సీజన్ మారితే మనిషి ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయా?

సీజన్ మారితే మనిషి ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయా?

రమ్య​ ఒక కాలేజీ స్టూడెంట్. చాలా తెలివైనది​. ఎప్పుడూ యాక్టివ్​గా ఉండేది. చదువులో ముందుండేది. ఫ్రెండ్స్, రిలేటివ్స్​​తో బాగా కలిసిపోయే మనస్తత్వం. తనలో ఎలాంటి స్ట్రెస్​ ఉన్నా, అస్సలు బయటికి కనిపించేది కాదు. కానీ, ఉన్నట్టుండి కొన్ని రోజులుగా తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్లు డల్​గా ఉంటోంది. చదువు మీద ధ్యాస లేదు. ఎవరితోనూ కలవట్లేదు. కారణం లేకుండా కోపం తెచ్చుకుంటుంది. ఎక్కువ సేపు నిద్రపోతోంది. నచ్చినవి వండి పెట్టినా సరిగా తినట్లేదు. ఒక్కసారిగా తనలో ఇన్ని మార్పులా? ఎందుకలా ఉంటోంది? ఎంత ఆలోచించినా తల్లిదండ్రులకు అర్థం కాలేదు. 

ప్రాబ్లమ్​ ఏంటో తెలుసుకోవడానికి డాక్టర్​ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు అర్థమయ్యింది వాళ్లకు.. రమ్యకి సీజనల్ ఎఫెక్టివ్​ డిజార్డర్ (ఎస్.ఎ.డి) ఉంది. అందుకే ఈ మార్పులు కనిపిస్తున్నాయి అని. ఈ డిజార్డర్​ ఉన్నా కొందరు దీన్ని గుర్తించలేకపోవచ్చు. మరికొందరు మూడ్ బాలేదేమో అని ఊరుకుంటారు. కానీ, ‘సమస్య ఎలాంటిదైనా దాన్ని తగిన పద్ధతిలో ట్రీట్​ చేయాలి’ అంటున్నారు​ డాక్టర్ జ్యోతిర్మయి.

సీజన్ మారితే వాతావరణంలో మార్పులు వస్తాయి. కానీ, మనిషి ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయా? అంటే వస్తాయనే చెప్పాలి.  సీజనల్ ఎఫెక్టివ్​ డిజార్డర్ ​(SAD) అనేది చలికాలంలో మొదలవుతుంది. వేసవికాలం మొదట్లో దానంతట అదే తగ్గిపోతుంది. చాలా తక్కువమందికి వేసవిలో మొదలై, శీతాకాలంలో ఆగిపోతుంది. ఈ కండిషన్​ని ‘వింటర్​ బ్లూస్’ అని కూడా అంటారు. ఏదేమైనా ఈ కండిషన్​లో ఉన్నవాళ్లని భరించడం మిగతా ఫ్యామిలీ మెంబర్స్​కి కష్టం అవుతుంది. పైగా దీని బారిన పడేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువగా ఉంటారు. దిగులు, బాధ, ఏడవడం, ఏకాగ్రత లోపించడం, నీరసం వంటివి ఇందులో కనిపించే లక్షణాలు. కొందరు ఎక్కువగా నిద్రపోతే, మరికొందరు చాలా తక్కువ నిద్రపోతారు. ఈ డిప్రెషన్ పర్సంటేజీ ఎక్కువైతే సూసైడ్​ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తుంటాయి. 

అసలు ఎందుకిలా?

మన బాడీకి బయోలాజికల్ క్లాక్ లేదా సర్కేడియన్ రిథమ్ అనేది ఉంటుంది. అంటే, పొద్దున లేవడం నుంచి రాత్రి పడుకునేవరకు ఒక టైం ప్రకారం జరగడం. కానీ, వింటర్​ వచ్చిందంటే చాలామందిలో ఆ టైం తప్పిపోతుంది. చాలామంది పొద్దున పూట ఎక్సర్​సైజ్ చేయడం మానేస్తుంటారు. అలాగే వింటర్​లో పగటిపూట కాంతి ఉండదు. కాబట్టి దానివ్లల డి – విటమిన్​ లోపిస్తుంది. ఈ కారణాల వల్ల వాళ్లలో ఆ క్లాక్ సరిగా పనిచేయదు. అందుకే ప్రవర్తన​లో మార్పులు వస్తాయి. ఇవేకాకుండా సెరటోనిన్ తగ్గడం వల్ల, మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ లెవల్స్ సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ వస్తుంది. 

వీళ్లలో ఎక్కువ

ఫ్యామిలీలో ఉంటే అది వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంది. బైపోలార్​ డిజార్డర్​ ఉన్నవాళ్లు లేదా అప్పటికే డిప్రెషన్​లో ఉన్నవాళ్లలో ఈ డిజార్డర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉత్తర, దక్షిణ ధృవాలకు దగ్గరగా ఉండేవాళ్లు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. కొన్ని స్టడీలు విటమిన్​ – డి లోపం వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నాయి. 20 నుంచి 30 ఏండ్ల మధ్య ఉన్నవాళ్లలో ఇది కనిపిస్తుంది. కానీ, చలి దేశాల్లో ఈ డిజార్డర్ ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయి. 

సొల్యూషన్ ఏంటి?

టైంకి తినడం, ఎక్సర్​సైజ్ చేయడం, అందరితో కలుస్తుండడం వంటివి రెగ్యులర్​గా చేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. లేదంటే, ఈ సీజన్​ వచ్చే ముందే జాగ్రత్తపడాలి. సమస్య ఎక్కువగా ఉంటే, మెంటల్​ హెల్త్​ ఎక్స్​పర్ట్​​ని అడిగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రీట్​మెంట్​ తప్పదు అనుకుంటే.. ఈ ప్రాబ్లమ్​ని లైట్​ థెరపీ, సైకో థెరపీ లేదా కౌన్సెలింగ్, మెడికేషన్ ద్వారా ట్రీట్​ చేస్తారు. 

లైట్​ థెరపీ : వైట్, ఫ్లోరోసెంట్ లైట్ వాడతారు. వీటికి ప్లాస్టిక్ స్క్రీన్ వేసి ఉంటాయి. ఇవి సాధారణంగా వాడే వాటికంటే ఎక్కువ కాంతినిస్తాయి. ఈ లైట్​లో మార్నింగ్​ పావుగంట నుంచి అరగంట వరకు ఉండాలి. దానికి రిలేటెడ్​ కొన్ని సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయి. అవన్నీ చెప్పే థెరపీ చేస్తారు. ఈ థెరపీతో మూడు రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. కాకపోతే సమస్య తీవ్రత బట్టి మరికొన్ని వారాలు ఈ థెరపీ కంటిన్యూ చేయాలా? వద్దా? అనేది ఉంటుంది.

సైకో థెరపీ : ఎక్కువగా మాట్లాడించడం, నెగెటివ్ ఆలోచనలు రాకుండా చేయడం, సరైన పొజిషన్​లో నిద్ర పోయేలా చేయడం, ఫిజికల్ యాక్టివిటీస్ చేయించడం వంటివి ఇందులో ఉంటాయి.
మెడికేషన్​ : యాంటీ డిప్రసెంట్, యాంగ్జైటీకి, నిద్రకు ఇలా కొన్నిరకాల మెడికేషన్స్ ఉంటాయి. అయితే, మెడికేషన్​ వరకు వెళ్లకుండా... లైట్​ థెరపీ చేయించుకోవడం బెటర్.