నష్ట పరిహారం అందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తం

నష్ట పరిహారం అందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తం

పది సంవత్సరాలుగా ముంపు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పరిహారం అందించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జగిత్యాల కలెక్టర్ ను ప్రశ్నించారు. వెల్గటూర్ మండలం ఎల్లంపల్లి ముంపు గ్రామం చెగ్యాం భూ నిర్వాసితులను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. నూతన ఆర్ అండ్ ఆర్ కాలనీ గవర్నమెంట్ స్కూల్ లో ఉన్న ముంపు బాధితులతో మాట్లాడిన వివేక్... వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ముంపు గ్రామస్థుల సమస్యలు పరిష్కరించాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు లో ఈ ఐదు(మొక్కట్రావ్ పెట్, చెగ్యాo, ఉండేడా, రాంనూర్, తాల్లకొత్త పేట) గ్రామాలను 30 పర్సెంట్ మాత్రమే ముంపు గ్రామంగా ప్రకటించారని వివేక్ వెంకటస్వామి అన్నారు. దానిని 100 పర్సెంట్ ముంపు గ్రామంగా ప్రకటించాలని అప్పటి ప్రభుత్వంపై  తాను ఒత్తిడి తీసుకువచ్చానని ఆయన గుర్తు చేశారు. 135 కుటుంబాలను ఈ వరద కష్టకాలంలో ఆదుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, ప్రభుత్వంపై ఉందని చెప్పారు. వరదలు వచ్చి ఇప్పటికే వారి ఇండ్లు కూలిపోయి బాధలో ఉంటే వారిని ఇలా రోడ్డు పై పడేయటమేంటని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్నపుడు వచ్చిన నష్ట పరిహారమే తప్ప ఇప్పటివరకు వారికి ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి వెంటనే నష్ట పరిహారం అందించకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.