- ప్యాసెంజర్ గ్రోత్ లో సగం ఇక్కడి నుంచే
- ఐఏటీఏ అంచనా
- ఈ ఏడాది తగ్గనున్న గ్లోబల్ ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ లాభాలు
సియోల్ :ఇండియా, చైనాలే విమానయాన రంగాన్ని నడిపించబోతున్నాయట. వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే విమాన ప్రయాణికుల వృద్ధిలో సుమారు సగం ఈ దేశాల నుంచేనని గ్లోబల్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ ఐఏటీఏ అంచనావేస్తోంది. ఒకప్పుడు అందని ద్రాక్షలా ఉన్న విమానయానం, ఇటీవల సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇండియాలో ఎయిర్ ట్రాఫిక్ బాగా నమోదవుతోంది. ఈ ఐదేళ్లలో ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతోన్న డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్లలో ఇండియా ఒకటిగా ఉంటూ వచ్చింది. కానీ ఇటీవల ఇండియా విమానయాన రంగంలో నెలకొన్న అనూహ్య పరిణామాలతో ఏప్రిల్ నెలలో నెగిటివ్ వృద్ధి నమోదైంది. సడెన్‌గా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడం, బోయింగ్ మ్యాక్స్ విమానాలు కూలిపోవడం, ఫుల్ సర్వీస్ క్యారియర్ జెట్ ఎయిర్‌వేస్ మూత పడటంతో ఏప్రిల్‌లో ఇండియా విమానరంగ వృద్ధి నెమ్మదించింది. కానీ ఇండియన్ మార్కెట్‌లో నెలకొన్న ఈ నెగిటివ్ వృద్ధి తాత్కాలికమేనని, మార్కెట్ మరింత విస్తరిస్తుందని, ఇండియన్లు ఎక్కువ ట్రావెల్ చేయాలనుకుంటున్నారని ఐఏటీఏ చీఫ్ ఎకానమిస్ట్ బ్రియన్ పియర్స్ చెప్పారు.
ఐఏటీఏ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్. ఐఏటీఏ లో మొత్తం 290 ఎయిర్‌లైన్స్ సభ్యులు. ఈ అసోసియేషన్ వార్షిక సాధారణ సమావేశం సియోల్‌లో జరుగుతోంది. ఈ మీటింగ్‌లో పాల్గొన్న ఐఏటీఏ డైరెక్టర్ జనరల్, సీఈవో అలెగ్జాండ్రే డి జునియాక్.. అదనపు ప్యాసెంజర్ డిమాండ్‌లో మెజార్టీ వృద్ధి అభివృద్ధి చెందుతోన్న మార్కెట్లే అందిస్తున్నాయని తెలిపారు. వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రయాణికుల అడిషినల్ ట్రిప్స్‌లో సుమారు 45 శాతం ఇండియా, చైనాల నుంచే నమోదవుతుందని అంచనావేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇన్‌ఫ్రాక్ట్చ్రర్ సమస్యల గురించి మాట్లాడిన జునియాక్… రద్దీగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌లు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయని అన్నారు. ఆ ఎయిర్‌పోర్ట్‌లను, ఇన్‌ఫ్రాక్ట్చ్రర్‌ను ప్రయాణికుల ట్రాఫిక్‌కు అనుగుణంగా ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలని సూచించారు. కేర్‌ఫుల్ ప్లానింగ్, ఫండింగ్ ఆప్షన్స్‌ను పరిశీలించడం, అఫర్డబులిటీపై ఫోకస్ వంటివే విమానయాన్ని విజయవంతం చేస్తాయని జునియాక్ అన్నారు.
