కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ సంగతి తేల్చేందుకు సీరమ్ సర్వే

కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ సంగతి తేల్చేందుకు సీరమ్ సర్వే

న్యూఢిల్లీ: దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్​మిషన్ సంగతిని తేల్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్​మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) రెండు ‘సీరమ్ సర్వే’లు నిర్వహించనున్నాయి. వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు, నిఘా పెట్టేందుకు వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో ఈ సర్వేలు నిర్వహించనున్నట్లు ఐసీఎంఆర్ మంగళవారం వెల్లడించింది. ఆయా జిల్లాల్లో ర్యాండమ్ గా సెలక్ట్ చేసిన వ్యక్తుల నుంచి ఇండ్ల వద్ద నుంచి శాంపిళ్లు సేకరించి ఒక సర్వేను, కేవలం కొన్ని హాస్పిటళ్ల వద్ద మాత్రమే పేషెంట్లు, మెడికల్ స్టాఫ్​నుంచి శాంపిళ్లను సేకరించి మరో సర్వేను నిర్వహించనున్నట్లు పేర్కొంది.

తెలంగాణలో మూడు జిల్లాల్లో..

దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 69 జిల్లాల్లో సర్వే నిర్వహిస్తారు. ఈ సర్వే కోసం తెలంగాణలోని మూడు జిల్లాలను ఎంపిక చేశారు. కామారెడ్డి, జనగామ, నల్గొండలో టెస్టులు చేస్తారు.   ప్రతి జిల్లాలోని10 క్లస్టర్లలో ర్యాండమ్ గా 400 మంది నుంచి శాంపిళ్లు తీసుకుంటారు. ఇంట్లో ఒక్కరి నుంచి మాత్రమే శాంపిల్ సేకరిస్తారు. అలాగే కేసుల సంఖ్య ఆధారంగా 4 జిల్లాల్లో ర్యాండమ్​గా ఇండ్ల వద్ద నుంచి 24 వేల మంది నుంచి శాంపిళ్లు సేకరిస్తారు.

హాస్పిటళ్ల వద్ద సర్వే ఇలా..

ఈ సర్వేలో భాగంగా ప్రతి జిల్లాలో హై, లో రిస్క్ గ్రూపుల వ్యక్తులకు 6 గవర్నమెంట్, 4 ప్రైవేట్ హాస్పిటళ్లలో టెస్టులు నిర్వహిస్తారు.  ఔట్ పేషెంట్లుగా వచ్చేవాళ్లను లో రిస్క్ గ్రూపుగా తీసుకుంటారు. గర్బిణులు, హెల్త్ కేర్ వర్కర్లను హై రిస్క్ గ్రూపు కింద పరిగణిస్తారు. హై రిస్క్ గ్రూపు వారి నుంచి కనీసం వారానికి 100, నెలకు 400 శాంపిళ్లు తీసుకుంటారు. లో రిస్క్ గ్రూపు వారికి వారానికి 50, నెలకు 200 శాంపిళ్లు సేకరిస్తారు. మొత్తంగా వారానికి 200, నెలకు 800 శాంపిళ్లు సేకరిస్తారు.

ఏమిటీ సీరమ్ సర్వే?

ఏదైనా ఒక జిల్లాలో జిల్లా స్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తి, దానిపై నిఘా కోసం సీరమ్ సర్వేను నిర్వహిస్తారు. జిల్లాలో కొంతమంది వ్యక్తుల నుంచి సేకరించిన బ్లడ్ సీరమ్​ను టెస్ట్ చేయడాన్నే సీరమ్ టెస్ట్ అంటారు. సంబంధిత జిల్లాలో రాష్ట్ర హెల్త్ డిపార్ట్ మెంట్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్​తో కలిసి ఐసీఎంఆర్ దీనిపై పర్యవేక్షణ చేస్తుంది.

ఆర్ టీ పీసీర్.. ఎలీసా కిట్స్ కీలకం

సర్వే కోసం ఆర్​టీ పీసీఆర్, ఎలీసా యాంటీబాడీ కిట్లను ఉపయోగిస్తారు. ఆర్​టీ పీసీఆర్ టెస్టుల కోసం గొంతు, ముక్కు నుంచి స్వాబ్స్ సేకరిస్తారు. ఒకేసారి 25 శాంపిళ్లను కలిపి పూల్ టెస్ట్ చేస్తారు. అయితే, ఈ శాంపిల్ పూలింగ్ ద్వారా వచ్చే రిజల్ట్స్ ను కేవలం కరోనాపై నిఘా కోసం మాత్రమే ఉపయోగించుకుంటారు. పేషెంట్ల డయాగ్నసిస్ కోసం వాడుకోరు. ఎలీసా టెస్టులో ఐజీజీ యాంటీబాడీలను గుర్తించేందుకు రక్తం తీసుకుంటారు. చైనా ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లు సరిగ్గా పనిచేస్తలేవని తేలినందున పుణేలోని ఎన్ఐవీ సంస్థ ఎలీసా కిట్లను తయారు చేసింది. ఈ కిట్లు 92% కచ్చితత్వంతో పని చేస్తాయని కేంద్రం తెలిపింది. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ సంగతిని తేల్చడం, వ్యాధిపై నిఘాకు ఇవే కీలకమంటున్నారు.

ఉపయోగాలేంటి?

ఒక జిల్లాలో జనాభా ఆధారంగా ఎంపిక చేసిన హై, లో రిస్క్ గ్రూపులకు రొటీన్ టెస్టులకు అదనంగా సీరమ్ టెస్టులు చేస్తారు. దీనివల్ల ప్రభుత్వం, ఇతర సంస్థలు కరోనా ట్రెండ్స్ ను పర్యవేక్షించడం ఈజీ అవుతుంది. ముఖ్యంగా దేశంలో ఏ జిల్లాలోనైనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్​మిషన్ దశకు వెళ్లినట్లయితే, వెంటనే దానిని అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది.

అమెరికా నుంచి రాలేకపోతున్న ఇండియన్లు