మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీపై ఫార్మా కంపెనీలతో చర్చలు

మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీపై ఫార్మా కంపెనీలతో చర్చలు

దేశంలో మంకీపాక్స్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీకి  కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు వివిధ ఫార్మా కంపెనీలతో చర్చించిన ఐసీఎంఆర్..మంకీపాక్స్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయాలని కోరింది. వీటితో పాటు రోగ నిర్థారణ కిట్లను కూడా తయారు చేయాలని సూచించింది.  వ్యాక్సిన్ అభివృద్ధి , డయాగ్నస్టిక్ కిట్‌ను పబ్లిక్-- ప్రైవేట్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేసేందుకు బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తి గల ఫార్మా కంపెనీలు ఆగస్టు 10 లోపు బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. 

మంకీపాక్స్‌ వ్యాక్సిన్‌  కోసం సీరం ప్రయత్నాలు..
మంకీపాక్స్‌ వ్యాక్సిన్‌  కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంస్థ సీఈవో అదర్ పూనావాలా పేర్కొన్నారు.  వ్యాక్సిన్‌ పంపిణీ అత్యవసరమైన సమయంలో  దిగుమతి చేసుకునేందుకు డెన్మార్క్‌ కు చెందిన ఓ  సంస్థతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కేసులు తక్కువగా ఉన్న నేపథ్యంలో..పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. మంకీపాక్స్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే విషయంలో ఇంకొన్ని రోజుల పాటు వేచి చూస్తామని..ఒప్పందం కుదిరితే రెండు మూడు నెలల్లోనే వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటామన్నారు. మనదేశంలో మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారు చేయడం ప్రారంభిస్తే..మార్కెట్లోకి వచ్చేందుకు కనీసం ఏడాదైనా సమయం పడుతుందన్నారు.  మంకీపాక్స్ కరోనా వలె మహమ్మారిలా వ్యాపించదని పూనావాలా అన్నారు. ప్రజలందరికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని..వ్యాప్తించిన ప్రాంతాల్లోనే వేస్తే చాలన్నారు. 

ఆందోళన అవసరం లేదు..
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న పరిస్థితిలో అందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్అన్నారు. మంకీపాక్స్ కేసులు పెరిగితే వాటిని అదుపు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మంకీపాక్స్ వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేసే సామర్థ్యం భారత్ ఉందని స్పష్టం చేశారు. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారు అధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించారు. 

ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్  శరవేగంగా వ్యాపిస్తోంది. 8 దేశాలలో 18,000 కంటే ఎక్కువ  కేసులు నమోదయ్యాయి. వీటిలో 70 శాతానికి పైగా కేసులు యూరోపియన్ దేశాల నుంచి రాగా..25 శాతం అమెరికా నుండి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.