గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రాలివ్వాలి

గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రాలివ్వాలి

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండు నెలలైనా గెలిచిన సంఘాలకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం, కేంద్ర కార్మిక శాఖ దోబూచులాడుతున్నాయని, వెంటనే గుర్తింపు సంఘాలకు పత్రాలు ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్​ చేశారు. 

మంగళవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్‌‌‌‌లో నిర్వహించిన కార్యకర్తల మీటింగ్‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసే స్ట్రక్చర్, జేసిసి సమావేశాలు యాజమాన్యం జరపడం లేదని ఆరోపించారు. గుర్తింపు పత్రాలు ఇవ్వాలని సింగరేణికి, చీఫ్ లేబర్ కమిషనర్​కు లేఖలు రాశామని, స్పందన రాకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మీటింగ్​లో యూనియన్​ లీడర్లు ఎల్లాగౌడ్, స్వామి, పోషం, బాజిసైదా, రమేశ్ కుమార్ పాల్గొన్నారు.