మహబూబాబాద్: గత కొంతకాలంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫీజు విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు స్కూళ్ళ నిర్వాహకులు..ఫీజు చెల్లించని విద్యార్థులను బడిలోనే బంధించే విష సంస్కృతిని విస్తరిస్తున్నారు.
ఇటీవల నల్లగొండ జిల్లాలో ఫీజు కట్టలేదని ఇద్దరు నర్సరీ విద్యార్థులను స్కూల్ నిర్వాహకులు బంధించి పేరెంట్స్ ను నానా ఇబ్బందులు పెట్టారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇదే సీన్ రిపీటయ్యింది. అయితే ఇక్కడ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో విద్యార్థులను బంధించారు. స్కూల్ ఫీజు చెల్లిస్తేగానీ ఇంటికి పంపించమని పేరెంట్స్ ను ఇబ్బందులు పెట్టారు.
ALSO READ | అక్టోబర్2 నుంచి దసరా సెలవులు..విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లిలో విద్యాభారతి ప్రైవేట్ స్కూల్లో ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను గదిలో బంధించారు. దసరా సెలవులు కావడంతో విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లేందుకు పేరెంట్స్ స్కూల్ వద్దకు రాగా..ఫీజులు చెల్లిస్తేనే ఇంటికి పంపిస్తామని విద్యార్థులను ఓ రూంలో వేసి తాళం వేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. యాజమాన్యం తీరుకు ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.