ఇయర్లీ బేసిస్‌లో ఇండియా విమాన ప్రయాణికుల వృద్ధి ఏప్రిల్ నెలలో 4.5 శాతం తగ్గినట్టు డీజీసీఏ ఏవియేషన్ రెగ్యులేటర్ విడుదల చేసిన డేటాలో వెల్లడైంది. గత ఐదేళ్లలో తొలిసారి ఏప్రిల్ నెలలోనే దేశీయ ఎయిర్ ట్రాఫిక్ నెగిటివ్ వృద్ధిని నమోదుచేసిందని ఐఏటీఏ తెలిపింది. ఈ నెగిటివ్ వృద్ధికి ప్రధాన కారణం జెట్ ఎయిర్‌వేసే. 2019లో గ్లోబల్ ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ 28 బిలియన్ డాలర్ల లాభాలను నమోదు చేయనుందని ఐఏటీఏ అంచనావేస్తోంది. అంతకుముందు అంచనావేసిన 35.5 బిలియన్ డాలర్ల కంటే కూడా ఇది తక్కువేనని ఐఏటీఏ చెప్పింది. ఇంధన ధరలు పెరగడం, బలహీనమైన ప్రపంచ వాణిజ్యం ఏవియేషన్ బిజినెస్‌లపై ప్రతికూల ప్రభావం చూపినట్టు పేర్కొంది. ఒక్కో ప్యాసెంజర్‌పై ప్రాఫిట్ 6.12 డాలర్లకు పడిపోనుందని, ఇది 2018లో 6.85 డాలర్లుగా ఉన్నట్టు ఐఏటీఏ అంచనా వేస్తోంది. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ కొనసాగితే, గ్లోబల్ ట్రేడ్ బలహీనపడే అవకాశముందని కూడా జునియాక్ చెప్పారు. ఇది ప్రధానంగా కార్గో వ్యాపారాలపై ప్రభావం చూపనుందని కానీ ఆందోళనలు పెరిగితే, ప్రయాణికుల ట్రాఫిక్ కూడా ప్రభావితమవుతుందని తెలిపారు. గతేడాది నుంచి అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే.
జెట్‌లోని 2 వేల మంది స్పైస్‌జెట్‌లోకి…
మూత పడిన జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన రెండు వేల మంది ఉద్యోగులను తన సంస్థలోకి నియమించుకోవాలని స్పైస్‌జెట్ ప్లాన్ చేస్తోంది.ఈ ఉద్యోగుల్లో పైలెట్లు, క్యాబిన్ క్రూ ఉన్నారు. తన ఆపరేషన్స్‌ను విస్తరిస్తోన్న క్రమంలో స్పైస్‌జెట్ ఈ ఉద్యోగులను నియమించుకుంటోంది. జెట్ వాడే 22 ఫ్లేన్స్‌ను కూడా ఈ ఎయిర్‌లైన్ తీసుకుంది. ‘ఇప్పటి వరకు సుమారు 1,100 మంది ఉద్యోగులను నియమించుకున్నాం. 2 వేల మంది వరకు జెట్ స్టాఫ్‌నే మేము తీసుకోవాలనుకుంటున్నాం. వీరు ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్, సెక్యురిటీకి చెందిన పైలెట్లు, క్యాబిన్ క్రూ ఉన్నారు’ అని స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ తెలిపారు.
ఐఏటీఏ బోర్డులోకి అజయ్ సింగ్
ఐఏటీఏ బోర్డులోకి స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ ఎంపికయ్యారు. ఈ ఎయిర్‌లైన్ ఐఏటీఏ అసోసియేషన్‌లో చేరిన మూడు నెలల వ్యవధిలోనే అజయ్ సింగ్ బోర్డులో చోటు దక్కించుకున్నారు. మూత పడిన జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్ కూడా చాలాకాలం ఐఏటీఏతో అసోసియేట్ అయ్యారు. అంతకుముందు బోర్డులో సభ్యుడిగా ఉండేవారు. ఈ గ్లోబల్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ కొత్త బోర్డుకి లుఫ్తాన్సా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్స్టెన్ స్పోహర్ నేతృత్వం వహిస్తారు. ఐఏటీఏ వార్షిక సాధారణ సమావేశం ముగిసిన తర్వాత ఈయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఏడాది కాలానికి ఐఏటీఏ బోర్డు ఆఫ్ గవర్నర్స్‌కు ఛైర్మన్‌గా కూడా స్పోహర్ బాధ్యత వహిస్తారు. ఐఏటీఏలో మెంబర్‌షిప్ తీసుకున్న తొలి ఇండియన్ లో కాస్ట్ క్యారియర్ స్పైస్‌జెటే. ఈ గ్రూప్‌లో ఇతర బోర్డు సభ్యులు ఎయిర్‌కెనడా ప్రెసిడెంట్, సీఈవో కలిన్, క్వాంటస్ సీఈవో అలన్ జాయిస్, ఖతర్ ఎయిర్‌వేస్ సీఈవో అక్బర్ అల్ బేకర్ ఉన్నారు.
