కాంగ్రెస్ అధికారంలోకి వస్తే...సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తం

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే...సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తం

సెప్టెంబర్ 17 తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ విలీన వేడుకల్లో భాగంగా యాదగిరిగుట్ట కాంగ్రెస్ ఆఫీస్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ... రజాకార్లను తరిమికొట్టడంలో నల్గొండ జిల్లా ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపారు. సెప్టెంబర్ 17ను విమోచనం దినోత్సవంగా జరుపుతామని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రగల్భాలు పలికి, అధికారంలోకి వచ్చాక మాట మార్చిండని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిజాం, రజాకార్లను తరిమికొట్టడంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పోరాటం వెలకట్టలేనిదన్న ఆయన.. సాయుధ రైతాంగ పోరాటంతోనే నిజాం తోకముడిచిండని గర్వంగా చెప్పారు. 

అంతకుమునుపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంఛార్జ్ బీర్ల అయిలయ్య, తదితరులు వెంట ఉన్నారు.