రికార్డుల మీద కోహ్లీ పేరు కాదు..కోహ్లీ పేరు మీదే రికార్డులుంటాయ్

రికార్డుల మీద కోహ్లీ పేరు కాదు..కోహ్లీ పేరు మీదే రికార్డులుంటాయ్

రికార్డుల మీద తన పేరుండటం కాదు..తన పేరు మీదే రికార్డులుంటాయన్నట్లుగా దూసుకెళ్తున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. క్రికెట్ లో అసాధ్యమనుకున్న రికార్డులను తిరగరాస్తూ తనపేరుమీద లిఖించుకుంటున్నాడు. తాజాగా మరో రికార్డుపై విరాట్ కోహ్లీ కన్నేశాడు. లంకతో జరిగే వన్డే సిరీస్ లో సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్దమయ్యాడు. 

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్కు దూరమైన విరాట్ కోహ్లీ..మళ్లీ బ్యాట్ పట్టబోతున్నాడు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ ద్వారా బరిలోకి దిగబోతున్నాడు. ఈ సిరీస్లో సెంచరీ చేస్తే కోహ్లీ సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడు. సచిన్ టెండూల్కర్ స్వదేశంలో 164 మ్యాచుల్లో 20 వన్డే సెంచరీలు చేశాడు. కోహ్లీ ఇప్పటి వరకు 101 మ్యాచుల్లో 19 సెంచరీలు సాధించాడు. కోహ్లీ చివరి సారిగా భారత్ లో మార్చి 2019లో ఆస్ట్రేలియాపై శతకం బాదాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్కసెంచరీ కూడా చేయలేదు. దీంతో  శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో ఒక్క సెంచరీ చేస్తే సచిన్ సరసన చేరతాడు. స్వదేశంలో ఎక్కువ సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో సచిన్, కోహ్లీ తర్వాత స్థానాల్లో హషీమ్ ఆమ్లా (14), పాంటింగ్ (13), రాస్ టేలర్ (12) ఉన్నారు.

శ్రీలంకపై అధిక సెంచరీలు సాధించిన సచిన్ రికార్డును కోహ్లీ ఇప్పటికే సమం చేశాడు.  లంకపై  సచిన్ టెండూల్కర్ 84 మ్యాచుల్లో 8 సెంచరీలు సాధించాడు. శ్రీలంకపై కోహ్లీ 47 మ్యాచుల్లో 8 సెంచరీలు కొట్టాడు. మరో సెంచరీ చేస్తే..ఈ రికార్డును బ్రేక్ చేస్తాడు. మరోవైపు శ్రీలంకపై కోహ్లీ  2220 పరుగులు చేయగా..3113 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 18,426 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ తర్వాత సంగక్కర 14,234 (404 వన్డేలు),పాంటింగ్ 13,704 (375 వన్డేలు), సనత్ జయసూర్య 13,430 (445 వన్డేలు), జయవర్దనె 12,650 (448 వన్డేలు) పరుగులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో కోహ్లీ 12471 పరుగులతో ఆరో ప్లేస్లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న జయవర్ధనెను కోహ్లీ అధిగమించాలంటే మరో 181 పరుగులు చేయాలి.  శ్రీలంకతో సిరీస్‌లో ఆ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టే అవకాశం ఉంది.