హైదరాబాద్​లో ఐసీఎస్​సీ ఏడీఆర్​ సెంటర్​

హైదరాబాద్​లో ఐసీఎస్​సీ ఏడీఆర్​ సెంటర్​

హైదరాబాద్, వెలుగు: ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ కంపెనీ సెక్రెటరీస్​ ఆఫ్​ ఇండియా (ఐసీఎస్​సీ) దేశంలోనే మొట్టమొదటి ఆల్టర్నేటివ్​ డిస్పూట్​ రిజల్యూషన్​ సెంటర్ (ఏడీఆర్​)ను హైదరాబాద్​లో ఏర్పాటు చేయనుంది. రాబోయే మూడు నెలల్లో ఇది ప్రారంభమవుతుందని ఐసీఎస్​సీ నేషనల్​ ప్రెసిడెంట్​​ మనీశ్​ గుప్తా అన్నారు. ఏడీఆర్​పై హైదరాబాద్​లో శనివారం జరిగిన సదస్సు అనంతరం ఆయన మీడియాతో  మాట్లాడుతూ ఈ సెంటర్​కు ఇంటర్నేషనల్​ ఆర్బిట్రేషన్​ అండ్​ మీడియేషన్​ సెంటర్​ నాలెడ్జ్​ పార్టనర్​గా పనిచేస్తుందని వెల్లడించారు. 

కంపెనీల వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం చాలా ముఖ్యమని అన్నారు. ఏడీఆర్​ సెంటర్ల వల్ల సభ్యులకు, పార్టీలకు మేలు జరుగుతుందని  అన్నారు.  ‘‘కోల్​కతా, మనేసర్​లోనూ ఏడీఆర్​లను ఏర్పాటు చేస్తాం.  వీటి తర్వాత ముంబైలోనూ ఒకదానిని ప్రారంభిస్తాం. మౌలిక సదుపాయాలు  ఇది వరకే అందుబాటులో ఉండటం వల్లే హైదరాబాద్​లో మొదటి  ఏడీఆర్​ను ఏర్పాటు చేస్తున్నాం”అని గుప్తా వివరించారు. ఇలాంటి కేంద్రాలు దేశంలోని  ఐఎస్​సీఐ  72 చాప్టర్లలో అందుబాటులోకి వస్తాయి. 

సంస్థకు మనదేశంలో  రెండు పరిశోధన విభాగాలు కూడా ఉన్నాయి. దీనికి ఇండియాలో 71 వేల మంది సభ్యులు,  2.5 లక్షల మంది రిజిస్టర్డ్​ స్టూడెంట్స్​ ఉన్నారు.  ప్రపంచంలోని 1,05,000 మంది కంపెనీ సెక్రటరీలలో 71 వేల మంది ఇండియాలోనే ఉన్నారు. తెలంగాణలో 5500 మంది స్టూడెంట్లు, హైదరాబాద్‌‌లో 5000 మంది స్టూడెంట్లు, 2600 మంది సభ్యులు ఉన్నారు.