మీరు పీడీపీతో కలిసినప్పుడు.. మేం ఎన్సీపీతో కలిస్తే తప్పేంటి?

మీరు పీడీపీతో కలిసినప్పుడు.. మేం ఎన్సీపీతో కలిస్తే తప్పేంటి?
  • కలిస్తే ఏం అంటూనే ఖండించిన శివసేన చీఫ్ ఉద్ధవ్
  • కాంగ్రెస్, ఎన్సీపీతో ఇంత వరకూ చర్చించనే లేదు
  • బీజేపీకి ఇంకా డోర్స్ ఓపెన్‌గానే ఉన్నాయని ప్రకటన
  • కానీ, 50:50కి ఓకే చెబితేనే చర్చలకు రండి
  • రాముడిని పొగిడిన అదే నోటితో బీజేపీ నేతలు అబద్ధాలు ఎలా చెబుతున్నారు
  • బీజేపీపై విరుచుకుపడిన ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో 50:50 ఫార్ములాకు ఒప్పదం కుదిరిందన్న మాట అబద్ధమని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పడంతో ధానికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. ఎవరు అబద్ధాలు చెబుతారో ప్రజలందరికీ తెలుసని అన్నారాయన. అబద్ధాలు చెప్పడానికి తాను బీజేపీ నేతను కాదన్నారు. అచ్ఛేదిన్ మొదలు 50 రోజుల టైం ఇస్తే అంతా మార్చేస్తామని నోట్ బందీ సమయంలో చెప్పిన మాటల వరకు అన్నీ ప్రజలు చూశారంటూ బీజేపీపై సెటైర్లు వేశారు. తానెప్పుడూ బీజేపీని శత్రు పార్టీలా చూడలేదని, అబద్ధాలు చెప్పడం మానుకోవాలని ఫడ్నవిస్‌కు సూచించారాయన.

నేనెప్పుడూ మోడీని తిట్టలే..

మోడీని విమర్శించారనడంపైనా రియాక్ట్ అయ్యారు ఉద్ధవ్. తాను ఎప్పుడు విమర్శించానో చెప్పాలన్నారు. అంతటితో ఆగకుండా హర్యానాలో సీట్లు తగ్గడంతో పొత్తు పెట్టుకున్న దుష్యంత్ చౌతాలా గతంలో మోడీపై చేసిన ఆరోపణల వీడియోలను మీడియాకు చూపించారు ఉద్ధవ్. తాను ఎప్పుడూ మోడీని టార్గెట్ చేయలేదని, ఆయన తనను చిన్న తమ్ముడు అని పిలుస్తారని చెప్పారు. తాను మోడీని ఎప్పుడు తిట్టానో నిరూపించాలని బీజేపీకి సవాల్ విసిరారు.

తండ్రికి ఇచ్చిన మాట ప్రకారమే..

తన కుటుంబంపై ఎవరైనా విమర్శలు చేసిన తొలి సందర్భం ఇదేనని చెప్పారు ఉద్ధవ్. తన తండ్రి బాల్ ఠాక్రే అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నానని అన్నారు. ఠాక్రే కుటుంబం నుంచి ఒక రోజు మహారాష్ట్ర సీఎం వస్తాడని తన తండ్రికి గతంలోనే చెప్పానని, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. దానికి అమిత్ షా ఆశీర్వాదం అవసరంలేదన్నారు. బీజేపీ చర్చలకు వస్తే ఇప్పటికీ తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పారాయన. అయితే సీఎం, మంత్రి పదవుల విషయంలో 50:50కి ఓకే చెబితేనే రావాలని స్పష్టం చేశారు.

మేం లేకుండా ఎలా చేస్తారు?

ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారన్న వార్తల్ని ఉద్ధవ్ ఖండించారు. అయితే అలా ఏర్పాటు చేస్తే మాత్రం తప్పేంటని ప్రశ్నించారాయన. బీజేపీ కశ్మీర్లో పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు తాము ఎన్సీపీతో కలిస్తే తప్పేంటని అడిగారు. అయితే ఇప్పటి వరకూ తాను కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు జరపలేదని తెలిపారు. ఆప్షన్ ఓపెన్ అనడం ఫడ్నవిస్‌ను షాక్‌కు గురి చేస్తే.. ఇప్పుడు వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటుంటే తనకు ఇంకా షాకింగ్‌గా ఉందన్నారు ఉద్ధవ్. అదెలా సాద్యం.. కర్ణాటక తరహాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. అమిత్ షా అండ్ కో ను మహారాష్ట్రలో ఎవరూ నమ్మరని చెప్పారు.

రాముడిని పొగిడిన నోటితో అబద్ధాలు ఎలా చెబుతున్నారు

ధర్మాన్ని పాటించని వాళ్లు రాముడిని అనుసరిస్తున్నామని ఎలా చెబుతారంటూ బీజేపీపై ధ్వజమెత్తారు ఉద్ధవ్. రాముడిని పొగిడిన అదే నోటితో అబద్ధాలు ఎలా చెబుతున్నారో అర్థం కావడంలేదంటూ ఎద్దేవా చేశారు. బీజేపీది ఏ రకమైన హిందుత్వమో RSS చెప్పాలన్నారు. తనకు RSS అంటే గౌరవం ఉందని, తామది హిందూ పార్టీనో కాదో వాళ్లే చెప్పాలని కోరారు.