
తిరుపతి: నాకు సీఎం పదవిపై ఆశ లేదు.. సీఎం కాకపోయినా సేవ చేస్తా.. అయితే ఇంకా ఎక్కువ చేస్తా..నని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైకాపా ప్రభుత్వం సామాన్యులపై ప్రతాపం చూపిస్తోంది.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తిరుపతి ఉఫ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా తిరుపతి శంకరంబాడి విగ్రహం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరఫున తిరుపతి ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడీ కూడలి వరకు పవన్ పాదయాత్ర చేస్తూ అభిమానులు, కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. అనంతరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తిరుపతిని ఎవరు అభివృద్ధి చేయగలరో ప్రజలు ఒకసారి ఆలోచించాలని సూచించారు. ఇంతమంది ఎంపీలున్నా రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ఢిల్లీలో ఇక్కడి సమస్యలు చెప్పడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. వైకాపాకు ఓటేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేనానికి ఘనస్వాగతం
ప్రతిష్టాత్మక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. బీజేపీ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారిణి అయిన రత్నప్రభ తరఫున పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు, రాయలసీమ నాలుగు జిల్లాల నుండి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున విమానాశ్రయం వద్దకు చేరుకొని ఘన స్వాగతం పలికారు.విమానాశ్రయ ప్రాంగణం జనసేన నినాదాలతో హోరెత్తించారు.అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుపతి లో జరిగిన బహిరంగ సభలో పాల్గొనడానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.