ఓటు వేయాలంటే గుర్తింపుకార్డు తప్పనిసరి : రాహుల్​రాజ్​

ఓటు వేయాలంటే గుర్తింపుకార్డు తప్పనిసరి : రాహుల్​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాహుల్​రాజ్​సూచించారు. అలాగే  ఓటు వేయాలంటే ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలన్నారు. శుక్రవారం గుర్తింపు కార్డుకు సంబంధించిన వాల్​పోస్టర్​ను డీఆర్​వో పద్మశ్రీతో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ఓటు హక్కు ఉన్న వారు ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు, పోస్టాఫీసు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్, కేంద్ర కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా(ఆర్టీఐ), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్ఎఐ) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు, భారతీయ పాస్ పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్​యూలు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత, మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజేబుల్ గుర్తింపు కార్డు (యూడీఐడీ) కలిగి ఉండాలనీ తెలిపారు.

అలాగే బూత్​ లెవల్​ అధికారులు అందించే ఓటర్ స్లిప్ అనేది పోలింగ్ కేంద్రాల సమాచారం తెలిపేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని, అది గుర్తింపు కార్డు కాదని స్పష్టం చేశారు. ఈ వాల్ పోస్టర్లను అన్ని పోలింగ్ కేంద్రాల్లో, బహిరంగ ప్రదేశాల్లో అతికించాలన్నారు. కార్యక్రమంలో రాజిరెడ్డి, బ్రహ్మాజి, ఎల్లయ్య, నరసింహారావు పాల్గొన్నారు.