రైతులకు మద్దతుగా రేపు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేస్త : షర్మిల

రైతులకు మద్దతుగా రేపు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేస్త : షర్మిల

సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లుగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. బంగారు తెలంగాణను బార్ల తెలంగాణ చేశారని విమర్శించారు. ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని.. అన్ని వర్గాలను నిండా ముంచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికీ వైఎస్సార్ చేసిన అభివృద్ధే కనిపిస్తుందని చెప్పారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా మల్లాపూర్ మండలం ఓబుళాపురం వద్ద గ్రామస్థులతో ఆమె ముచ్చటించారు.

కేసీఆర్ తెలంగాణను దోచుకున్నది చాలక.. ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకు సిద్ధమయ్యారని షర్మిల విమర్శించారు. ఓట్లప్పుడు మాత్రమే కేసీఆర్ ఫామ్హౌజ్ నుంచి బయటకు వస్తాడన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో చెరుకు ఫ్యాక్టరీ మూసేశారని.. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. 100 రోజుల్లో కంపెనీ తెరిపిస్తామని హామీ ఇచ్చి మరిచారని.. చెరుకు రైతులకు మద్దతుగా రేపు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నాకి దిగుతానని షర్మిల ప్రకటించారు. 

16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పులకుప్పగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని షర్మిల ఎద్దేవా చేశారు. తెచ్చిన అప్పులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కాజేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు.కేసీఆర్ అరాచకాలను ప్రశ్నించే వారు లేరని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అమ్ముడుపోయాయని విమర్శించారు.