- బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది
- జనాలు మళ్లీ కేసీఆర్ నే కోరుకుంటున్నరు : మాజీమంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి, వెలుగు : ‘పాశమైలారం సిగాచీ కంపెనీలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల ఫ్యామిలీలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున ఇస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్, జిన్నారం, రాళ్లకత్వ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... సిగాచి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
కేసీఆర్ రాకముందు ఇస్నాపూర్ పారిశ్రామికవాడలో పవర్ హాలిడేస్ ఉండేవి.. ఆయన వచ్చాక 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పరిశ్రమల్లో ఓటీలు చేసి కార్మికులు అదనపు ఆదాయం సంపాదించుకున్నారన్నారు.
కాంగ్రెస్ గెలిచాక మళ్లీ కరెంట్ కోతలు మొదలయ్యాయని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. కొందరు పంచాయతీ సెక్రటరీలు, ఉద్యోగులు తన వద్దకు వచ్చి వాళ్ల బాధలు చెప్పుకున్నారని, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారన్నారు.
