
బిజినెస్ డెస్క్, వెలుగు: ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ క్రెడిట్ స్వీస్ మాత్రం దివాలా తీస్తే ఆ ప్రభావం ఇండియాపై డైరెక్ట్‌గా ఉంటుంది. ఈ బ్యాంక్‌కు మన దేశంలో రూ.20,700 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇండియాలో ఆపరేట్ చేస్తున్న ఫారిన్ బ్యాంకుల్లో ఇది12 వ అతిపెద్ద బ్యాంక్. బ్యాంక్ షేర్లు బుధవారం సెషన్‌లో 31 శాతం పడడంతో, క్రెడిట్ స్వీస్ కూడా దివాలా తీస్తుందా? అనే అనుమానాలు ఎక్కువయ్యాయి. తాజాగా దివాలా తీసిన యూఎస్ బ్యాంక్‌లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ), సిగ్నేచర్ బ్యాంక్‌లు డైరెక్ట్‌గా ఇండియాలో సర్వీస్‌లు అందించడం లేదు. అంతేకాకుండా ఇవి యూఎస్‌లో కూడా పెద్ద బ్యాంకులు కావు. కానీ, అతిపెద్ద యూరోపియన్ బ్యాంకుల్లో ఒకటైన క్రెడిట్ స్వీస్ దివాలా బాట పడితే ఇండియా, యూరప్, యూఎస్‌లో డైరెక్ట్‌గా ఆ ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు ఎస్‌వీబీలా క్రెడిట్ స్వీస్ రోడ్డెక్కితే, ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ కుదేలైపోదని ఎనలిస్టులు చెబుతున్నారు. దేశ బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఈ బ్యాంక్‌కు ఉన్న ఆస్తుల విలువ 0.1 శాతమే ఉంటుందని అంటున్నారు. కానీ, కన్జూమర్ బ్యాంకింగ్‌లో కంటే డెరివేటివ్స్ మార్కెట్ (ఫారెక్స్, ఇంట్రస్ట్ రేట్లు), ఫండ్స్‌లలో క్రెడిట్ స్వీస్ బాగా విస్తరించింది. ఈ సెగ్మెంట్‌లో ఈ బ్యాంక్‌కు ఉన్న ఆస్తుల్లో 60 శాతం అప్పు చేసినవేనని జెఫరీస్ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. వీటిలో 96 శాతం అప్పుల టెనూర్ మరో రెండు నెలల వరకే ఉందని తెలిపింది. ఫైనాన్షియల్ క్రైసిస్ (2008) టైమ్‌లో ఉన్న పరిస్థితులు ఇప్పుడులేవని, ఇన్వెస్టర్లు భయపడొద్దని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. ఈ సంక్షోభం త్వరలోనే ముగుస్తుందని పేర్కొన్నారు.
ఫారిన్ బ్యాంకులు పెద్దగా విస్తరించలే..
దేశ బ్యాంకింగ్ సెక్టార్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో క్రెడిట్ స్వీస్‌కు ఉన్న ఇంపార్టెన్స్‌ను చూసి ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకోవాలని జెఫరీస్ ఎనలిస్ట్ ప్రాఖర్ శర్మ , వినాయక అగర్వాల్ అన్నారు. లిక్విడిటీ సమస్యలను తీర్చడానికి, సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆర్‌బీఐ రెడీగా ఉండాలని పేర్కొన్నారు. క్రెడిట్ స్వీస్ ఇష్యూ వలన క్వాలిటీ బ్యాంకుల్లోకి డిపాజిట్లు పెరుగుతాయని అంచనావేశారు. ఫారిన్ బ్యాంకులు దేశ కన్జూమర్ బ్యాంకింగ్‌లో పెద్దగా విస్తరించలేదు. మొత్తం బ్యాంకింగ్ సెక్టార్ మేనేజ్ చేస్తున్న ఆస్తుల్లో వీటి వాటా 6 శాతమే ఉంటుంది. అప్పుల్లో 4 శాతం, డిపాజిట్లలో 5 శాతం ఉంటుంది. ఈ బ్యాంకులు ఎక్కువగా డెరివేటివ్ మార్కెట్ (ఫారెక్స్, ఇంట్రస్ట్ రేట్లు) లో యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో ఫారిన్ బ్యాంకులు వాటా 50 శాతం వరకు ఉంటుంది. క్రెడిట్ స్వీస్‌కు ఇండియాలో (ముంబైలో) నాలుగు బ్రాంచులున్నాయి. ఈ బ్యాంక్ ఆస్తుల్లో 70 శాతం ప్రభుత్వ షార్ట్ టర్మ్ సెక్యూరిటీలలో ఉన్నాయి.
లోన్లలో మొండిబాకీలు లేవు.
అప్పు దొరికిందోచ్..
లిక్విడిటీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న క్రెడిట్ స్వీస్, స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి 54 బిలియన్ డాలర్లను అప్పుగా తీసుకోనుంది. గ్లోబల్‌గా బ్యాంకింగ్ క్రైసిస్ నెలకొనడంతో బ్యాంకులకు సంబంధించి ఏ చిన్న సమస్య కనిపించినా, ఇన్వెస్టర్లు, కస్టమర్లు భయపడుతున్నారు. క్రెడిట్ స్వీస్ ఫండ్స్ సేకరించడంలో సక్సెస్ అవ్వడంతో గురువారం ఆసియా స్టాక్ మార్కెట్‌లలో అమ్మకాల ఒత్తిడి కొంత తగ్గింది. స్విస్ సెంట్రల్ బ్యాంక్ నుంచి 54 బిలియన్ డాలర్లను అప్పు తీసుకుంటున్నామని క్రెడిట్ స్వీస్ గురువారం పేర్కొంది. ఈ విషయాన్ని స్విస్ సెంట్రల్ బ్యాంక్ అధికారులు నిర్ధారించారు.
పెరగనున్న డాలర్ల ప్రింటింగ్
లిక్విడిటీ సమస్యలను తీర్చడానికి బ్యాంకింగ్ సెక్టార్‌కు 2 ట్రిలియన్ డాలర్లను యూఎస్ ఫెడ్ అందిస్తుందని జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో ప్రకటించింది. ఎమర్జెన్సీ లోన్ ప్రోగ్రామ్ కింద ఫెడ్ ఈ డబ్బులను బ్యాంకులకు ఇవ్వనుంది. ఒక విధంగా డాలర్లను ప్రింట్ చేసి, బ్యాంకుల్లోకి వదలనుందని అర్థం. కరోనా టైమ్‌లో ఇలానే డాలర్లను తెగ ప్రింట్ చేసిన యూఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఇన్‌ఫ్లేషన్ రూపంలో ఆ ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. డాలర్ల ప్రింటింగ్ పెంచితే ఇన్‌ఫ్లేషన్ మరింత
పెరుగుతుంది.
మనము స్ట్రాంగ్‌గానే..
గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్‌లలో సంక్షోభాలు కొనసాగుతున్నా, మన మాక్రో ఎకానమీ బెటర్ అవుతోంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.5 % కంటే దిగువన ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ 2 % కంటే దిగువకు వస్తుంది. ఆయిల్ ధరలు తగ్గడం కలిసొస్తోంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో కూడా ఇండియా స్ట్రాంగ్‌గా నిలబడగలదు.
- ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎండీ