర్నర్ పదవికైనా గౌరవం ఇవ్వండి

హైదరాబాద్: తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని, తన పని తాను చేసుకుంటూ వెళ్తానని రాష్ట్ర గవర్నర్ తమిళి సై అన్నారు. గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ... కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్సిటీలు, ఆస్పత్రులు, హాస్టళ్లలో నెలకొని ఉన్న సమస్యల గురించి మాట్లాడితే ట్రోల్ చేస్తున్నారని, అది కరెక్ట్ కాదని అన్నారు. తనకు వ్యక్తి గతంగా ఎలాంటి గౌరవం ఇవ్వకున్నా ఫర్వాలేదన్న గవర్నర్... కనీసం గవర్నర్ పదవికైనా గౌరవం ఇవ్వాలని కోరారు. తాను ఏం మాట్లాడినా రాజకీయం అంటున్నారని..రాజకీయం లేనిది ఎక్కడో చెప్పాలని ప్రశ్నించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరానిదా అని గవర్నర్ తమిళి సై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇకపోతే... రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న గవర్నర్... ప్రభుత్వ తీరుపై బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు గవర్నర్ ను విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని గవర్నర్ కార్యాలయం రాజకీయాలకు అడ్డాగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు గవర్నర్ తమిళి సై ప్రయత్నిస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాన్ని గెలవలేమని బీజేపీ నేతలు గ్రహించారని, ఈ నేపథ్యంలోనే గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయని కవిత తెలిపారు. ఇక బీజేపీ డైరెక్షన్ లో గవర్నర్ తమిళి సై పని చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణలు చేశారు.